రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించడానికి ఎగబడుతున్న ప్రయాణికులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరం ఊరెళ్లింది. నగరంలోని నాలుగు వంతులకు పైగా జనం సంక్రాంతి పండగకు తమ స్వస్థలాలకు పయనమయ్యారు. విశాఖలో ఉద్యోగాలు, విద్య, వ్యాపారాల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిలైన వారు, నివాసం ఉంటున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో అత్యధికులు ఈ సంక్రాంతి సెలవులకే వారి ఊళ్లకు వెళ్తుంటారు. ఈ సంవత్సరం వారం రోజులకు పైగా ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులు రావడంతో భారీ సంఖ్యలో నగరవాసులు ఊళ్లకు బయల్దేరి వెళ్లారు.
దాదాపు ఆరు లక్షల మంది విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు సంక్రాంతి సందర్భంగా వెళ్తున్నట్టు అంచనా. గత ఏడాదితో పోల్చుకుంటే వీరి సంఖ్య లక్షకు పైగా ఎక్కువని చెబుతున్నారు. గత శుక్రవారం నుంచి మొదలైన ఊళ్ల ప్రయాణాలు సోమవారం రాత్రి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం సంక్రాంతి కావడంతో ఆరోజు ప్రయాణించే వారి సంఖ్య నామమాత్రంగానే ఉండనుంది. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఈనెల 20 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. 21 నుంచి వీటిని తెరవనున్నారు. దీంతో ఊళ్లు వెళ్లిన వారు నగరానికి చేరుకోవడానికి కనీసం మరో ఐదారు రోజులైనా పడుతుంది. అందువల్ల ఆదివారం వరకు స్వస్థలాలకు వెళ్లే వారు తిరిగి వచ్చే పరిస్థితి లేదు. దీంతో నిత్యం ప్రజలతో కళకళలాడే విశాఖ నగరం ఈ నాలుగు రోజులు బోసిపోనుంది. ఏటా సంక్రాంతి సెలవుల్లో నాలుగైదు రోజులు నగరంలో చిన్న, చితక హోటళ్లు మూతపడతాయి. దీంతో ఆ రోజుల్లో అల్పాహారం దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. నగరంలో వాహనాల సంచారం కూడా బాగా తగ్గుతుంది. రోడ్లు కూడా ఖాళీగా దర్శనమిస్తాయి. ఈ ప్రభావం మంగళవారం నుంచి కనిపించనుంది.
కిక్కిరిసిన వస్త్ర దుకాణాలు
సోమవారం భోగీ రోజున వస్త్ర దుకాణాలు కిక్కిరిసిపోయి కనిపించాయి. సంక్రాంతి నాడు కొత్త దుస్తులను విధిగా ధరిస్తారు. అందువల్ల కుటుంబ సభ్యులకు వీటిని కొనుగోలు చేయడానికి చివరి రోజైన భోగి నాడు జనం ఎగబడతారు. ఇలా నగరంలోని అన్ని వస్త్ర దుకాణాలతో పాటు ఫుట్‌పాత్‌పై జరిగే అమ్మకాల వద్ద అత్యంత రద్దీగా కనిపించాయి. అలాగే ఇప్పటిదాకా వివిధ కారణాల వల్ల ఊరెళ్లలేకపోయిన ప్రయివేటు ఉద్యోగులు, వ్యాపారులు సోమవారం పయనమయ్యారు. వీరితో ఇటు ఆర్టీసీ బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు జనంతో కిటకిటలాడాయి. ఏ బస్సు చూసినా, ఏ రైలు చూసినా నిలబడడానికి ఖాళీ లేనంత రద్దీతో వెళ్లాయి. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక బస్సులు వీరి డిమాండ్‌కు తగినట్టుగా అవసరాలు తీర్చలేకపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment