వల్లేరును కొల్లగొట్టారు
► వినుకొండ నియోజకవర్గంలో ఇసుక దోపిడీ
► గుండ్లకమ్మ నదిని తోడేసిన ఇసుకాసురులు
► ఇప్పుడు వల్లేరు వాగుపై మాఫియా కన్ను
► కోట్ల రూపాయల సొత్తు కొల్లగొడుతున్న వైనం
► అక్రమ రవాణాకు అంతర్గత రహదారుల నిర్మాణం
► ఏళ్ల తరబడి కొనసాగుతున్న దందా
► అయినా ఆ వైపు కన్నెత్తి చూడని అధికారులు
అనుమతుల అవసరం లేదు.. అధికారుల పర్యవేక్షణ ఉంటుందన్న భయం అంతకంటే లేదు. నదులు, వాగులు అనే బేధం లేకుండా అక్రమార్కులు కోట్లాది రూపాయల సంపదను కొల్లగొట్టేస్తున్నారు. ఇసుక సీనరీలే లేని వినుకొండ నియోజకవర్గంలో ఏళ్ల తరబడి ఈ దందా నిరాటంకంగా సాగిస్తోంది. నీరు లేక ఎండిపోయిన గుండ్లకమ్మ నదిని పూర్తిగా తవ్వేసిన ఇసుకాసురుల కన్ను ఇప్పుడు వల్లేరు వాగుపై పడింది. భారీ యంత్రాలతో లారీల కొద్దీ ఇసుకను తోడేస్తూ గుట్టలుగా నిల్వ చేసుకొంటున్నారు. ఈ అక్రమ రవాణా కోసం ప్రధాన రహదారుల నుంచి అంతర్గత రోడ్లు సైతం ఇక్కడ నిర్మించారంటే దోపిడీ ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు
నూజెండ్ల: వినుకొండ నియోజకవర్గ పధిలోని గుండ్లకమ్మ నదిలో ఏళ్ల తరబడి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అధికారుల నియంత్రణ లేకపోవటంతో ఇసుక మాఫియా యథేఛ్చగా తవ్వకాలు జరుపుతూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. రెండేళ్ల నుంచి గుండ్లకమ్మ నదికి నీరు రాక పూర్తిగా ఎండిపోయింది. ఇదే అదునుగా భారీ యంత్రలతో రేయిబంవళ్లు వందాలాది ట్రాక్టర్లతో ఇసుకను కొల్లగొట్టారు. ఇసుకను ఉచితంగా ప్రజలకు అందిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయకపోతే ప్రయోజనం ఏముందని సామాన్యులు సైతంఅభిప్రాయపడుతున్నారు.
గోతులు తీసి.. గుట్టలుగా పోసి..
ఎక్కడా మైనింగ్ అనుమతులు లేకున్నప్పటికీ నూజెండ్ల మండలంలోని ములకలూరు, పువ్వాడ, ఉప్పలపాడు, ఐనవోలు, వినుకొండ మండలం గోకనకొండ నుంచి ఇసుకను తరలిస్తున్నారు. గుండ్లకమ్మ నదిలో పూర్తిస్థాయిలో ఇసక తోడేయడంతో అక్కడ ఇసుకే లభించటం లేదు. నదిలో ఇసుక లభ్యత తగ్గిపోవటంతో ఇసుక అక్రమార్కులు నూజెండ్ల మండలంలోని వల్లేరు వాగుతో తవ్వకాలు ప్రారంభించారు. యంత్రాల సహాయంతో వేల ట్రక్కులు ఇసుకను తవ్వుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూముల్లో ఇసుక క్వారీలు పడటంతో అక్రమార్కులకు వరంగా మారింది. వినుకొండ కురిచేడు ప్రధాన రహదారిని ఆనుకుని ప్రవహిస్తున్న వల్లేరు వాగుతోపాటు, ప్రభుత్వ భూముల్లోకూడా ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు చేపట్టారు. సుమారు వంద ఎకరాల్లో గోతులు తీసి అక్కడే వందలాది లారీల ఇసుకను గుట్టలుగా పోశారు.
ఇసుకను తరలించేందుకు ప్రధాన రహదారి నుంచి ఏకంగా మూడు అంతర్గత రహదారులు నిర్మించడం ఇక్కడి అవినీతికి అద్దం పడుతోంది. ఇంత జరుగుతున్నా ఒక్క అధికారి కూడా ఆవైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని, దీంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక తలించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు ఇసుక కుప్పవద్ద మొక్కుబడిగా ఫొటోలు దిగడంతోనే సరిపెడుతున్నారు.
అక్రమ రవాణాపై నియంత్రణ ఎవరిది..?
అక్రమ ఇసుక తరలించేవారిపై చర్యలు తీసుకోవాల్సిన వారెవరు అనే విషయంపై ఇప్పటికీ స్పష్టతలేదు. ఒకవైపు రెవెన్యూ, మరోవైపు మైనింగ్, ఇంకో వైపు పోలీసులు, ఎవరికి వారు అవకాశం దొరికినప్పుడు వారి అధికారాన్ని వినియోగించుకొని సొమ్మ చేసుకుంటున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ దందా వెనుక అధికార పార్టీ పెద్దలు, బడాబాబుల హస్తం ఉందనే ఆరోపణలు లేకపోలేదు.