వీఓఏలపై పోలీసుల జులుం!
కలెక్టరేట్ ఎదుట రణరంగం
వేతనాలు ఇవ్వాలని రోడ్డెక్కిన మహిళలు
కార్యాలయంలోకి వెళ్లకుండా డీఆర్‌వోను అడ్డుకున్న వీఓఏలు
పోలీసుల లాఠీచార్జీ మహిళకు తీవ్ర గాయూలు
వేతన బకారుుల కోసం రోడ్డెక్కిన ఐకేపీ యూనిమేటర్లపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళలు అన్న గౌరవం కూడా లేకుండా లాఠీలతో విరుచుకుపడ్డారు. ఇష్టానుసారం గొడ్డును బాదినట్లు బాదారు. తట్టుకోలేని వీఓఏలు తిరగబడటంతో కలెక్టరేట్ రణరంగాన్ని తలపించింది. ఈ ఘటన ప్రభుత్వ అసమర్థతకు అద్దం పట్టింది.
అనంతపురం అర్బన్ : ప్రభుత్వం నుంచి రావాల్సిన 16 నెలల వేతనాల కోసం వీఓఏలు ఏపీఐకేపీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో 48 గంటల పాటు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. బుధవారం వంట చేసుకుని అక్కడే భోజనాలు చేశారు. రాత్రి కూడా అక్కడే బస చేసి గురువారం ఉదయం 8.30 గంటలకు కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ ఎస్‌ఐ విశ్వనాథ్ చౌదరి, ఏఎస్‌ఐ ఆషినా బేగం సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ఉదయం 10.30 గంటల సమయంలో తన కార్యాలయూనికి వెళ్లేందుకు డీఆర్‌ఓ హేమసాగర్ వచ్చారు. ఆయన్ను లోనికి వెళ్లకుండా మహిళలు అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన మరో గేటు ద్వారా కలెక్టరేట్‌లోకి వెళ్లిపోయూరు. అక్కడే ఉన్న పోలీసులు వీఓఏలపై మండిపడ్డారు. ఆగ్రహించిన వీఓఏలు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లారు.
పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు విచక్షణారహితంగా మహిళలపై లాఠీచార్జీకి దిగారు. రాప్తాడుకు చెందిన వీఓఏ ఉషారాణి తీవ్రంగా గాయపడింది. సహనం కోల్పోరుున వీఓఏలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు ఒకటవ నగర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సొంతపూచికత్తుపై విడుదల చేశారు. బయటకు వచ్చిన మహిళలు కలెక్టరేట్ ఎదుట ఉన్న ఫాదర్ విన్నెంట్ ఫై విగ్రహం వద్ద సాయంత్రం వరకు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.బాబు, కోశాధికారి శివ, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు సావిత్రమ్మ, ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి, నేతలు రామాంజినమ్మ, చంద్రిక, నాగరాజు, గంగయ్య, గిరి పాల్గొన్నారు.
దద్దమ్మ మంత్రులు : సీఐటీయూ
అధికారి పార్టీలో ఉన్న మంత్రులందరూ దద్దమ్మలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.ఎస్.వెంకటేష్ విమర్శించారు. వేతనాలు చెల్లించకుండా వీఓఏలు ఎలా జీవిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి మృణాలిని దృష్టికి వేతనాల విషయం తీసుకెళ్లామని తెలిపారు. ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఈ విషయం ప్రస్తావిస్తే ఎందామ్మ.. నీ గోల అంటూ.. సీరియస్‌గా చూశాడని మంత్రే స్వయంగా బయట చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సమస్య పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
వేతనాలు ఆపడం దారుణం : ఎమ్మెల్సీ
వీఓఏల 16 నెలల వేతనాలు ఆపడం దారుణమని ఎమ్మెల్సీ గేయానంద్ పేర్కొన్నారు. వేతన బకాయిల కోసం 56 రోజుల నుంచి మండల కేంద్రాల్లో ఆందోళనలు చేస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్‌కైన తమ మొర వినిపించాలని వచ్చిన వారిపై పోలీసులు దౌర్జన్యం చేసి, అక్రమంగా అరెస్టు చేయడం మంచిదికాదన్నారు.
సమస్యపై పోరాడతాం : వైఎస్సార్ సీపీ టీయూ
వీఓఏల సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ అబ్జర్వర్ కొర్రపాడు హుస్సేన్ పీరా తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేసే యూనిమేటర్లకు 16 నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడం బాధకరమన్నారు.