గ్రామాలను అభివృద్ధి చేయాలి
Published Tue, Oct 22 2013 2:25 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM
మర్రిగూడ, న్యూస్‌లైన్ :‘మన కోసం మనం’ కార్యక్రమం ద్వార గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారు. సోమవారం మర్రిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన కోసం మనం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు ప్రవేశ పేట్టిన మనకోసం మనం కార్యక్రమం ద్వారా సాధించుకోవచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధన ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు, గ్రామ సర్పంచ్‌లు సమన్వయంతో పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మార్పు తీసుకొచ్చిన ముగ్గురు సర్పంచ్‌లకు నగదు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉండేలా చూసి ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలని కోరారు. జిల్లాలో ప్రతి వెయ్యి మంది మగ వారికి 856 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారని తెలిపారు. లింగ వివక్షను రూపు మాపేందుకు కృషి చేయాలని కోరారు. డ్వామ పీడీ కోటేశ్వర్‌రావు మాట్లాడుతూ ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవడానికి గానూ ఉపాధిహామీ పథకం ద్వారా రూ. 9100లను అందజేస్తున్నట్లు తెలిపారు. ఆనతరం సాక్షరభారత్ ఆధ్వర్యంలో ప్రచురించిన పుస్తకాలను పంపిణీ చేశారు. కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లను సన్మానించారు. కార్యక్రమంలో మర్రిగూడ మండల ప్రత్యేకాధికారి పావులూరి హనుమంతరావు, ఎంపీడీఓ బి.ఉష, తహసీల్దార్ డి.గోవర్దన్, ఎంఈఓ టి.తిరుపతిరెడ్డి, సీనియర్ పబ్లిక్ హెల్త్ అఫీసర్ ఎస్.దాస్‌నాయక్, ఎస్‌ఐ కె.శంకర్‌రెడ్డి, ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ త్వరలో పూర్తి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మర్రిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. మన తెలంగాణను మనం సాధించుకున్నామని, ఇక అభివృద్ధి వైపు అడుగులు వేయాల్సి ఉందన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేన్నమనేని రవీందర్‌రావు, వజ్రమ్మ, రమావత్ భీమానాయక్, సర్పంచ్‌లు పాశం సురేందర్‌రెడ్డి, పాముల యాదయ్య, రాచమళ్ల నరేందర్‌రెడ్డి, నాయకులు ఏర్పుల యాదయ్య, చెరుకు లింగం తదితరులు పాల్గొన్నారు.
Advertisement