
సాక్షి, విశాఖపట్నం : విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన మృతి చెందిన చిన్నారి గ్రీష్మ తల్లిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ఓ వర్గం మీడియా కావాలనే అసత్యం ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. మంగళవారం ఆయన గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శించారు. అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఘటన బాధిత కుటుంబాలపై కేసులు నమోదు చేశారని ఓ వర్గం మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదని స్పష్టం చేశారు. 50 మందిపై పోలీసులు కేసులు పెట్టారన్న ప్రచారం కూడా అవాస్తవమే అన్నారు. (చదవండి : అయ్యో గ్రీష్మ.. అప్పుడే నూరేళ్లు..!)
ఇంటింటి సర్వే
గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గ్రామాల్లో గడ్డి వినియోగించరాదని పశుసంవర్ధశాఖ సూచించింది. గ్రామాల్లోని చెట్ల ఫలాలను కూడా వినియోగించరాదని పేర్కొంది.
బాధితులను పరామర్శించిన విజయసాయిరెడ్డి
కేజీహెచ్‌లో గ్యాస్ లీకేజీ బాధితులను వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, కన్నబాబు పరామర్శించారు. రాజేంద్రప్రసాద్ వార్డులో బాధితులకు ఎంపీ విజయసాయిరెడ్డి పరిహారం చెక్కులను అందజేశారు. వీరంతా గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరికి రవాణా సౌకర్యం కల్పిస్తామని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. ఇంటికి వెళ్లాక కూడా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment