=సామాన్య భక్తులకు ఇక్కట్లు
=అంగప్రదక్షిణం భక్తులను అడ్డుకున్న సిబ్బంది
సాక్షి, తిరుమల: టీటీడీ అధికారుల కొత్త నిర్ణయాలు సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. నూతన సంవత్సరంలో వీఐపీల దర్శనానికి అధికారులు ఆలయం వద్ద ఎర్రతివాచితో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దీనివల్ల ఆలయ వీధుల్లో అంగప్రదక్షిణం చేసేందుకు భక్తులకు అవకాశం లేకుం డాపోయింది. ఆలయం వద్ద సామాన్య భక్తులను కట్టడి చేయడంతో వారు అనుకోని ఇబ్బందులకు గురయ్యారు.
సామాన్యుల అంగప్రదక్షిణానికి వీఐపీల అడ్డు
ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వీఐపీలను ఈసారి సుపథం నుంచి దర్శనానికి అనుమతించారు. వీరు రాంభగీచా వద్ద వాహనాలు నిలిపి ఆలయ ముందు నుంచి సుపథానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసి ఎర్రతివాచీలు పరిచారు. అయితే సామాన్య భక్తులను అడ్డుకోవడంతో పాటు ఆలయ వీధుల్లో మహాంగప్రదక్షిణం చేయకుండా నిలుపుదల చేశారు. భక్తులు స్వామివారికి ఆలయంలో అంగప్రదక్షిణం, ఆలయం వెలుపల నాలుగు మాడవీధుల్లో మహాంగ ప్రదక్షిణం చేస్తుంటారు.
అయితే కొత్త సంవత్సరం తొలిరోజున మహాంగప్రదక్షిణ భక్తులను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ‘స్వామి దర్శనానికి వీఐపీలు వస్తున్నారు.. వీధుల్లో మహాంగ ప్రదక్షిణం చేయటం కుదరదు. లేవండి లేవండి.. ఇక్కడి నుంచి వెళ్లిపొండి’ అంటూ చేతులు పట్టి పైకిలేపి అక్కడి నుంచి పంపించేశారు. తడివస్త్రాలతో ఆలయ వీధుల్లో పొర్లుదండాలు చేద్దామని వస్తే భద్రతా సిబ్బంది అడ్డుకోవడం దారుణంగా ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆలయం వద్ద భక్తుల కట్టడి
కొత్త సంవత్సరం తొలి రోజు ఆలయ పరిసర ప్రాం తాల్లో గడపటం వల్ల పుణ్యంతో పాటు అంతా శుభాలే కలుగుతామని భక్తుల విశ్వాసం. అయితే వీఐపీలకు ఆలయం వద్ద ఎర్రతివాచీ వేసి దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. దీనివల్ల సామాన్య భక్తులను మంగళవారం రాత్రి 11 గంటల నుంచే అఖిలాండం వద్ద నిలిపివేశారు. దీనిపై భక్తులు టీటీడీపై నిప్పులు చెరిగారు. దర్శనానికి వెళ్లే వీఐపీల కోసం ఆలయం వద్ద గడిపే తమను అడ్డుకోవడం సబబు కాదని సామాన్య భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
వీఐపీలకు ఎర్ర తివాచీ
Published Thu, Jan 2 2014 6:41 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
Advertisement
Advertisement