అనంతపురం కల్చరల్ : సేవే మార్గం..మానవత్వమే మతంగా సామాన్యుల పెన్నిధిగా జిల్లా వాసుల గుండెల్లో చిరస్మరణీయుడిగా విన్సెంట్ ఫెర్రర్ మిగిలిపోయారు. ఫెర్రర్ స్ఫూర్తితో ఊపిరిపోసుకున్న పలు సేవా సంస్థలు సేవా కార్యక్రమాలతో ఆయన 96వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయన స్మృత్యర్థం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఫై జీవిత చరిత్ర
ఆయన 1920లో స్పెయిన్‌లోని బార్సిలోనాలో జన్మించారు.న్యాయశాస్త్ర పట్టభద్రుడై తన సేవా కార్యక్రమాలు విస్తరించడానికి 1962లో తొలిసారి భారతదేశానికి వచ్చారు. నేరుగా మహారాష్ట్రలో అడుగుపెట్టి ‘మహారాష్ట్ర సేత్కారి సేవా మండల్’ను స్థాపించి పేద రైతులకు సేవ చేశారు. అక్కడ కొందరు ఛాందసవాదులు ఆయనను అడ్డుకోవడంతో 1969లో ఆయన భార్య అన్నే ఫైతో కలసి 1969లో 'అనంత' చేరుకున్నారు.ఆర్డీటి అనే స్వచ్చంధ సంస్థను స్థాపించి దాదాపు 58 మండలాలతో పాటు కర్నూలు జిల్లాలో కూడా విస్త్రుత సేవలందించారు.
అవార్డులు రివార్డులు
అతికొద్ది మంది మాత్రమే అవార్డులకు పేరు ప్రఖ్యాతులు తెస్తారు. ఆ కోవకు చెందిన ఫైను తన స్పూర్తిదాయకమైన జీవితంలో ఎన్నో పురస్కారాలు వచ్చి వరించాయి. స్పెయిన్ దేశం ఇచ్చే అత్యున్నత పురస్కారమైన ‘లాగ్రాన్ క్రేజ్‌డీల్ మోటోపివిల్ అవార్డు, ప్రిన్స్ ఆఫ్ స్పెయిన్ అవార్డు, యూనివర్శిల్ మాన్ ఆప్ పీస్ పురస్కారం, కాటరాన్ ప్రభుత్వం ఇచ్చిన క్రాస్ ఆఫ్ సెయింట్ జార్జ్, యునెస్కో అవుట్ స్టాండింగ్ పర్శన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ 20ఎత్ సెంచరీ, ఒలంపిక్ స్పిరిట్ ఫ్రీడ్ వంటి పురస్కారాలే కాకుండా పలు సంస్థలు, దేశాలు ఇచ్చే ఉత్తమ పురస్కారాలన్నింటిని ఫెర్రర్ కు ప్రదానం చేశారు.
కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు
ధీనజనోధ్దారణే ధ్యేయంగా కరువు బారిన పడిన అనంతను ఆదుకోవడాకి ప్రతి రంగంలో సేవా భావాన్ని జొప్పించిన విన్నెంట్ ఫెర్రర్ మరణించినా ఆయన కుటుంబ సభ్యులు మాంచో ఫెర్రర్, అన్నే ఫెర్రర్, విశాలా ఫై ఆ మహానీయుని సేవా కార్యక్రమాలను పుణికిపుచ్చుకుని కొనసాగిస్తున్నారు. ప్రతి గుండె ఆయన కోసం పరితపిస్తోందని గుర్తించిన ఆయన కుటుంబ సభ్యులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అక్షరాశ్యత, శాశ్వత గృహనిర్మాణం, పాఠశాలలు, క్రీడలు, ఆసుపత్రులు, వాటర్‌షెడ్ తదితర వాటిల్లో ప్రభుత్వాలతో సమాంతర సేవలందిస్తున్నారు. వారి స్పూర్తితో ఏర్పాటైన మరి కొన్ని సేవా సంస్థలు ఉడుతా సాయంగా అనంత కరువును తమ త్యాగమనే చేతులడ్డుపెట్టి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. విన్సెంట్ ఫై జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని గత రెండు రోజులుగా అనాథలకు సేవలందిస్తున్న కొన్ని స్వచ్ఛంధ సంస్థల ఫైకు ఘన నివాళులర్పిస్తున్నారు.
జీవితాన్ని పేదలకు అంకితం చేసిన మహనీయుడు
- తరిమెల రమణారెడ్డి, అమ్మ స్వచ్చంధ సంస్థ
భగవంతుడు తాను అన్ని చోట్ల ఉండలేక ఫై లాంటి వారి రూపాల్లో కనిపిస్తాడనడంలో అతిశయోక్తి లేదు. ఆయనే అనంతకు రాకుంటే బడుగు బలహీన వర్గాల వారి బ్రతుకులు ఎలా ఉండేవో కూడా ఊహించుకోలేము. తన జీవితాన్ని పేదలకు అంకితం చేసిన మహనీయుని గాథను పాఠ్యపుస్తకాలలో చేర్చాలి. ఆయన స్పూర్తితోనే ‘అమ్మ’ సంస్థ రూపొందింది. వికలాంగులకు, అనాథలకు ఆయన జయంతి సాక్షాత్తు పర్వదినమే. సేవా కార్యక్రమాలలో యువత మరింత ముందుకు రావాలి.
అనంత నిర్ధేశకులు సత్యసాయి, ఫెర్రర్
- విజయ్‌సాయి కుమార్, సాయి సంస్థ
అనంత పేరు చెప్పగానే ప్రపంచానికి గుర్తుకు వచ్చే రెండే రెండు పేర్లు భగవాన్ సత్యసాయిబాబా...ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఇద్దరివే. ముఖ్యంగా సేవా తత్పరతకు మారుపేరుగా నిలచిన ఫెర్రర్ ఆదర్శంతోనే సాయి సంస్థ వెలసింది. సత్యసాయి ప్రభోధించినట్టు మేము అనాథలకు అన్నార్థులకు అన్నం పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము. విన్సెంట్ ఫై స్పూర్తితోనే సేవకు మారుపేరుగా నిలచే ఎన్నో సంస్థలు అనంతలో వెలవడం ఆనందదాయకం.
'అనంత' శ్రేయోభిలాషి
Published Wed, Apr 8 2015 6:56 PM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement