కిరణ్‌కుమార్‌శర్మతో పూజలు చేయిస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి
సాక్షి, విజయవాడ/తాడేపల్లి రూరల్: కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. పండిత సభ మహోన్నతంగా సాగింది. శారదా పీఠం ఆధ్వర్యంలో ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం రెండో రోజు కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రముఖులు, భక్తులు తరలి రావడంతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమం భక్తజన సందోహంగా మారింది. విశాఖలోని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌శర్మ (కిరణ్ బాలస్వామి) సన్యాస స్వీకరణ మహోత్సవం మూడు రోజులపాటు నిర్వహిస్తున్న విషయం విదితమే. రెండవ రోజైన ఆదివారం సన్యాసాంగ అష్ట శ్రాద్ధాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కూష్మాండ, పురుష సూక్త, ప్రాజాపత్య, వైశ్వానర హోమాలు, షోడశ మహాదానాలు జరిపారు.
స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి శారదా చంద్రమౌళీశ్వరులకు అర్చన, అభిషేకాలను నిర్వహించగా, పెద్దసంఖ్యలో హాజరైన భక్తులు కన్నుల పండువగా వీక్షించారు. స్వామి చేపట్టిన అభిషేక క్రియకు వేదపండితులు తమ గళాన్ని జతపరిచి ప్రాంగణమంతటినీ వేదమయం చేశారు. మరోవైపు బాలస్వామి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ సందర్భంగా శాస్త్ర, అహితాగ్ని, వాక్యార్థ శాస్త్ర మహాసభలు నిర్వహించగా.. వ్యాకరణ, తర్క, మీమాంస సహా ఆరి శాస్త్రాలను ఔసోసన పట్టిన పండితులు పాల్గొన్నారు. సన్యాస దీక్ష ఫలితం ఏమిటి? సన్యాసం దేనికోసం తీసుకోవాలి? సన్యాసం తీసుకుంటే ఎలా ఉండాలి? నియమాలు ఏమిటనే అంశాలపై పండితులు చర్చాగోష్టి చేశారు.
సన్యాస జీవితం చాలా గొప్పది
స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ప్రవచనం చేస్తూ.. సన్యాసం గురించి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, యోగ శాస్త్రాల్లో చాలా గొప్పగా చెప్పారని వివరించారు. ద్వివిద సన్యాసం, విద్వత్ సన్యాసం, ఆశ్రమ సన్యాసం తదితర ఆశ్రమాలపై ఉపనిషత్తుల్లో చాలా చర్చ సాగిందని చెప్పారు. తమ పీఠం ఉత్తరాధికారి విద్వత్ సన్యాసి అని సగర్వంగా ప్రకటించారు. ఆది శంకరాచార్యుల కృప తమ పీఠ ఉత్తరాధికారికి పూర్తిగా ఉందని, పరమ గురువు సచ్చిదానందేంద్ర సరస్వతి వారి అనుగ్రహం కలిగిందని తెలిపారు.
భారతదేశంలోని శాస్త్ర పండితులు తర్కం, వ్యాకరణం, మీమాంస, వేదాంతం ఇత్యాది శాస్త్రాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోందని చెప్పారు. భారత ప్రభుత్వం వాటిని దూరంగా ఉంచినా.. పీఠాలు, మఠాలు పురాతనమైన శాస్త్రాలను కాపాడుతున్నాయని స్వామీజీ అన్నారు. భారతదేశ ఔన్నత్యానికి ప్రతీకలైన తర్కం, వ్యాకరణం, వేదాంతం, ఉపనిషత్తులు, అగ్నిహోత్ర సభలు ఏటా తమ పీఠం వార్షికోత్సవంలో జరుగుతాయన్నారు.
ఈ ఏడాది ఉత్తరాధికారి సన్యాస దీక్ష ఉండటంతో అగ్నిహోత్ర సభలు, శాస్త్ర సభలు ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.విజయలక్ష్మి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆశ్రమ మేనేజింగ్ ట్రస్టీ సుందరశర్మ, దేవదాయ శాఖ కమిషనర్ ఎం.పద్మ, దుర్గగుడి ఈఓ కోటేశ్వరమ్మ, సిమ్స్ విద్యాసంస్థల అధినేత భీమనాథం భరత్‌రెడ్డి హాజరయ్యారు. సన్యాస దీక్ష చివరి రోజైన సోమవారం జగద్గురు శ్రీచరణులచే బాలస్వామికి యోగపట్టా అనుగ్రహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment