ఏ సిద్ధాంతాలపై పార్టీ పునాది వేసుకుందో.. వాటినే తుంగలో తొక్కి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న చారిత్రక పాపానికి దారుణమైన పరాభవాన్ని తెలుగుదేశం మూటకట్టుకుంది.కాంగ్రెస్‌తో పొత్తుతో ఆవిర్భావం నుంచి పార్టీకి పెట్టని కోటలా ఉన్న తెలంగాణలో టీడీపీ పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది.కనీసం సంప్రదాయ ఓట్లు ఉన్న ఖమ్మం జిల్లా, హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో సహా అన్ని చోట్లా కోలుకోలేని చావు దెబ్బతింది.ఎన్టీఆర్‌కే కల్వకుర్తిలో ఓటమి రుచి చూపించిన తెలంగాణ ప్రజలు దివంగత హరికృష్ణ కుమార్తెనూ చిత్తుగా ఓడించారు.కాలు దువ్వి కేసీఆర్‌తో వైరం పెంచుకున్న చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కూటమి కట్టి మళ్లీ బొక్కబోర్లా పడటడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ అభిప్రాయాలన్నీ ఏ రాజకీయ విశ్లేషకులవో, సామాన్య ప్రజలవో కాదు.. వివిధ రాజకీయ పార్టీల నేతలవి అంతకంటే కాదు.. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు వ్యక్తం చేస్తున్న ఆవేదన, ఆందోళన స్వరాలివి.ఓ మంత్రి అయితే.. ‘ప్చ్... ఇంతటి దారుణమైన ఫలితాలను ఊహించలేదని’ వ్యాఖ్యానించారు.
ఇక కాంగ్రెస్ నేతలు కూడా ఇదే అభిప్రాయాలను తమ పార్టీకి అన్వయించుకుని చెప్పుకొస్తు న్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్సే.. అనే వాదనను 2014 ఎన్నికల్లో తీసుకెళ్లలేకపోయాం.. ఇప్పుడైనా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి గెలవాలని భావించాం..కానీ చివరాఖరున సైకిల్ ఎక్కి చారిత్రక తప్పిదమే చేశాం.. గత ఎన్నికలకంటే ఘోరంగా దెబ్బతిన్నాం.. అని కాంగ్రెస్ నేతలు విశ్లేషించుకుంటున్నారు....తెలంగాణ ఎన్నికల ఫలితాల సరళి మంగళవారం ఉదయం 10 గంటలకే తెలిసిపోవడంతో టీడీపీ శ్రేణులు పూర్తిగా డీలాపడిపోయారు. కూటమి విజయం ఖాయమని బాబు పదేపదే చెప్పడం.. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేతో ఆశలు పెంచుకున్న టీడీపీ నేతలు ఫలితాలు చూసి కుదేలయ్యారు. భయపడిందే జరిగిందని తలపట్టుకున్నారు. ఇక టీ ఫలితాలు అనుకూలంగా ఉంటే ఇక్కడా టీడీపీతో పొత్తు పెట్టుకుని ఓటింగ్ శాతం పెంచుకుందామని భావించిన కాంగ్రెస్ నేతలు ఫలితాలు చూసి కంగుతిన్నారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా లోక్‌సభకు జరగనున్న సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్స్ అయితే.. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో కిందటి వారం జరిగిన ఎన్నికలను సెమీఫైనల్స్‌గా అందరూ భావిస్తూ వచ్చారు. పొరుగునే ఉన్న తెలుగు రాష్ట్రంలో పార్టీల గెలుపోటములు ఇక్కడా ప్రభావితం చేస్తాయని అంచనా వేశారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎవ్వరూ ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఏపీలోని ఇరు పార్టీల నేతలూ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక పోలింగ్ ముగిసన తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై ఇక్కడి నాయకులు, ప్రజలు కోట్లలో బెట్టింగులు కాశారు. మరోవైపు నెల కిందట అనూహ్యంగా కాంగ్రెస్, టీడీపీ పొత్తు ప్రకటన.. చంద్రబాబు, రాహుల్ గాంధీల భేటీని జీర్ణించుకోలేని పలువురు కాంగ్రెస్ సీనియర్లు పార్టీని వీడి బయటకు వచ్చేశారు.
వాస్తవానికి కాంగ్రెస్‌లో కంటే తెలుగుదేశం పార్టీలోనే పొత్తుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ బయటపడకుండా అధిష్టానం కట్టడి చేసింది. గతంలో కాంగ్రెస్‌తో పొత్తుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మంత్రి అయ్యన్నపాత్రుడును సైతం పొత్తు కుదిరిన తర్వాత మాట్లాడకుండా టీడీపీ అధిష్టానం నోరు కట్టేసింది. ఇక మరో మంత్రి గంటా శ్రీనివాసరావు చూద్దాం... ఏం జరుగుతుందో.. అనే ధోరణినే ప్రదర్శిస్తూ వచ్చారు. ఎమ్మెల్యేలు, నేతల్లో మాత్రం చాలామంది పొత్తును వ్యతిరేకిస్తూనే వచ్చారు. కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఎన్టీఆర్ నిర్మించిన పార్టీని అదే కాంగ్రెస్‌తో కలపడాన్ని మెజారిటీ టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే బీజేపీని వీడిన బాబు కేంద్రంలో జాతీయ పార్టీ మద్దతు కోసమే కాంగ్రెస్‌ను ఆశ్రయించాల్సి వచ్చిందని ’వర్గ’ నేతలు చెప్పడంతో ఎవరికి వారు ఊరడించుకున్నారు. వాస్తవానికి తెలంగాణ ఫలితాల్లో పొత్తుకు అనుకూల ప్రభావం కనిపిస్తే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ టీడీపీ జెండా ఎత్తేసే పరిస్థితి రావడంతో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలు, శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా తమ అధినేత చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారని అంటున్నారు.
జాతీయ స్థాయిలో పరాభవం
తెలంగాణ ఎన్నికల ఫలితాలు చంద్రబాబుకు జాతీయస్థాయిలో పరాభవం మిగిల్చాయని అనకాపల్లికి చెందిన టీడీపీ నేత వ్యాఖ్యానించారు. గతంలో రెండుసార్లు బీజేపీ వేవ్ ఉన్నప్పుడు బాబు కేంద్రంలో హల్‌చల్ చేశారు.. కానీ ఇప్పుడు బీజేపీలో బలమైన పీఎం మోడీతో ఘర్షణ పెంచుకుని ఎదురుదెబ్బ తింటారేమేనని మాకు అనిపిస్తోంది.. అటు కేసీఆర్‌కు ఇటు మోడీకి ఉమ్మడి శత్రువుగా మారడంతో ముప్పేట దాడితో పార్టీ మనుగడ కోల్పోతుందేమోనని అనిపిస్తోంది.. అని ఆ నాయకుడు చెప్పుకొచ్చారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం, మనీ పవర్‌తో ఏదైనా సాధించవచ్చునన్న తమ అధినేత వైఖరి పార్టీకి చేటు తెస్తోంది.. అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ఆశలను కూల్చేసిన బాబు
రాష్ట్ర విభజనతో ఏపీలో గత ఎన్నికల్లో ఉనికి కూడా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి బాబుతో జత కట్టి కొంతైనా లబ్ధిపొందాలని భావించింది. అయితే తెలం గాణాలో ఎంతోకొంత పట్టున్న పార్టీయే బాబు పుణ్య మాని హుస్సేన్‌సాగర్‌లో కలిసిపోయింది.. ఇక ఏపీలో అంతకంటే దారుణనైన పరిస్థితి ఎదురుకానుందని అర్ధమవుతోంది.. అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు సాక్షి ప్రతినిధి వద్ద వ్యాఖ్యానించారు.
కొడుకైతే పోటీ లేకుండా ఎమ్మెల్సీబావ కూతుర్ని మాత్రం పోటీకి దింపి బలి
ఇక కూకట్‌పల్లిలో దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఘోర పరాజయం నేపథ్యంలో బాబు నిర్ణయంపై టీడీపీ శ్రేణుల్లోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆమెను అనవసరంగా పోటీలోకి దింపి బలి చేశారన్న వాదనను టీడీపీ శ్రేణులు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. 1989లో ఎన్టీఆర్ తెలంగాణ జిల్లా మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్ధి చిత్తరంజన్‌దాస్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణలోనే హరికృష్ణ కూతురు చిత్తు చిత్తుగా పరాజయం పాలయ్యారు. కుమారుడు లోకేష్‌బాబును ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించకుండా ఎమ్మెల్సీ చేసి ఆనక మంత్రిని చేసిన బాబు... బావ హరికృష్ణ కూతురైన సుహాసినిని మాత్రం పోటీకి దింపి బలి పశువును చేశారని స్వయంగా టీడీపీ జిల్లా పార్టీకి చెందిన ఓ బీసీ నాయకుడు వ్యాఖ్యానించారు. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతితో దుఃఖంలో ఉన్న ఆయన కుటుంబాన్ని ఇప్పుడు బాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం వీధుల పాల్జేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment