
'సీమాంధ్ర రాజధానిగా విశాఖే బెస్ట్'
విశాఖ : సీమాంధ్రకు విశాఖ రాజధానిని చేయాలని కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ మరోసారి డిమాండ్ చేశారు. కొత్త రాజధానికి విశాఖ అనుకూలమైన ప్రాంతమని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. సీమాంధ్రకు స్వయంప్రతిపత్తి పదేళ్లు ఇవ్వాలని కిషోర్ చంద్రదేవ్ సూచించారు. విశాఖ ఏజెన్సీ పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరం విశాఖపట్టణమేనని, సీమాంధ్ర ప్రాంతానికి విశాఖపట్టణమే రాజధానికి సరైన ప్రత్యామ్నాయమని అన్నారు.
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ఉంచడం కన్నా విశాఖను రాజధానిని చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు కిషోర్ చంద్రదేవ్ గతంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకి లేఖ కూడా రాశారు. కిశోర్ చంద్రదేవ్ విశాఖ జిల్లా అరకు నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న విషయం తెలిసిందే.