
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఐఏఎస్ అధికారులకు జిల్లా కలెక్టర్‌గా ఒకటి రెండు మార్లే అవకాశం వస్తుంది. ఆ కాలంలో జిల్లాలో విస్తృతంగా పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని వారు పరితపిస్తారు. కానీ తొలిసారి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వాడ్రేవు వినయ్‌చంద్ మాత్రం అందుకు భిన్నం. ఆయన ప్రకాశం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి నేటితో సరిగ్గా రెండేళ్లు. ఈ పాలనా కాలంలో జిల్లా ప్రజల సమస్యలు పట్టించుకొని పరిష్కరించిన దాఖలాలు లేవు. అధికార పార్టీ నేతలు చెప్పింది చేయడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. అందుకే వారికి తప్ప ప్రజలకు దగ్గర కాలేక పోయారు.
గ్రీవెన్స్ డేకూ దూరం.. దూరం..
వెనుకబడిన ప్రకాశం జిల్లా కరువుతో పాటు తాగు, సాగునీటి ఇబ్బందులకు నిలయం. దీని పర్యవసానంగా ప్లోరైడ్, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కేంద్రంగా మారింది. ఏటా వందల సంఖ్యలో కిడ్నీ మరణాలు ఇక్కడ సర్వ సాధారణమయ్యాయి. ప్రజలకు సురక్షిత తాగు నీరందించాలన్న ఆలోచన పాలకులకు రాలేదు. ఆదిశగా కలెక్టర్ వినయ్‌చంద్ తీసుకున్న చర్యలు శూన్యం. వేలాది గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులున్నా కనీసం వందల సంఖ్యలో గ్రామాలకు కూడా ప్రభుత్వం తాగునీటి అందిస్తున్న దాఖలాలు లేవు. అందులో కూడా సగం అవినీతే. దీనిపై రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదులున్నా చర్యలు లేవు. జిల్లా కలెక్టర్ వారి జోలికెళ్లరు. సామాన్య జనమన్నా.. వారి సమస్యలన్నా ఆయనకు చిరాకేమో! గ్రీవెన్స్ డేకు సైతం ఆయన అరుదుగా మాత్రమే హాజరవుతూ ఉంటారు.
రైతుల గోడు పట్టలేదు..
జిల్లాలో పొగాకు, సుబాబుల్, జామాయిల్ రైతుల కష్టాలకు కొదువలేదు. వారికి గిట్టుబాటు ధర లభించదు. కర్రకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ఇక్కడి కలెక్టర్‌స్పందించి చొరవ చూపిన దాఖలాలు లేవు. రైతులు, రైతు సంఘాల నేతలు కలెక్టరేట్ అంటేనే విముఖత వ్యక్తం చేసే పరిస్థితి. ఇక జిల్లా లో అధికంగా రైతులు పండించే కందులు, శనగల కొనుగోళ్లలో కొందరు అధికారులు అక్రమాలకు తెరలేపి రైతుల నోళ్లు కొట్టినా కలెక్టర్ స్పందించిన దాఖలాలు లేవు. మార్కెఫెడ్ అధికారులు రైతుల వద్ద కాకుండా టీడీపీ నేతల వద్ద కందులు, శనగలు కొన్నా వారిపై చర్యలు లేవు.
దేవరపల్లి వైపు తొంగి చూడలేదు..
దళితుల సమస్యలపైనా కలెక్టర్ స్పందన కనిపించన పరిస్థితి. ఉదాహరణకు దేవరపల్లె దళితుల భూ సమస్య జిల్లానే కాకుండా రాష్ట్రాన్నే కుదుపు కుదిపింది. దశాబ్దాలుగా దళితుల స్వాధీనంలో ఉన్న భూములు అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. చెరువు తవ్వకమంటూ రాత్రికి రాత్రే పనులు చేపట్టారు. అయినా పాలనా«ధికారి ఆ వైపు తొంగి చూడలేదు. సమస్య జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి మారినా ఆయనలో స్పందన లేదు. ఇరుపక్షాలను పిలిపించి సమస్యను పరిష్కరించాల్సిన కలెక్టర్ మౌనముద్ర దాల్చటంతో ఇది శాంతిభద్రతల సమస్యగా ఉత్పన్నమైంది. సాక్షాత్తు జిల్లా రెవెన్యూ అధికారి, తహశీల్దార్ దళితుల భూముల స్వాధీనంలో కీలకపాత్ర పోషించారని దేవరపల్లె దళితులు నెత్తినోరు బాదుకున్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రితో పాటు జిల్లాకు చెందిన ఎస్సీ కమిషన్ చైర్మన్ సైతం దేవరపల్లె విషయంలో ప్రభుత్వం, అధికారులు తప్పు చేశారని బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇది జిల్లా పాలనాధికారికి మచ్చ తెచ్చిన విషయమే.
♦ రిమ్స్ మెడికల్ కళాశాల విద్యార్థుల కోర్సు పూర్తయి చాలా కాలం అయినా కళాశాలకు ఎంసీఐ అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు నెత్తినోరు బాదుకున్నారు. సకాలంలో ఎంసీఐ రాకపోవడంతో ఆందోళనకు గురైన విద్యార్థులు జిల్లా కలెక్టర్ బంగ్లాను ముట్టడించారు. వైద్య విద్యార్థులకు బాసటగా నిలిచి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాల్సిన పాలనాధికారి ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు.
♦ జిల్లాలో తాగు, సాగునీటి సమస్య తలెత్తినప్పుడు స్పందించి ప్రజాప్రతినిధులతో సమావేశం పెట్టి సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్‌పై ఉన్నా వినయ్‌చంద్ ఆ దిశగా చేసిన ప్రయత్నాలు తక్కువనే చెప్పాలి. గత ఏడాది సాగర్‌లో నీళ్లున్నా ఆయకట్టుకు తగినంత నీరు తీసుకరావడంలో పాలనాధికారి విఫలమయ్యారు.
♦ ఈ–ఆఫీస్ పైన కలెక్టర్ పెద్దగా శ్రద్ధ పెట్టినట్లు కనిపించడం లేదు. ఈ–ఆఫీస్ వేగవంతం చేయాలంటూ ప్రభుత్వం పదే పదే చెబుతున్నా.. జిల్లాలో ఆ ప్రయత్నం వేగం పుంజుకోలేదు. గత కలెక్టర్ హయాంలో ఈ–ఆఫీస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా మొదటి మూడు స్థానాల్లో ఉండింది. నేడు పరిస్థితి బిన్నంగా మారింది.
♦ గ్రీవెన్స్ డే వినతుల పరిష్కారానికి కలెక్టరేట్‌లో పెద్దగా కసరత్తు జరగడం లేదు. ప్రజాలిచ్చిన వినతులు ఎంత మేర పరిష్కారమయ్యాయన్న విషయంపై వారం వారం రివ్యూ సమావేశాలు నిర్వహిస్తే అధికారులు త్వరగా పరిష్కరించేందుకు అవకాశం ఉండేది. కానీ కలెక్టర్ ఈ విషయంలో మొక్కుబడి సమావేశాలకు పరిమిత మయ్యారు. జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలనూ ఆన కిందిస్థాయి అధికారులపై తోసి తనకేమీ పట్టనట్లుండి పోతున్నారన్న విమర్శ ఉంది.
♦ నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి తీసుకోవాలన్న అధికార పార్టీ నేత ప్రయత్నాలను అప్పట్లో ఇరిగేషన్ ఎస్‌ఈ అడ్డుకున్నా జిల్లా పాలనాధికారి స్పందించ లేదు. విలువైన ప్రభుత్వ స్థలాలు పార్టీ కార్యాలయాలకు అప్పగిస్తే ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు లేకుండాపోయే ప్రమాదం ఉంది. అధికార పార్టీ నేత పట్టుపట్టి ఇరిగేషన్ ఎస్‌ఈని బదిలీ చేయించారు. అధికార పార్టీ నేత జిల్లా స్థాయి అధికారిని బదిలీ చేయిస్తే ప్రధాన అధికారి పట్టించుకోకపోతే మిగిలిన అధికారుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు వాపోతున్నారు.
♦ జిల్లాలో అభివృద్ధి పనుల టెండర్ల వ్యవహారం రచ్చకెక్కింది. పేరుకు ఈ–టెండర్లు అయినా అధికార పార్టీ నేతలు, కొందరు అధికారులు కుమ్మక్కై కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారు. కొందరు అధికారులు వాటాలు తీసుకొని పనులను అబౌ రేట్లకు కేటాయించి ప్రజాధనానికి గండికొట్టారు. వెలిగొండ, గుండ్లకమ్మ పునరావాస పనుల టెండర్లలో ఇదే జరిగింది.
♦ కార్పొరేషన్ టెండర్ల వ్యవహారం ఇంతకు మించి అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. వేరే కాంట్రాక్టర్లు పోటీకి రాకుండా అధికారులే అడ్డుకుంటున్నారు. ఇష్టానుసారంగా అబౌ రేట్లకు పనులు అప్పగిస్తున్నారు. జిల్లా పాలనాధికారి ప్రత్యేకాధికారిగా ఉన్నా... ఇక్కడి అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు.
♦ అధికార పార్టీ ఒత్తిడులతో జిల్లాలో కొందరు కింది స్థాయి అధికారులు ఇబ్బందులు పడుతుండగా వారికి పెద్ద దిక్కుగా భరోసా కల్పించాల్సిన పాలనాధికారి మౌనంగా ఉన్నారని, కొందరు అధికారులు పార్టీ నేతల అండ చూసుకొని చెలరేగిపోతున్నా వారిపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవని అధికార వర్గాలే విమర్శిస్తుండటం గమనార్హం.
జిల్లా పాలనాధికారి జిల్లా పరిషత్ సమావేశానికి ఎగనామం పెట్టారు. కలెక్టర్ సమావేశానికి రావాలని జడ్పీ సర్వసభ్య సమావేశం పలుమార్లు తీర్మాణం చేసింది. కలెక్టర్ రావాలంటూ సభ్యులు ఆందోళన కూడా నిర్వహించారు. అయినా కలెక్టర్ వినయ్‌చంద్ జడ్పీ సమావేశానికి హాజరైన సందర్భాలే లేవు.
జిల్లాలో సహకార వ్యవస్థలను అధికార పార్టీ నేతలు నిర్వీర్యం చేసినా కలెక్టర్‌గా వినయ్‌చంద్ అటువైపు తొంగి చూడలేదు. ఒంగోలు డెయిరీ వివాదం రచ్చ కెక్కింది. సంఘాలను నిర్వీర్యం చేసి ఆస్తులు కొల్లగొట్టేందుకు పాలకవర్గం ప్రయత్నించింది. పీడీసీసీబీ, డీసీఎంఎస్‌లు రోడ్డున పడ్డాయి. వీటి పంచాయితీలు ముఖ్యమంత్రి స్థాయిలో నడిచాయి. కానీ కలెక్టర్‌కు మాత్రం ఇవేవీ పట్టలేదు. మొత్తంగా ప్రకాశం కలెక్టర్ వినయ్‌చంద్ రెండేళ్ల పాలనలో జిల్లాలో పాలనకు పక్షవాతం సోకిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment