తిరగబడిన బోటుపై బాధితులు
సఖినేటిపల్లి (రాజోలు): తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద సముద్రంలో గురువారం మధ్యాహ్నం మత్య్సకారుల బోటు తిరగబడింది. ఈ బోటులోని మత్య్సకారులు ఆరుగురూ క్షేమంగా ఒడ్డుకు చేరుకోగలిగారు. వీరందరూ విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం పెదతీనార్ల గ్రామానికి చెందినవారు. సముద్రంలో సహచర బోటుదారులు వీరిని రక్షించి ఒడ్డుకు క్షేమంగా చేర్చారు. పల్లిపాలెం కేంద్రంగా చేసుకుని వేర్వేరు ప్రాంతాలకు చెందిన మత్య్సకారులతో కలసి విశాఖపట్నం జిల్లాకు చెందిన అర్జిల్ మసేన్, మైలపల్లి రాజారావు, అర్జిల్ అప్పారావు, ఓసుపల్లి సత్తెయ్య, చింతపల్లి బలరాం, అర్జిల్ జగ్గారావు గురువారం ఉదయం బోటుపై వేటకు సముద్రంలోకి వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో అలల తాకిడికి వీరి పడవ ఒక్కసారి తిరగబడింది. దీంతో వారు బోటుపైకి చేరుకుని సాయం కోసం కేకలు వేశారు. వారిని గమనించిన కొంతమంది బోల్తా పడిన బోటుతో సహా వారందరినీ రెండు బోట్లల్లో అంతర్వేది బీచ్ ఒడ్డుకు తీసుకువచ్చారు. ఒడ్డుకు చేరుకున్న వీరిని అమలాపురం ఆర్డీవో బి.వి.రమణ, ఎస్‌ఐ పవన్‌కుమార్ పరామర్శించారు. బోటు తిరగబడిన వెంటనే ఇంజిన్‌లోకి నీరు చేరి నడిసముద్రంలో బోటు నిలిచిపోయిందని, సహచర మత్య్సకారులు రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారని బాధితులు అధికారులకు చెప్పారు. వీరికి రామేశ్వరం పీహెచ్‌సీ వైద్యాధికారి నూకరాజు వైద్య పరీక్షలు చేశారు. వీరికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్ డీజే సుధాకర్‌రాజు, ఎఫ్‌డీవో సంజీవరావును ఆర్డీవో రమణ ఆదేశించారు. దెబ్బతిన్న బోటు, సముద్రంలో కొట్టుకుపోయిన వలలకు నష్టపరిహారంపై కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నట్టు ఆర్డీవో తెలిపారు. వీఆర్వో పోతురా>జు బాబులు, సర్పంచి చొప్పల చిట్టిబాబు,మాజీ సర్పంచి వనమాలి మూలాస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment