
గణనాథుడికి వర్షంలోనే వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: ముంబై మహానగరం తరువాత దేశంలోనే అత్యంత వైభవంగా నిర్వహించే వినాయక నిమజ్జన వేడుకలు బుధ వారం హైదరాబాద్‌లో కన్నుల పండువగా జరిగాయి. కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అశేష భక్తజనులు ట్యాంక్‌బండ్‌పైకి చేరుకొని గణనాథుడికి వీడ్కోలు పలికారు. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్యాంక్‌బండ్‌పై పెద్దఎత్తున వరద నీరు చేరింది. అయినప్పటికీ భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. తొమ్మిది రోజుల పాటు భక్తజనుల పూజలను అందుకున్న వినాయకుడు మేళతాళాలు, బాజాభజంత్రీలు, నృత్యప్రదర్శనల నడుమ హుస్సేన్‌సాగర్ ఒడికి చేరుకున్నాడు.
విభిన్న వర్గాల ప్రజలు, విభిన్న సంస్కృతులను ప్రతిబింబించే విధంగా సాగిన శోభాయాత్ర భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటింది. ఉదయం 10.30 గంటలకు బాలాపూర్‌లో లడ్డూ వేలం పాట ముగిసిన అనంతరం ప్రారంభమైన శోభాయాత్ర నెమ్మదిగా సాగింది. సాయంత్రం కురిసిన వర్షానికి నిమజ్జనానికి తరలి వచ్చిన పలు విగ్రహాలు వాహనాల్లోనే కరిగిపోయాయి. కవాడీగూడలో ఏర్పాటుచేసిన 60 అడుగుల మట్టి విగ్రహాన్ని అక్కడే పైపుల ద్వారా నీటిని చిమ్ముతూ నిమజ్జనం చేశారు. భాగ్యనగరంతోపాటు, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు, విదేశీయులు సైతం శోభాయాత్రలో పాల్గొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ తదితర జిల్లాల నుంచి కూడా విగ్రహాలు ట్యాంక్‌బండ్ కు తరలి వచ్చాయి. పలు చోట్ల ముస్లిం సోదరులు సైతం వేడుకల్లో పాల్గొని విగ్రహాలకు స్వాగతం పలికారు.
ఖైరతాబాద్ గణపతి లడ్డూ వర్షార్పణం
ఖైరతాబాద్ మహా గణపతికి ఏటా భారీ లడ్డూను నైవేద్యంగా నివేదిస్తుంటారు. ఈసారి గణపతి చేతిలో ఉంచిన 4,200 కిలోల లడ్డూ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. లడ్డూను ప్రసాదంగా స్వీకరించడానికి భక్తులు అమితాసక్తి చూపుతుంటారు. అయితే, ఈసారి ఆ భాగ్యం లేకుండాపోయింది. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఆ లడ్డూ కరిగి.. పాకంగా మారిపోయింది. ఏకంగా నాలుగు వేల కిలోల భారీ ప్రసాదం భక్తులకు అందకుండా పోయింది. వర్షంలో తడుస్తూనే భక్తులు లడ్డూనుంచి కారుతున్న పాకాన్ని ప్రసాదంగా భావించి సేవించారు. ఇదిలా ఉండగా వర్షానికి చితికిపోయిన లడ్డూను గురువారం గోషాలలో గోవులకు వేయనున్నారు.
లంబో‘ధర’ లడ్డూలు
గణపతి నిమజ్జనోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వేలంలో లడ్డూలు దక్కించుకునేందుకు భక్తులు పోటీలు పడ్డారు. దీంతో అవి రికార్డు స్థాయి ధర పలికాయి. శ్రీనగర్ కాలనీ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో యంగ్ బాయ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి వద్ద ఉంచిన లడ్డూ రూ.18,11,111 ధర పలికి అగ్రస్థానంలో నిలిచింది. దీనిని ఇ.పున్నారావు దక్కించుకున్నారు. ఇలావుండగా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవాల్లో ఎంతో ఖ్యాతి పొందిన బాలాపూర్ లడ్డూను ఈ ఏడాది మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి రూ.9.26 లక్షలకు దక్కించుకున్నారు.
51 బండ్లపై బుల్లి గణపతులు
జియాగూడ గణేష్ భక్త సమాజ్‌వారు 51 బండ్లలో 51 విగ్రహాలను వినాయక సాగర్‌కు తరలించారు. జియాగూడ నుంచి గోషామహాల్, ఎంజె మార్కెట్ మీదుగా ర్యాలీగా తరలివెళ్లారు. దాదాపు 30 మంది తాళ్ల సహాయంతో ఈ బండ్లను లాగుతూ తరలించారు.
ప్రాంతం గెలుచుకున్న వారు ధర గత ఏడాది ధర
(రూ. లక్షల్లో) (రూ.లక్షల్లో)
ఎల్లారెడ్డిగూడ ఇ.పున్నారావు 18.11 ---
డీఆర్‌ఆర్ హౌసింగ్,
మధురానగర్ ఎస్.పాండు రంగారావు 16 1.10
వీవీఆర్ సొసైటీ,
అమీర్‌పేట్ బీఎస్‌ఎస్‌మూర్తి 12.01 9.10
బాలాపూర్ తీగల కృష్ణారెడ్డి 9.26 7.50