
వుడాపై ఐఏఎస్‌ల కన్ను!
మరికొద్ది రోజుల్లో విశాఖ నగరాభివృద్ధి సంస్థ(వుడా) దశ, దిశ మారనుంది. ఇప్పటి వరకు వందల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన వుడా భవిష్యత్తులో వేల కోట్ల నిధులతో తులతూగనుంది.
- వీసీ పోస్టు కోసం విశ్వప్రయత్నాలు
- రోజురోజుకు పెరుగుతున్న ఆశావహుల జాబితా
- మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు
విశాఖ రూరల్ : మరికొద్ది రోజుల్లో విశాఖ నగరాభివృద్ధి సంస్థ(వుడా) దశ, దిశ మారనుంది. ఇప్పటి వరకు వందల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన వుడా భవిష్యత్తులో వేల కోట్ల నిధులతో తులతూగనుంది. ప్రస్తుతమున్న పరిధిని మరిం త విస్తరించుకొని రాష్ట్రంలో సగం జిల్లాల్లో పా గా వేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో వుడాకు ఒక్కసారిగా ప్రాధాన్యత పెరిగిపోయింది. రూ. 500 కోట్ల కుంభకోణంతో సంస్థ ప్రతిష్ట మసకబారడంతో వుడాలో పనిచేయడానికి వెనకడుగు వేసిన వారంతా ఇప్పుడు ఇక్కడ పోస్టింగ్‌ల కోసం ఎగబడుతున్నారు. సీనియర్ ఐఏఎస్‌లు సైతం వుడా సీటుపై కన్నేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరించే ఈ సం స్థకు భవిష్యత్తులో వేల కోట్ల నిధులు వచ్చే అవకాశాలు ఉండడంతో వైస్‌చైర్మన్ పోస్టు కోసం పైరవీలు జోరందుకున్నాయి.
స్మార్ట్ సిటీలో వీఎండీఏ కీలక పాత్ర
వుడా పరిధిని 2008లో అప్పటి ప్రభుత్వం 1725 నుంచి 5573 చదరపు కిలో మీటర్లకు పొడిగించింది. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ప్రస్తుతం వుడా పరిధి విస్తరించి ఉంది. విశాఖను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి అమెరికా అంగీకరించడంతో అందరి దృష్టి ఈ నగరంపై పడింది. స్మార్ట్ సిటీ రూపకల్పనతో వుడా పాత్ర కీలకం కానుంది. దీంతో వుడా స్వరూపాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎండీఏ)గా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటోంది. దీనికి చైర్మన్‌గా సీఎం చంద్రబాబు వ్యవహరించనున్నారు. స్మార్ట్ సిటీగా విశాఖను తీర్చిదిద్దే విషయంలో వీఎండీఏ పాత్ర ఎంత కీలకమో చైర్మన్ పదవిని తన అధీనంతో ఉంచుకోవాలని సీఎం నిర్ణయం తీసుకోవడమే దీనికి నిదర్శనం.
వుడాపై కన్నేసిన ఐఏఎస్‌లు
వుడా వైస్ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఎన్.యువరాజ్‌ను ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌గా నియమించింది. అప్పటి నుంచి వుడాకు వీసీగా ఎవరినీ నియమించలేదు. ఇన్‌చార్జిలతోనే సంస్థను నడిపిస్తోంది.
వుడా వీఎండీఏగా మారనుండడంతో ఇక్కడ వైస్ చైర్మన్ సీటు హాట్‌గా మారిపోయింది. ఈ పోస్టు కోసం ఆశావహుల జాబితా రోజు రోజుకు పెరిగిపోతోంది. వీఎండీఏ వీసీగా సీనియర్ ఐఏఎస్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో జిల్లాలో కలెక్టర్‌లుగా పనిచేసిన ఇద్దరు కార్యదర్శుల స్థాయి అధికారులు ఈ స్థానం కోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. విశాఖ స్వరూపం పూర్తిగా తెలిసిన వారిని ఇక్కడ నియమిస్తే మరింత వేగంగా అభివృద్ధికి బాటలు పడతాయన్న వాదనను వీరు ప్రభుత్వ పెద్దల ముందుంచినట్టు సమాచారం. కలెక్టర్ కంటే సీనియర్ ఐఏఎస్‌ను ఈ పోస్టులో నియమించే అవకాశాలు తక్కువన్న వాదనలూ వినిపిస్తున్నాయి. వీసీతో పాటు కార్యదర్శి పోస్టులో కూడా ఐఏఎస్‌ను నియమించే సూచనలు ఉండడంతో జూనియర్ ఐఏఎస్‌లు సైతం వీసీ లేదా కార్యదర్శి పోస్టు కోసం తాపత్రయపడుతున్నారు.
మంత్రుల ఆశీస్సులకు ప్రయత్నాలు
వుడాలో పోస్టింగ్‌ల కోసం ఐఏఎస్‌లు, గ్రూప్-1 అధికారులు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఐఏఎస్‌ల కేటాయింపు పూర్తయ్యేంత వరకు ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశాలు లేవని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
పెరిగిపోతున్నఆశావహుల జాబితా
వుడాలో పోస్టింగ్‌ల కో సం ఆశావహుల జాబితా రో జు రోజుకు పెరిగిపోతోం ది. ఐఏఎస్‌లతో పాటు గ్రూప్-1 అధికారులు సైతం పోటీపడుతున్నారు. గతంలో జీవీ ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన ఎం. వి.సత్యనారాయణ వీసీ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. గతం లో జేసీగా పనిచేసిన గిరిజా శంకర్ జీవీ ఎంసీ కమిషనర్ లేదా వుడా వీసీ పోస్టులలో ఏదో ఒకటి ద క్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం వుడా ఇన్‌చార్జ్ వీసీ శేషగిరిబాబు పూర్తి స్థాయిలో వీసీగా ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నా యి. ఈ ఆశావహుల జాబితా లో జీవీఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్ జానకి పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది. వీరి తో పాటు సీఎం కోటరీకి సన్నిహితంగా ఉండే మరికొందరు ఐఏఎస్‌లు కూడా తమ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.