పరిష్కారం చూపుతూ ...ప్రశ్నిస్త్తూ.... | VIP Reporter B. Rama Rao, Joint Collector, Vizianagaram | Sakshi
Sakshi News home page

పరిష్కారం చూపుతూ ...ప్రశ్నిస్త్తూ....

Published Sun, Nov 23 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

పరిష్కారం చూపుతూ ...ప్రశ్నిస్త్తూ....

పరిష్కారం చూపుతూ ...ప్రశ్నిస్త్తూ....

 జిల్లా కేంద్రంలోని మూడు  రైతుబజార్లతో పాటు పార్వతీపురం రైతుబజార్లో సమస్యలను పరిష్కరిస్తాను,  రైతులు మాత్రమే అమ్మేలా దళారులు ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటాను. విజయనగరం పట్నంలో ఉన్న   మూడు రైతుబజార్లలో కేవలం ఆర్‌అండ్‌బీ రైతుబజార్లో కాస్త సౌకర్యాలున్నా మిగతా రెండు రైతుబజార్లలో అసౌకర్యాలున్నాయని గుర్తించాను. అన్ని రైతుబజార్లలో బహిరంగ మార్కెట్ ధరల కన్నా 25 శాతం తక్కువ ధరలకు విక్రయించేలా చర్యలు తీసుకుంటాను.   మరుగుదొడ్లు నిర్మించి,  రూఫ్‌లకు మరమ్మతులు చేయిస్తాం. అన్ని కౌంటర్లూ కూరగాయల వ్యాపారులతో నిండేలా దాసన్నపేట రైతుబజార్‌ను తీర్చిదిద్దుతాను. రూ.40 లక్షలతో రైతుబజార్లను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటాం.  వీఐపీ రిపోర్టింగ్‌లో తెలుసుకున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు  చర్యలు తీసుకుంటాను.   
 
 జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్  బీ  రైతు బజారు అది. అప్పటికే రైతులు, కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. కూరగాయలను ఎంచుకోవడంలో కొనుగోలుదారులు బిజీగా ఉన్నారు. తూకం వేస్తూ...డబ్బులందుకుంటూ ైరైతులూ  అంతే బిజీగా ఉన్నారు. ఇంతలో  ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అకస్మాత్తుగా అక్కడకి  జాయింట్ కలెక్టర్ రామారావు తన  వాహనంలో వచ్చారు. రైతులను పేరుపేరున పలకరించారు. కొనుగోలు దారులతో మాట్లాడారు.  రైతుబజార్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? సమస్యలేమైనా ఉన్నాయి? సౌకర్యాలున్నాయా ?  లేదా ? అని తెలుసు కోడానికి సాక్షి   వీఐపీ రిపోర్టర్‌గా మారారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలెలా అమ్ముకుంటున్నారని రైతులను, నిత్యం వచ్చి కూరగాయలు, బియ్యం, కొనుగోలు చేస్తున్న వినియోగదారులను సమస్యలపై  ప్రశ్నించారు. కొన్నింటి పరిష్కారానికి  అక్కడికక్కడే
 ఆదేశాలు జారీ చేశారు.
 
 జేసీ : నమస్కారమండీ! నా పేరు  రామారావు, నేను జాయింట్  కలెక్టర్‌ను. ఇక్కడ మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను.మీ పేరేమిటి? ఏ ఊరు?
 రైతు :  నాపేరు సీత బాబు.
 మాది బొండపల్లి మండలం నెలివాడ గ్రామం.
 జేసీ : ఏం పండిస్తారు? సొంత భూమేనా?
 సీతబాబు: నేను కౌలుకు పొలం తీసుకున్నాను. వంకాయలు, బీరకాయలు పండిస్తాను.
 జేసీ : మీకు లాభసాటిగా ఉందా?
 సీతబాబు: లాభసాటిగా ఉందండి.
 జేసీ : బోర్డు మీద ధరకే విక్రయిస్తున్నారా? ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారా?
 సీతబాబు: బోర్డుమీద ధరకే విక్రయిస్తున్నాం. ఎక్కువ ధరలకు విక్రయించడం లేదు.
 జేసీ : మీ పేరు? (వినియోగదారునితో)
 వినియోగదారు: నా పేరు   కృష్ణారావు రిటైర్డు ఉద్యోగిని
 జేసీ : ఇక్కడి రైతుబజార్లో సమస్యలేమైనా ఉన్నాయా?  
 కృష్ణారావు: షెడ్‌లు  పాడయిపోవడం వల్ల ఇబ్బందిపడుతున్నాం.  వర్షం వస్తే కారిపోతోంది.  బజారంతా మురుగునీరు నిల్వుంటోంది.  ఎండ  వేడిమి భరించలేక   ఇబ్బంది పడుతున్నాం.
 జేసీ : రైతుబజార్‌లో మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాం. అవి రాగానే బాగు చేయిస్తాం. తుపాను ధాటికి పాడైపోవడంతో   రూ.పది లక్షలు మంజూరయ్యాయి. టెండర్లు పిలిచాం.  వెంటనే బాగు చేయిస్తాం.
 జేసీ : నీ పేరేమిటమ్మా?
 మహిళ: నా పేరు కొండమ్మ. మాది గెద్దపేట.
 జేసీ : కూరగాయలు విక్రయిస్తే  రోజుకు  మీకు ఎంత వస్తుంది?
 కొండమ్మ: నాకు రోజుకు రెండు వందలు మిగులుతాయి.
 జేసీ : అంతేనా? ఎక్కువ వస్తుందా? చెప్పమ్మా!
 కొండమ్మ: అంతేనండీ రెండొందలు వస్తాయి.
 జేసీ : సబ్సిడీపై విత్తనాలు వస్తున్నాయా?
 కొండమ్మ: ఇస్తున్నారండీ! ఆ విత్తనాలతోనే పండిస్తున్నాం.
 జేసీ : మీ పేరేంటి?
 వినియోగదారుడు: నా పేరు వెంకటరావు, బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగిని.
 జేసీ : ఇక్కడ కూరగాయలు  సరైనధరలకే   లభిస్తున్నాయా?
 వెంకటరావు: సరైన ధరలకే లభిస్తున్నాయండీ! ఇక్కడ రైతు బజార్లో లాగే మిగతా రైతుబజార్లో కూడా విక్రయాలు చేపడితే బాగుంటుంది. వ్యాపారులు కాకుండా  రైతులే అమ్మేలా చర్యలు తీసుకోవాలి.
 జేసీ : అలాగే చర్యలు తీసుకుంటాం. బియ్యం, ఉల్లి, పంచదార కూడా విక్రయిస్తున్నారు. కొనుగోలు చేయండి.
 జేసీ : నీ పేరంటమ్మా!
 మహిళారైతు: నాపేరు కెల్ల పైడమ్మ, మాది కెల్ల గ్రామం.
 జేసీ : ఏమేం పండిస్తారు?
 పైడమ్మ: ఆనపకాయలు, బెండకాయలు పండిస్తాం. క్యాబేజీ కొనుగోలు చేసి లాభానికి అమ్ముతుంటాం.
 జేసీ : నీకు రోజుకు ఎంత మిగులుతుంది?
 పైడమ్మ: రద్దులు ఎక్కువగా ఉంటే ఏమీ మిగలదండీ!
 జేసీ : ఇలా అమ్ముకోవడం వల్ల ఏమయినా సంపాదిస్తున్నావా?
 పైడమ్మ: సంపాదనంటే అలాగేనండీ! రోజుకు రెండు వందలు కన్నా ఎక్కువ రాదండీ!
 జేసీ :నీపేరు?
 మహిళా రైతు: నా పేరు తాళ్లపూడి చిన్నమ్మి. మాది అంబటి వలస.
 జేసీ : నీ వ్యాపారం ఎలా ఉందమ్మా?
 చిన్నమ్మి: వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయయ్యా! కట్టంగా ఉంది.....
 జేసీ : అలా కాదు. నీకు లాభం వస్తుందా లేదా ?
 చిన్నమ్మి: ఎక్కువ రాదండీ! మార్కెట్లో విక్రయిస్తే నాలుగు వందల వరకూ మిగులుతుంది.  ఇక్కడ విక్రయించడం వల్ల రోజుకు రెండు వందలే మిగులుతుంది.
 జేసీ : మీకు ఉద్యాన వన శాఖ అధికారులు వచ్చి సలహాలు, సూచనలూ ఇస్తున్నారా?
 చిన్నమ్మి: ఇస్తున్నారు.బాబూ!
 జేసీ : మీ పేరు?
 వినియోగదారు: నా పేరు ఎస్ రామరాజు, రిటైర్డు కానిస్టేబుల్‌ని.
 జేసీ : చెప్పండి ఇక్కడి రైతుబజార్ ఎలా ఉంది?
 రామరాజు: బాగానే ఉందండీ! కాకపోతే బయట చాలా ట్రాఫిక్ ఇబ్బందులున్నాయి. వాటిని పరిష్కరించాలి.
 జేసీ : చర్యలు తీసుకుంటాం.
 జేసీ : మీ పేరు?
 వినియోగదారు: నా పేరు రామకృష్ణ, స్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్నాను.
 జేసీ : చెప్పండి! ఇక్కడెలా ఉంది?
 రామకృష్ణ: ఇక్కడి రైతుబజార్లో సరైన ధరలకు కూరగాయలు విక్రయిస్తున్నారు.   ఇతర బజార్లలో కూడా ఇలానే అమ్మేలా చర్యలు తీసుకోండి.
 జేసీ : అలాగే! అన్ని ప్రాంతాలకూ మా సిబ్బందిని పంపిస్తాం. చర్యలు తీసుకుంటాం.
 జేసీ : నీ పేరేమిటి?
 వ్యాపారి: నా పేరు యామలి శ్రీనివాస రావు!
 జేసీ :చెప్పండి! మీకు బాగా లాభాలు వస్తున్నాయా?
 శ్రీనివాసరావు: రోజుకు రెండు వందలు వస్తుందండీ!
 జేసీ : అంతేనా?
 శ్రీనివాసరావు: అంతేనండీ ఎక్కువేం రాదు.
 జేసీ : నువ్వు యువత తరఫున షాపు పెట్టావా?
 శ్రీనివాసరావు: ఓ సంస్థ ద్వారా ఇక్కడ చేరాను.
 జేసీ : నీ పేరేంటి ?
 రైతు : నా పేరు గెద్ద రమణమ్మ, మాది గెద్దపేట.
 జేసీ : రోజుకు ఎంత వస్తుంది.
 రమణమ్మ: రోజుకు రెండు నుంచి మూడు వందలు వస్తుంది.
 జేసీ : నీకు ఈ డబ్బులు ఉపయోగపడుతున్నాయా? పొదుపు చేసుకుంటున్నారా?
 రమణమ్మ: ఉపయోగపడుతున్నాయి. ఆ డబ్బులతో ఏం పొదుపు చేస్తామండీ!
 జేసీ : నీ పేరంటయ్యా?
 రైతు: నా పేరు కోన సోములండీ! మాది నెలివాడ.
 జేసీ : చెప్పు ఎలా ఉంది? ఎంత వస్తుంది.
 సోములు: మాకు ఎక్కడిదక్కడే సరిపోతుందండీ! ఎక్కువగా మిగిలే పరిస్థితి లేదు. ఇటీవల వర్షాలతో పంటలు పోయాయి. ఇబ్బందే పడుతున్నాం. ఇక్కడ విక్రయిస్తే కష్టంగా ఉంది.
 జేసీ : మరి బయట అమ్ముకోలేకపోయావా?
 సోములు: లేదు లెండి ఇక్కడే బాగుంది.
 జేసీ : మీ పేరు? ఏ ఊరు మీది ?
 వినియోగదారు: మాది ఢిల్లీ. నా పేరు విశ్వేశ్వరరావు. బంధువులింటికి వచ్చాను.
 జేసీ : చెప్పండి! మీకు రైతుబజారు ఎలా అనిపిస్తోంది.
 విశ్వేశ్వరరావు: ఇక్కడ చాలా బాగుంది. మాకు ఇలా ఉండదు. అక్కడ కూడా ఇలా ఏర్పాటు చేయాలని కోరతా!
 జేసీ : మీరు రోజూ వస్తారా? ఏం పేరు?
 వినియోగదారు: నా పేరు  రామారావు.
 జేసీ : ఎలా ఉందీ రైతుబజార్?
 రామారావు: మేం వాడిపోయిన కూరలూ, తాజా కూరలూ ఒకే ధరకు కొనాల్సి వస్తోంది. ఇబ్బందులు పడుతున్నాం.
 జేసీ : అలా ఎందుకు? కాస్త తాజా తగ్గితే కిలో వద్ద రూపాయి చొప్పున తగ్గించండి! సరేనా... ఇక నుంచి ఈ పద్ధతి అమలు చేయండి.(ఎస్టేట్ ఆఫీసర్ సతీష్‌తో)
 జేసీ : మీ పేరేంటి?
 వినియోగదారు: నా పేరు   వెంకటరావు.
 జేసీ : చెప్పండి? ఇక్కడెలా ఉంది?
 రామారావు: ఇక్కడ వాడిన కూరగాయల వ్యర్థాలు పడేస్తున్నారు. ధరలు బాగానే ఉన్నా, దుర్వాసన వస్తే బాగుండదు కదా! ఆ సమస్య పరిష్కరించాలి.
 జేసీ : చర్యలు తీసుకుంటాం. వ్యర్థాలన్నీ బయట పడేసే చర్యలు తీసుకోండి(అధికారులకు ఆదేశం)
 జేసీ : మీరు కొనుగోలు చేస్తున్న  కూరగాయలు బానే ఉంటున్నాయా?
 జోస్యుల ప్రసాదరావు: ఇతర బజార్లలో కూరగాయలు ఫ్రెష్‌గా ఉంటున్నాయి. ఇక్కడ మాత్రం సెకండ్స్‌లా వాడిపోయి ఉంటున్నాయి. ధర మాత్రం ఒకటే! ఇలా ఎందుకు? కచ్చితంగా వాడిపోయినట్టే కనిపిస్తున్నాయి. చూడండి!
 జేసీ : అట్లానా! చర్యలు తీసుకుంటాం.అన్ని కౌంటర్లలో  తాజా కూరగాయలు విక్రయించేలా రేపటి నుంచి చర్యలు తీసుకోండి(ఏడీ మార్కెటింగ్ శ్రీనివాసరావుకు ఆదేశం)
 జేసీ : ఏమ్మా! మీదే ప్రాంతం. ఇక్కడ పంచదార విక్రయాలు బాగానే ఉన్నాయా?
 ఎస్ భాగ్యరాణి: మాది వివేకానంద కాలనీ అండీ! పంచదార బయట మార్కెట్లో 40 రూపాయల వరకూ పలుకుతుంది. ఇక్కడ 34 రూపాయలకే ఇస్తున్నారు. ఇది కాస్త సౌకర్యంగా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement