
మల్టీ ఫీడ్ ఆక్సిజన్ మనిఫోల్డ్ పరికరాలు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ఒకే ఆక్సిజన్ సిలిండర్ నుంచి ఆరుగురికి ఆక్సిజన్ అందించే వినూత్నమైన పరికరాన్ని విశాఖ నావల్ డాక్‌యార్డ్ అభివృద్ధి చేసింది. మల్టీఫీడ్ ఆక్సిజన్ మెనిఫోల్డ్ (ఎంవోఎం) పేరిట ఈ పరికరాన్ని ఆవిష్కరించింది. సాధారణంగా ఆస్పత్రుల్లో ప్రతీ బెడ్‌కు పైప్ ద్వారా ఆక్సిజన్ అందించే సదుపాయం ఉంటుంది. కానీ ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో కాలేజీలు, హోటల్స్, కళ్యాణ మండపాలు వంటి చోట్ల ఏర్పాటు చేసే ఆస్పత్రుల్లో ప్రతీ రోగికీ ఒక ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేయడం కష్టంతో కూడిన పని.
దీన్ని దృష్టిలో పెట్టుకుని నావల్ డాక్‌యార్డ్ సిబ్బంది ఈ ఎంవోఎం పరికరాన్ని అభివృద్ధి చేసి పరీక్షించారు. ఇది సత్ఫలితాన్ని ఇవ్వడంతో సుమారు 25 ఎంవోఎం పరికరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా అందచేయాలని నేవీ అధికారులు నిర్ణయించినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. సాధారణంగా కోవిడ్–19 బారిన పడ్డ వారిలో 5 నుంచి 8 శాతం మందికి మాత్రమే వెంటిలేటర్ల అవసరం ఉంటుంది. మిగిలిన వారికి ఆక్సిజన్ అందిస్తే సరిపోతోంది. ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఐసోలేషన్ సెంటర్లకు ఎంవోఎం చక్కగా ఉపయోగపడుతుందని నేవీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నావెల్ డాక్‌యార్డ్ 10 ఎంవోఎంలను తయారు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment