అల్లిపురం(విశాఖ దక్షిణ): అక్టోబర్–7.. తన భర్త కొప్పర్ల సత్యనారాయణరాజు ఈ నెల ఆరో తేదీన పెదగంట్యాడ భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి తి రిగి రాలేదని కొప్పర్ల కుమారి గాజువాక న్యూపోర్టు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు క్రైం నంబ రు 123/2017తో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
అంతకు ముందు...
అక్టోబర్ 6.. అర్ధరాత్రి సబ్బ వరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మారుమూల గాలి భీమవరం ప్రాంతంలో నైట్ బీట్ పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా దూరంగా మంటలు కనిపించాయి. అనుమానంతో దగ్గరికి వెళ్లిచూడగా కాలిపోతున్న మృతదేహం కనిపించింది. వెంటనే మంటలు అర్పారు. కానీ అప్పటి కే మృతదేహం సగం కాలిపోయింది. గుర్తుతెలియని మృతదేహం లభిం చినట్లు కేసు నమోదు చేశారు.
హత్య కేసుగా మారిన మిస్సింగ్ కేసు
గుర్తు తెలియని మృతదేహం లభించిన సమాచారం న్యూపో ర్టు పోలీసులకు అందింది. అ ప్పటికే మిస్సింగ్ కేసు నమోదు చేసిన వారు అనుమానంతో కొప్పర్ల కుమారి, ఆమె కుటుంబ సభ్యులను తీసుకెళ్లి మృతదేహాన్ని చూపించారు. మెడలో ఉన్న వస్తువులు, మృతుని ఆనవాళ్లను బట్టి అతను తన భర్త సత్యనారాయణరాజుగా ఆమె నిర్థారించారు. అలా సత్యనా రాయణరాజు ఎలియాస్ రౌడీషీటర్ గేదెలరాజు హత్యోదంతం వెలుగులోకివచ్చింది. దాంతో మిస్సింగ్ కేసును హత్యకేసుగా మార్చి దర్యాప్తు ప్రారంభించారు.
ఉప్పందించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు
ఈ నెల ఆరో తేదీ రాత్రి పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రవి అనే వ్యక్తి తాగిన మత్తులో యాక్టివా వాహనంఏపీ 31 డీహెచ్ 3761 నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గురైన గేదెలరాజు మరణానికి ముందు అదే వాహనాన్ని వినియోగించాడని తెలుసుకొని మరుసటి రోజు రవిని మళ్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మిగిలిన నిందితుల వివరాలు బయటకొచ్చాయి.
ఏ1 ముద్దాయి డీఎస్పీయే: జేసీపీ
రౌడీ షీటర్ కొప్పెర్ల సత్యనారాయణరాజు ఎలియాస్ గేదెల రాజు హత్య కేసులో ఏ1 ముద్దాయి డీఎస్పీ దాసరి రవిబాబేనని నగర జాయింట్ పోలీస్ కమిషనర్ దాడి నాగేంద్రకుమార్ స్పష్టం చేశారు. పోలీస్ కమిషనరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆయనతోపాటు ఏ–2 ముద్దాయి అయిన క్షత్రియబేరి ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ భూపతిరాజు శ్రీనివాసరాజు, ఏ–6గా ఉన్న భూపతిరాజు కారు డ్రైవర్ కేశవ్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. హత్య కేసుతో సంబంధం ఉన్న పెదగంట్యాడ, వియ్యపువాపువానిపాలేనికి చెందిన గుమ్మడి రవి, ఆదర్శనగర్‌కు చెందిన సువ్వాడ మహేష్, ఎంవీపీ కాలనీకి చెందిన ఎర్ని శ్రీనివాసరావు, మద్దిలపాలేనికి చెందిన ఆటోడ్రైవర్ ఆల్ల గోపి, కురుపాం మార్కెట్‌కు చెందిన మైలపల్లి విజయకుమార్ ఎలియాస్ బిల్లా, శివాజీపాలేనికి చెందిన బొంగ మురళీ, ఆదర్శనగర్ ప్రాంతానికి చెందిన కన్నం ఆనంద్‌కుమార్, సీతంపేటకు చెందిన పిల్లా త్రినాథ్ ఎలియాస్ తెల్లోడు, హెచ్‌బీ కాలనీ దుర్గానగర్‌కు చెందిన బెహరా కనకరాజు.. మొత్తం 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో శాంతిభద్రతల డీసీపీ–2, టి.రవికుమార్‌మూర్తి, హార్బర్ ఏసీపీ రంగరాజు, సౌత్ ఏసీపీ రామమోహనరావు, ఎస్.సి, ఎస్టీ సెల్ ఏసీపీ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
పత్రికల పాత్ర అభినందనీయం
గేదెల రాజు హత్య కేసులో పత్రికల్లో పరిశోధనాత్మక కథనాలు రాయడం అభినందనీయమని సంయుక్త పోలీస్ కమిషనర్ దాడి నాగేంద్రకుమార్ అన్నారు. ఈ కథనాలు ఆధారంగా తాము కేసులో పురోగతి సాధించామన్నారు. నగర పరిధిలో జరుగుతున్న అనేక నేరాల్లో పత్రికల ద్వారానే వాస్తవాలు బట్టబయలవుతున్నాయన్నారు. సమాజంలో పోలీసులకు ఒక గౌరవం ఉంది. అలాంటి హోదా, అధికారంలో ఉన్న పోలీస్ అధికారి ఇంతటి ఘోరానికి పాల్పడటం అవమానకరంగా ఉందన్నారు. అయిన్పటికీ తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీపై ఉన్న పాత కేసుల్లోనూ పూర్తి స్థాయి విచారణ జరుపుతామని ఆయన తెలిపారు.
క్షత్రియభేరి కేంద్రంగా..
పెదగంట్యాడలో శుభకార్యంలో పాల్గొన్న అనంతరం ఎక్కడికి వెళ్లాడని ఆరా తీసిన పోలీసులకు అతను అక్కడి నుంచి గాజువాకలోని క్షత్రియభేరి కార్యాలయానికి వెళ్లాడని తెలిసింది. దాంతో ఆ కార్యాలయం కేంద్రంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహం వద్ద లభించిన కార్పెట్ ముక్క, గోనె సంచి మరికొన్ని ఆధారాలు హత్యాస్థలం ఆ కార్యాలయమేనని నిర్థారించాయి. అయితే అప్పటికే ఆ పత్రిక నిర్వాహకుడు భూపతిరాజు శ్రీనివాసరాజు పరారయ్యాడు. అతని కుటుంబ సభ్యులు, డ్రైవర్‌లను అదుపులోకి తీసుకొని విచారించడంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన కిరాయి ముఠాలోని సభ్యుడు రవి అందజేసిన వివరాలతో మొత్తం హత్య కుట్ర బట్టబయలైంది. ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ దాసరి రవిబాబే శ్రీనివాసరాజు ద్వారా గేదెలరాజు హత్యకు కుట్రపన్ని కిరాయి ముఠా ద్వారా అమలు చేయించారని రూఢీ అయ్యింది.
హత్య జరిగిన విధం..
హత్యకు ఆరో తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. ఆరోజు మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఒక వ్యవహారం సెటిల్ చేయడానికి గాజువాకలోని క్షత్రియభేరి కార్యాలయానికి రావాలని శ్రీనివాసరాజు గేదెలరాజును కోరాడు. ఆ సమయంలో పెదగంట్యాడ ఫంక్షన్ హాల్‌లో ఉన్న గేదెలరాజు అటు నుంచి అటే తన యాక్టివా వాహనంపై క్షత్రియభేరి కార్యాలయానికి వెళ్లాడు. 3.50 గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చిన శ్రీనివాసరాజు అతన్ని పలకరించి లోపలికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన రౌడీషీటర్ మహేష్ బృందం రాడ్లు, కత్తులతో గేదెలపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. అతను మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు కార్యాలయంలో గల కార్పెట్‌తో చుట్టివేసి గోనె సంచిలో ప్యాక్ చేశారు. రాత్రి 7 గంటల సమయంలో శ్రీనివాసరాజు మారుతీ ఈకో వ్యాన్‌లో వెళ్లి మృతదేహాన్ని ఎక్కడ కాల్చేయోలో నిర్ణయించాడు. తిరిగి వచ్చి తన డ్రైవర్ కేశవ్ ఆధ్వరంలో ఏపీ 31 డీకే 2314 వ్యానులో తాను పైలెట్‌గా ముందు వెళ్తూ మృతదేహాన్ని సబ్బవరం మండలం గాలి భీమవరం సమీపంలోని మూరుమూల ప్రాంతానికి తరలించారు. అక్కడ మృతదేహాన్ని పెట్రోలు పోసి తగుల
బెట్టారు.
అక్రమ సంబంధం నుంచి హత్యల వరకు..
ప్రస్తుత ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీగా ఉన్న దాసరి రవిబాబుకు గతంలో పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు కుమార్తె, మాజీ ఎంపీపీ కాకర పద్మలతతో సంబంధం ఉండేది. ఆ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని అతనిపై ఒత్తిడి తేగా తిరస్కరించాడు. దాంతో అతను మదురవాడ ఏసీపీగా పనిచేస్తున్న సమయంలో అప్పటి పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేశాడని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని కోరింది. మహిళా సంఘాలతో కలిసి ఆందోళన చేసింది. హైదరాబాద్ వెళ్లి పోలీసు ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్‌లో ఆమె గాజువాక శ్రీనగర్‌లోని తన బంధువైన గేదెల రాజు ఇంటికి వచ్చి పదిరోజులు అక్కడే గడిపింది. ఆ సమయంలో గాజువాక ఏసీపీగా పనిచేస్తున్న రవిబాబు అప్పటికే సెటిల్‌మెంట్ల వ్యవహారంలో తనకు పరిచయమైన గేదెల రాజును పిలిపించి ఆమె అడ్డు తొలగించేలా కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అడ్వాన్సుగా రూ.50 లక్షలు ఇచ్చాడు. కాగా ఒప్పందం కుదిరిన సమయంలో రవిబాబుతో జరిగిన సంభాషణను గేదెల రాజు ముందు జాగ్రత్తగా తన మొబైల్‌లో రికార్డు చేశాడు. పద్మలతను అంతమొందించిన తర్వాత మిగిలిన రూ.50లక్షల కోసం రవిబాబుపై ఒత్తిడి తెచ్చాడు. ఇవ్వకపోతే తన దగ్గర సంభాషణలను బయటపెడతానని బెదిరించేవాడు. దీంతో గేదెలరాజును కూడా తప్పించాలని నిర్ణయించుకున్న రవిబాబు.. అతనికి స్నేహితుడైన క్షత్రియభేరి నిర్వాహకుడు భూపతిరాజు శ్రీనివాసరాజుతో మంతనాలు జరిపాడు. భూ సెటిల్‌మెంట్లు, పంచాయితీలు నిర్వహించడంలో దిట్ట అయిన శ్రీనివాసరాజు గేదెల రాజు హత్యకు పెదవాల్తేరు ఆదర్శనగర్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ సువ్వాడ మహేష్(సువ్వాడ మహేష్‌పై ఫోర్తు టౌన్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ ఉంది. మూడు హత్యకేసుల్లో ముద్వాయి)తో రూ. 4 లక్షల కిరాయికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. రూ.20వేలు అడ్వాన్సు ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment