
వివేకానందుడి స్ఫూర్తితోనే గిన్నిస్ రికార్డు
=యాత్రకు స్వాగతం పలికిన విద్యార్థులు
=రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
=జేఎన్‌ఎస్‌లో విద్యార్థి, యువ, భక్తి సమ్మేళనం
=పాల్గొన్న కలెక్టర్, డీఐజీ, అర్బన్ ఎస్పీ
వరంగల్ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : స్వామి వివేకానందుడి వేషధారణలు.. చిన్నారుల కోలాటాలు.. నృత్యాలు.. చిందు కళాకారుల ప్రదర్శనలు.. మహిళల మంగళహారతుల నడుమ స్వామి వివేకానందుడి రథయాత్ర శోభాయమానంగా సాగింది. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి యాత్ర అగ్రభాగాన ప్రదర్శన నిర్వహించారు. స్వామి వివేకానందుడి 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టిన రథయాత్ర జిల్లా కేంద్రానికి సోమవారం రాత్రి చేరింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ కాంతారావు, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు స్వామి వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. రథయాత్ర జిల్లాకు సందర్భాన్ని పురస్కరించుకుని హన్మకొండ జేఎన్‌ఎస్‌లో రామకృష్ణ మిషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థి, యువ, భక్తి సమ్మేళనం నిర్వహించారు.
‘స్వామి’ స్ఫూర్తితో చరిత్ర సృష్టించాలి
రామకృష్ణ మిషన్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ జి.కిషన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. వివేకానందుడిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని కొత్త చరిత్ర సృష్టించాలని అన్నారు. యువత పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లాలంటే వివేకానందుడి రచనలు చదివి స్ఫూర్తి పొందాలన్నారు. ప్రపంచ దేశాల్లో వివేకానందుడి రచనలు చదివిన వారు ఎంతో మంది ఉన్నత శిఖరాలు అధిరోహించి చరిత్ర సృష్టించారని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం సంచాలకుడు స్వామి బోధమయానందజీ మహరాజ్ మాట్లాడుతూ దేశం తరఫున ప్రపంచ సర్వమత సమ్మేళనానికి వెళ్లి దేశ కీర్తి ప్రతిష్టలను పాశ్ఛాత్య దేశాలు గర్వించదగ్గ స్థాయిలో సనాతన ధర్మాన్ని పరిచయం చేశారని అన్నారు.
స్వామీజీ రథయాత్రకు ప్రజలు, యువత, విద్యార్థులు, అన్ని వర్గాల వారు అపూర్వ రీతిలో ఘన స్వాగతం పలికారన్నారు. గుజరాత్ వడోదర రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి నిఖిలేశ్వరానందజీ మహరాజ్ మాట్లాడుతూ శరీరంలో ఒక అవయవాన్ని కోల్పోయినా పట్టువదలకుండా లక్ష్యాన్ని ఎంచుకున్న అరుణిమసిన్హాను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి సభ్యులు గుజ్జుల నర్సయ్య, లక్ష్మణమూర్తి, సత్యనారాయణరెడ్డి, పాండురంగారావు, వెంకటేశ్వర్లు, జిల్లా వడుప్సా అధ్యక్షుడు భూపాల్‌రావు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న మహతి స్కూల్ విద్యార్థులు
స్వామీజీ ఉత్సవాలను పురస్కరించుకుని హన్మకొండ ఎక్సైజ్ కాలనీలోని మహతి హైస్కూల్ విద్యార్థులు స్వా మీజీ వేషధారణలో రావడం పలువురిని ఆకట్టుకుంది. ప్రిన్సిపాల్ పింగిళి హేమ, ఉపాధ్యాయ బృందం విద్యార్థులతోపాటు పాల్గొన్నారు. సమ్మేళనానికి వివిధ పాఠశాలల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. జిల్లాకే ప్రత్యేకతను కలిగిన పేరిణి నృత్యాన్ని రంజిత్‌కుమార్ శిష్య బృందం ప్రదర్శించారు.