ఉల్లంఘిస్తే రూ.లక్ష!
- లెసైన్స్‌దార్లకు ‘ఎక్సైజ్’ హెచ్చరిక
- జిల్లాలో 22 తనిఖీ బృందాలు
విశాఖపట్నం : అధిక ధరకు విక్రయించే మద్యం దుకాణాలపై కొరడా ఝళిపించేందుకు ఎక్సైజ్ శాఖ సమాయత్తమవుతోంది. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు విక్రయించే దుకాణాలను ఇకపై వదలకూడదని నిర్ణయించింది. రూపాయి ఎక్కువ తీసుకున్నా రూ. లక్ష పెనాల్టీ విధించాలని ఆదేశాలిచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు తనిఖీలు చేస్తామని ఎక్సైజ్ శాఖ అధికారుల సమీక్షలో రెండ్రోజుల క్రితం మానవ వనరులశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడంతో ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది.
ఎమ్మార్పీ ఉల్లంఘనులపై దాడులు చేయాలని మంత్రులే ఆదేశించినప్పుడు ఆ దుకాణాలను నడుపుతున్న ఏ పార్టీ వారెవరైనా కఠినంగా వ్యవహరించాలని ఎక్సైజ్ అధికారులు కూడపలుక్కున్నారు. శనివారం నుంచే రంగంలోకి దిగాలని నిర్ణయించి జిల్లా వ్యాప్తంగా 22 తనిఖీ బృందాలను అప్రమత్తం చేశారు.
విశాఖ జిల్లాలో ప్రతి నెలా రూ.100 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. రోజు కూలీలు, ఆటో రిక్షా కార్మికులు, కార్మికులు, ప్రభుత్వ క్లాస్ త్రీ, ఫోర్ ఉద్యోగులు తాగే మద్యం బాటిల్‌పై రూ.10లు అధికంగా దోచేవారు. ప్రతి దుకాణంలోనూ డెరైక్టర్స్ స్పెషల్ విస్కీ, ఆఫీసర్స్ ఛాయిస్, మేన్షన్ హౌస్ అనే బ్రాండ్లకు చెందిన 180 ఎంఎల్ బాటిళ్లే ఎక్కువగా అమ్ముడవుతుంటాయి.
వీటి అమ్మకాల ద్వారానే ఒక్కో దుకాణం కనీసం రోజుకు దాదాపు రూ.30 నుంచి రూ. 40 వేల అదనంగా సంపాదించేది. మిగిలిన బ్రాండ్ల అమ్మకాలన్నీ కలిపి భారీగానే దుకాణాలకు రాబడి ఉండేది. ఏడాది కాలంగా ఎమ్మార్పీ ఉల్లంఘన జరిగినా పట్టనట్టు ఎక్సైజ్ మామూళ్ల మత్తులో నిద్రపోయింది. చేతికందినంతా దండుకుని మిగిలింది మీరే ఎంజాయ్ చేయండన్నట్టు మద్యం యాజమానుల కొమ్ముకాసింది. మంత్రి ఉపదేశంతో ఇప్పుడు ఎక్సైజ్ శాఖ నిద్ర లేచి దాడులకు సిద్దపడుతోంది.
22 బృందాలు రెడీ!
ఎమ్మార్పీ ధర ఉల్లంఘిస్తే ఊరుకోం. ఎవరి దుకాణమై నా కేసులు నమోదు చేస్తాం. జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ చట్టాన్ని ఉల్లంఘించి న వారిపై కేసులు నమోదుకు 22 ప్రత్యేక తని ఖీ బృందాలను నియమించార . స్పెషల్ టా స్క్‌ఫోర్స్ అదనంగా తనిఖీలు చేస్తుం టుంది. బెల్ట్ దుకాణాలు, అధిక ధరలని ఎక్కడ వినిపించినా రూ. లక్ష పెనాల్టీ వేస్తాం.
- ఎం. సత్యన్నారాయణ, డిప్యూటీ కమిషనర్-ఎక్సైజ్