గ్రామసచివాలయం వ్యవస్థ
వలంటీర్ల నియామకాలు పూర్తి కాగానే వెంటనే గ్రామ సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. జిల్లాలో 1038 పంచాయతీల్లో ఒకే గ్రామంలో సచివాలయాలు 447, రెండు, మూడు పంచాయతీలు కలిసినవి 289 రానున్నాయి. ఇందులో మహిళా పోలీసు అధికారి సేవలు అందుబాటులో ఉంటాయి. వ్యవస్థ రూపకల్పన జరుగుతోంది. వలంటీర్ల వ్యవస్థ దీనికి అనుసంధానంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వలంటీర్ల వ్యవస్థ వారధి కానుంది. దీనిలో భాగంగా గ్రామ వలంటీర్ల వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు క్షేత్ర స్థాయిలో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఈ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసి మెరుగైన సేవలను అందించాలని భావిస్తోంది. సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు చేర్చేందుకు దీనిని బలోపేతం చేయనున్నారు. జగన్ నవరత్నాలు, ప్రభుత్వ ఇతర సంక్షేమ పథకాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను అవినీతికి తావులేకుండా లబ్ధిదారులకు నేరుగా చేరవేయడంలో వలంటీర్లు కీలకం కానున్నారు. వలంటీర్ల నియామకాలు పూర్తి కాగానే వెంటనే గ్రామ సచివాలయ వ్య వస్థ అందుబాటులోకి రానుంది. దీని రూపకల్పన జరుగుతోంది. వలంటీర్ల వ్యవస్థ దీనికి అనుసంధానంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
సాక్షి, ఒంగోలు సిటీ: గ్రామ, వార్డులతో పాటు పట్టణ, నగరాల్లోని డివిజన్లలోనూ వలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే గ్రామ వలంటీర్ల పోస్టులకు ఆన్‌లైన్‌లో ధరఖాస్తులను స్వీకరించారు. వలంటీర్ల నియామకాలకు దరఖాస్తులను గత నెల 27వ తేదీ నుంచి స్వీకరించారు. మొదట ప్రకటించిన విధంగా గ్రామ వలంటీర్లకు ఈనెల 5వ తేదీతో గడువు ముగిసింది. సవరించిన ఉత్తర్వుల ప్రకారం పట్టణాల్లో వార్డు వలంటీర్లకు మాత్రం గడువుతేదీని ఈనెల 10వ తేదీ వరకూ పొడించారు. ఇక పరిశీలనకు అధికారులు పూనుకున్నారు. దరఖాస్తులను పరిశీలించి, అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించి వెంటనే నియామకాలను చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ శనివారం జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించి వారికి తగిన సూచనలు, ఆదేశాలను ఇచ్చారు. జిల్లాలో 56 మండలాల పరిధిలో 1038 పంచాయతీలు ఉన్నాయి. 35 అటవీ గ్రామాలున్నాయి. ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు ఎనిమిది మున్సిపాలిటీలు, నగర పంచాయతీలున్నాయి. జిల్లాలో సుమారు 58 వేల వరకు నిరుద్యోగులున్నట్లు అంచనా. గ్రామ వలంటీర్లకు జిల్లాలో మొత్తం 56,133 మంది గడువు ముగిసే నాటికి దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 44,389 దరఖాస్తులను పరిశీలించి 41,965 అనుమతించారు. 2424 తిరస్కరించారు. ఇంకా 11,744 దరఖాస్తులు పరిశీ లనలో ఉన్నాయి. తిరస్కరించిన దరఖాస్తుదారులు మళ్లీ సవరించుకునేందుకు ఈనెల 8వ తేదీ వరకూ అవకావం కల్పించారు. ఈనెల 11 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్వ్యూలను నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆగస్టు 1వ తేదీ నాటికి ఎంపికైన అభ్యర్ధుల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.
ఎంపిక విధి విధానాలు
గ్రామ వలంటీర్లలో 50 శాతం పోస్టులు మహిళలకే కేటాయించారు. వలంటీర్లకు గౌరవ వేతనంగా నెలకు రూ. 5 వేలు చెల్లిస్తారు. గిరిజన ఏజెన్సీల్లోని వారికి మాత్రం విద్యార్హత పదోతరగతికి అవకాశం కల్పించారు.
► పట్టణాల్లో ప్రతి వంద కుటుంబాలకు ఒక వార్డు వలంటీరును నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని ఒంగోలు నగర పాలక సంస్థతో పాటు మార్కాపురం, కందుకూరు, చీరాల మున్సిపాలిటీలతో పాటు గిద్దలూరు, కనిగిరి, చీమకుర్తి, అద్దంకి నగర పంచాతీల్లోని వార్డుల్లో వలంటీర్లను నియమించనున్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో ఒక్కొ పురపాలక నగర పాలక సంస్థకు ఎందరు అవసరమో కమిషనర్లు నిర్ణయించారు. ఈ జాబితా జిల్లా కేంద్రానికి చేరింది. పట్టణ, స్థానిక సంస్థల స్థాయిలో ఎంపిక కమిటీ ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. ఈ కమిటీలో మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దారు, మెప్మా పీడీ ఉంటారు. పట్టణాన్ని యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్ అమలు చేస్తారు.
► జిల్లాలో 2424 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. దరఖాస్తు పూరించడంలో దొర్లిన తప్పిదాలు కారణంగా ఇప్పటి వరకు వీటిని తిరస్కరించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తిరిగి సరిగా నింపి సమర్పించే అవకాశం ఈనెల 8వ తేదీ వరకూ కల్పించారు.
► తొలి దశలో దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. గ్రామాల్లో ఎంపీడీఓ, తహశీల్దార్, ఈఓపీఆర్‌డీలతో కూడిన ఎంపిక కమిటీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించనుంది.
► ఈ నేపథ్యంలో నవరత్నాలు, ప్రభుత్వ పథకాలు, ప్రజోపయోగమైన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ఈ పథకాల ద్వారా ప్రజలకు జరుగుతున్న మేలు విశ్లేషించగలిగి ఉండాలి. సామాజిక ప్రభావాన్ని అంచనా వేయగలి ఉండాలి. ఇంటర్వ్యూలో అభ్యర్థులకు ఇటువంటి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటిపై గణాంకాలు ఉదాహరణలతో వివరించాలి. వలంటీర్ల పనితీరు సంతృప్తిగా లేకుంటే తొలగిస్తారు. ప్రభుత్వం అప్పగించిన సర్వేలు చేయాలి. ప్రజల అవసరాలు, వారి సమస్యలు తెలుసుకోవాలి. ప్రజా సమస్యలు, వినతులు పరిష్కారానికి ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేయాలి.
వలంటీర్ల ఎంపిక పారదర్శకంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్
ఒంగోలు అర్బన్: జిల్లాలో గ్రామ వలంటీర్ల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం ప్రకాశం భవనంలోని కంట్రోలు రూములో గ్రామ పంచాయతీ వలంటీర్ల ఎంపిక కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం ద్వారా అందించే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు వలంటీర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వలంటీర్ల దరఖాస్తులను ఈనెల 9వ తేదీనాటికి కమిషనర్లు, ఎంపీడీఓలు పరిశీలన పూర్తి చేయాలన్నారు. అనంతరం ఈనెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎంపికైన వారి వివరాలను ఆగస్టు 1వ తేదీ తెలియచేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన వారికి ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు. ఆగస్టు 15 నుంచి వలంటీర్ల విధులు ప్రారంభమవుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment