యాటింగ్ ఫెస్టివల్ ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: పడవల పండగకు యాటింగ్ బోట్లు వస్తాయో, రావో తెలియని అయోమయం.. అసలు ఫెస్టివల్ జరుగుతుందో, లేదోనన్న అనుమానం.. నాలుగు రోజులుగా ఇటు అధికారులతో పాటు అటు జనంలోనూ సందిగ్ధం..ఈ నేపథ్యంలో గురువారం ఎట్టకేలకు యాచింగ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. వాస్తవానికి ఈ నెల 28 నుంచి 31 వరకు ఈ ఫెస్టివల్ జరగాల్సి ఉంది. కానీ గోవా, చెన్నైలతో పాటు థాయ్‌లాండ్ నుంచి యాచ్ (బోట్ల)ల రాకలో జాప్యం జరగడంతో ఒక రోజు వాయిదా వేసి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు కొనసాగిస్తున్నట్టు పర్యాటకశాఖ అధికారులు ప్రకటించారు. గురువారం మధ్యాహ్నానికి చెన్నై, గోవాల నుంచి ఆరు బోట్లు విశాఖకు చేరుకున్నాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఫిషింగ్ హార్బర్‌లోని ఐఎఫ్‌ఆర్ జెట్టీ వద్ద ఈ యాటింగ్ ఫెస్టివల్‌ను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ‘సీ నోరిటా’ అనే యాచ్‌లో మంత్రులు లోకేష్, గంటా శ్రీనివాసరావు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి కొంతదూరం సముద్రంలో షికారు చేసి వచ్చారు. తొలుత చంద్రబాబు ఫెస్టివల్ తీరుతెన్నులను ఈ–ఫ్యాక్టర్ సంస్థ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫ్లోటింగ్ జెట్టీ నుంచి సీఎం మాట్లాడారు.
యాచింగ్ గమ్యనగరంగా విశాఖ..
ప్రకృతి సౌందర్యంతో అలరారుతున్న విశాఖలో దేశంలోనే తొలిసారిగా యాటింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఫెస్టివల్ ద్వారా పర్యాటక రంగంలో విశాఖ మరింత ఖ్యాతిని గడిస్తుందని, వెంచర్ స్పోర్ట్స్ వృద్ధి చెందుతుందని చెప్పారు. భవిష్యత్తులో విశాఖ యాటింగ్‌కు గమ్య నగరంగా మారుతుందన్నారు. పరిశ్రమలు, ఐటీ రంగంతో పాటు పర్యాటకరంగంలో పెట్టుబడులు మరింతగా రావాల్సి ఉందన్నారు. పర్యాటకరంగం అభివృద్ధి ద్వారా ఉపాధితో పాటు ఆదాయం పెరుగుతుందని, ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నాలెడ్జితో పాటు టూరిజానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాసులునాయుడు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద సత్యనారాయణ, పంచకర్ల రమేష్‌బాబు, విష్ణుకుమార్‌రాజు (బీజేపీ), జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవానీ, పోర్టు చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, వుడా వీసీ బసంత్‌కుమార్, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్, టూరిజం ఈడీ డి.శ్రీనివాసన్, పర్యాటక అధికారి పూర్ణిమాదేవి తదితరులు పాల్గొన్నారు.
మొక్కుబడిగా షికారు
తొలి రోజు నిర్వాహకులు కొంతమంది ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులను యాచ్‌ల్లో మొక్కుబడిగా షికారు చేయించారు. తొలుత జెట్టీ నుంచి రుషికొండ వరకు వీరిని వేర్వేరు యాచ్‌ల్లో తీసుకెళ్తామని చెప్పి ఎక్కించారు. కానీ కొంతదూరం వెళ్లాక కొద్దిసేపటికే వాతావరణం అనుకూలించలేదంటూ వాటిని వెనక్కి మళ్లించారు. దీంతో వీరంతా నిరాశ చెందారు. గురువారం నాటికి ఆరు యాచ్‌లు విశాఖ రాగా మిగిలిన మూడు శుక్రవారం నాటికి చేరుకుంటాయని పర్యాటక అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment