సాక్షి, విశాఖపట్నం : ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 1090 కిమీ, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 930 కిమీ దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో వాయుగుండం మరింత బలపడి రేపు ఉదయంలోగా ‘పెథాయ్’ తుఫానుగా మారే అవకాశం ఉందని, తుఫాను మరింత బలపడి ఈ నెల 16 సాయింత్రం తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అనంతరం తుఫాను వాయువ్య దిశగా పయనిస్తూ, ఈ నెల 17 సాయంత్రం ఒంగోలు-కాకినాడ మధ్య తీరం దాటనుందని తెలిపింది.
కోస్తాలో రేపు సాయంత్రం నుంచి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ఈ నెల 16 , 17న భారీ నుంచి అతి భారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని తెలిపింది. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంది. ఈ రోజు తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. రేపటి నుంచి గాలుల వేగం మరింత పెరిగి, ఈ నెల 17 నాటికి 80 నుంచి 95 కిమీ వేగంతో తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ఈ మేరకు అధికారులు కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment