స్వచ్ఛ విశాఖే లక్ష్యం | visakhapatnam Target | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ విశాఖే లక్ష్యం

Published Sun, Feb 8 2015 4:35 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

visakhapatnam Target

రోజూ నగరంలో పర్యటిస్తున్నా నేడు ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్‌గా ప్రజల సమస్యలు తెలుసుకోవడం కొత్తగా ఉంది. దీని వల్ల ప్రజలకు మరిం త సన్నిహితమవడం ఆనందంగా ఉంది.  స్వచ్ఛ విశాఖే మనందరి ధ్యే యం కావాలి. అందుకోసం పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి. నగరంలో పెద్ద ఎత్తున టాయిలెట్లు నిర్మించడానికి ప్రణాళిక రూపొం దిస్తు న్నాం. నగరం అంతా ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తున్నాం. రోడ్లు, డ్రైనేజీ, విద్య, వైద్య తదితర అన్ని రంగాల్లోనూ విశాఖను అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యం. అందుకు ప్రజల సహకారం కావా లి. అధికారులు, ప్రజలు కలసి పనిచేస్తే విశాఖను మరింత సుందరనగరంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి చేయగలం. అందుకు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను.’     
 
 కమిషనర్ ప్రవీణ్: ఏమ్మా ఇక్కడ ఎవరికీ టాయిలెట్లు లేనట్టున్నాయి. ఎక్కడికి పోతున్నారు మీరంతా..!
 శారద: సార్.. ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. టాయిలెట్లు కట్టుకోవడానికి స్తోమత లేదు. ఇళ్లలో అంత చోటూ లేదు.  మున్సిపల్ సులాభ్ కాంప్లెక్స్‌కు వెళ్తే అక్కడ నీరుండదు. మోటార్ పని చేయదంటారు. రెండు నెలలుగా మోటారు పనిచేయడం లేదు. ఎవరికీ చెప్పుకోలేని బాధ అనుభవిస్తున్నాం. మా ఆడోళ్ల బాధలు చెప్పుకుంటే సిగ్గేస్తాదండి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి రోడ్డు మీదకే పోతున్నాం. నేవీ ఉద్యోగులు ఒప్పుకోరని వారికంట పడకుండా అర్ధరాత్రి, వారు లేని వేళల్లో వెళ్లాల్సిన పరిస్థితి..
 (కమిషనర్ వెంటనే అక్కడే వున్న జోనల్ కమిషనర్ నాగ నర్సింహారావు, చీఫ్ ఇంజనీర్ దుర్గా ప్రసాద్‌లను పిలిచారు.)
 కమిషనర్: మున్సిపల్ సులాభ్ కాంప్లెక్స్‌లో మోటారు పనిచేయడం లేదా? రెండు నెలలుగా పనిచేయకుండా ఉంటే మీరు ఏం చేస్తున్నారు?
 జోనల్ కమిషనర్: మోటారు కోసం ప్రపోజల్ పెట్టాం సర్. ఇంకా శాంక్షన్ ఆర్డర్స్ రాలేదు.
 కమిషనర్:  నేను ఇప్పుడు ఆ సులాభ్ కాంప్లెక్స్ పరిశీలిస్తాను. మోటారు కోసం వెంటనే రూ. 2 లక్షలు శాంక్షన్  చేస్తున్నా. వెంటనే కొత్త మోటారు వేయించండి.
 
 అనంతరం కమిషనర్ ప్రవీణ్ ఆ సమీపంలోని పేదల ఇళ్లలోకి వెళ్లారు. ఓ చిన్న గదిలో అద్దెకు ఉంటున్న జి.మాధవిని పలకరించారు.
 కమిషనర్:  ఏమ్మా.. ఎలా ఉన్నారు.. మీకు మరుగుదొ
 డ్డి ఉందా?
 మాధవి: లేదండి.
 
 కమిషనర్: లేకపోవడం ఏంటమ్మా.. మ రి కాలకృత్యాలు ఎక్కడ తీర్చుకుంటున్నారు?
 మాధవి: అలా రోడ్డు పక్కకు వెళ్లాల్సి వస్తోందండి (ఒకింత ఇబ్బంది పడుతూ)
 కమిషనర్: డబ్బులిస్తాం కట్టుకుంటారా?
 మాధవి: మాకు ఇల్లే లేదు. అద్దెకు ఉంటున్నాం. ఇక మరుగుదొడ్డి ఎక్కడ కట్టుకోవాలండీ?
 (ఇంటి యజమాని సత్యనారాయణని పిలిచి మాట్లాడుతూ..)
 కమిషనర్: మీకు కార్పొరేషన్ తరపున డబ్బులిస్తాం. మరుగుదొడ్డి కట్టించండి.
 ఇంటి యజమాని:అలాగే సార్.
 అనంతరం కమిషనర్ మహిళా సంఘాల ప్రతినిధులను పలకరించారు.
 
 కమిషనర్:  అంగన్‌వాడీ కేంద్రం ఉందా..!
 మహిళలు: ఉందండి.
 కమిషనర్:  పిల్లలకు పౌష్టికాహారం పెడుతున్నారా..
 మహిళలు: ఆ! పెడుతున్నారండి.
 
 కమిషనర్: స్కూల్ ఉందా..పిల్లలందర్నీ చదివిస్తున్నారా..
 మహిళలు: ఎలిమెంటరీ బడి మాత్రమే వుందండి. 6వ తరగతి దాటితే కంచరపాలెమో, మర్రిపాలెమో పోవాలి సర్..
 కమిషనర్: ఆస్పత్రి వుందా..!
 మహిళలు: లేదండి..కేజీహెచ్‌కే పోతున్నాం.
 అక్కడి నుంచి మరో రెండడుగులు వేశారు. అక్కడున్న వృద్ధులు పోలాకి గిరి, ఉడుంబిల్లి పోతురాజులను
 పలకరించారు.
 
 కమిషనర్:  ఏమండీ బాగున్నారా...
 పోలాకి గిరి: బాబూ పింఛన్ ఆపేశారు..
 కమిషనర్: ఎప్పుడు...
 పోలాకి గిరి: ఈ నెలే..
 కమిషనర్: ఈ నెల నుంచి పోస్టాఫీసుకు మార్చడం వల్ల  చిన్న సమస్య  ఏర్పడింది. వచ్చే నెల నుంచి ఆ సమస్య ఉండదు. అందరికీ సమాయానికి పింఛన్ వచ్చేస్తుంది.
 ఉడుంబిల్లి పోతురాజు: పోస్టాఫీస్ చుట్టూ తిరగడానికి రోజుకి వందవుతోంది. ఎలా సర్..ఎన్ని రోజులు తిరగాలి..
 కమిషనర్ యూసీడీ అధికారులను పిలచి అన్ని పోస్టాఫీస్‌లకు సిబ్బందిని పంపించి సమస్య రాకుండా చూసుకోవాలని ఆదేశించారు.
 
 మార్గమధ్యంలో ఓ దుకాణం వ్యక్తితో కమిషనర్ మాట్లాడుతూ పాన్‌పరాగ్, ఖైనీలు అమ్ముతున్నావా.. అనడిగారు. లేదనడంతో ఇరుకు రోడ్డు గుండా రోడ్డుపైనే పుల్లలతో వంటలు చేస్తున్న వారందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. అక్కడ జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు కనిపించారు. వారితో సంభాషిస్తూ..
 
 కమిషనర్:  ఏమండీ మీ పేరు..!
 పారిశుద్ధ్య కార్మికులు: పల్లా నాగయమ్మ...బొమ్మ రమణండీ..!
 కమిషనర్: ఎన్ని గంటలకు డ్యూటీకొచ్చారు.
 
 పారిశుద్ధ్య కార్మికులు: పొద్దున్నే అయిదో గంటకే వచ్చేస్తామండి..
 కమిషనర్: జీతమెంత ఇస్తున్నారు?
 పారిశుద్ధ్య కార్మికులు: ఆరు వేలండి.. కానీ సరిగా ఇవ్వడం లేదు. గత రెండు నెలలది మొన్న ఇచ్చారు. ఈ నెలది ఇంకా రాలేదండి. ఇలా అయితే మా బోటోళ్లం ఎలా బతకాలి సారూ..
 కమిషనర్ వెంటనే అక్కడే ఉన్న చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.ఎం.ఎస్.రాజు,  అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డా.మురళీమోహన్‌ను అడిగారు. ఇంకా జీతాలు చెల్లించకపోతే ఎలా అని ఆగ్రహంగా ప్రశ్నించారు. ఈ నెల కొంత ఆలస్యమైందని వారిద్దరూ చెప్పారు. రికార్డుల పరిశీలన, ఇతరత్రా పనుల వల్ల ఆలస్యమైం దన్నారు. ఇక నుంచి త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే నెల నుంచి 7వ తేదీ లోగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలని ఆదేశించారు. ఇంతలోనే పారిశుధ్య కార్మికులు నాగాయమ్మ, రమణలు కమిషనర్‌తో మాట్లాడుతూ...
 నాగాయమ్మ, రమణ: మాకు గ్లౌజులు ఇవ్వలేదు సార్. ఆరు నెలలుగా వట్టి చేతులతోనే చెత్త చెదారం ఎత్తాల్సి వస్తోంది. చేతుల్లో గాజు పెంకులు గుచ్చుకుంటున్నాయి. కొత్తవి ఇప్పించండి సారూ.
 
 కమిషనర్: గ్లౌజులు ఇస్తున్నారు కదా.. అంటూ జోనల్ కమిషనర్ వైపు చూశారు. మొన్ననే ఇచ్చామండీ అంటూ ఆయన సమాధానం ఇస్తుండగానే.. మరో అధికారి కల్పించుకుని రెండు మూడు మాసాలై వుంటుందండీ అని చెప్పారు.
 
 బొమ్మా రమణ: అబ్బే ఆర్నెల్లు అయ్యిందండి..
 జోనల్ కమిషనర్: మరి అంతే.. అస్తమానూ ఎక్కడ నుంచి తెచ్చిస్తాం.. దాన్నే జాగ్రత్తగా దాచుకోవాలి.
 
 బొమ్మా రమణ: ఏంటండీ ఆర్నెల్లు దాచుకోవాలా.. రోజూ ఉతికి ఆరేసుకుంటుంటే ఆర్నెల్లు మన్నుతుందా?
 కమిషనర్ అందరికీ ప్రొక్యూర్‌చేసి ఇవ్వాలని సూచించారు.
 ఇలా సాక్షి రిపోర్టర్ అవతారమెత్తిన కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆశవానిపాలెంలో విసృ్తతంగా పర్యటించారు. ప్రతి వీధిని కలియదిరిగారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణం పరిష్కరిం చగలిగే వాటిపై అధికారులను ఆదేశించారు. ఇతర సమస్యలపై నివేదిక సమర్పించాలని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజ ల్లో అవగాహన కల్పించారు. ప్రజల ఫిర్యాదు మేరకు సులాభ్ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. వెంటనే రూ.2 లక్షలతో మోటారు మంజూరు చేశారు. ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. విద్యుత్తు సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement