బొత్స రాజీనామా చేయాలి
వోల్వో బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల డిమాండ్
మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి
హైదరాబాద్, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాదానికి బాధ్యత వహించి రవాణాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేయాలని, బస్సు యజమాని జేసీ ప్రభాకర్‌రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు శనివారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ముట్టడించారు. మృతుల కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, ఇటువ ంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బస్సు ప్రమాదం జరిగి నెల రోజులు కావస్తున్నా ఇంత వరకూ మృతుల కుటుంబాలకు న్యాయం జరగలేదని, నష్టపరిహారం చెల్లించలేదని బాధితులు ఆరోపించారు. దీన్ని చాలా చిన్న విషయంగా బొత్స కొట్టిపారేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, జాయింట్ యాక్షన్ కమిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సుధాకర్ ఆధ్వర్యంలో వారు బొత్స ఇంటిని ముట్టడించడానికి వెళుతుండగానే పోలీసులు బాధితులందరినీ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మంత్రుల క్వార్టర్స్‌లోనికి చొచ్చుకువెళ్లేందుకు యత్నించగా వారిని పోలీసులు దౌర్జన్యంగా ఈడ్చుకెళ్లి వ్యాన్‌లో పడేశారు. ఈ సమయంలో బాధితులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బొత్స రాజీనామా చేయాలంటూ పలువురు మహిళలు ముళ్లకంచెను దాటుకొని ముందుకు వెళ్లడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అరెస్టు చేసినవారిని పోలీసులు గోల్కొండ స్టే షన్‌కు తరలించారు. కాగా, కుటుంబ సభ్యులను కోల్పోయి బాధ లో ఉన్న తాము న్యాయం కోసం వెళితే దొంగల్లాగా, దేశద్రోహుల్లా గా అరెస్టు చేసి దౌర్జన్యంగా తీసుకురావడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. బొత్సతీరుపై వారు మండిపడ్డారు.
నా కుటుంబానికి దిక్కెవరు
చట్టాలను తుంగలో తొక్కి ప్రభుత్వ అండతో రాష్ట్రంలో సమాంతర రవాణా వ్యవస్థ నడుస్తున్నది. దీనికి మంత్రి బొత్స సత్యనారాయణ అండదండలు ఉన్నాయి. మూడు నెలల పసికందును వెంటేసుకొని న్యాయం కోసం మంత్రి ఇంటికి వెళితే కనికరం లేకుండా, మహిళలనే విచక్షణా జ్ఞానం లేకుండా అరెస్టుచేసి జంతువులను రవాణా చేసే వ్యాన్లలో పొలీస్‌స్టేషన్‌కు తీసుకురావడం న్యాయమా?
- ప్రతిభ, బస్సు ప్రమాదంలో మృతిచెందిన హరీష్ భార్య
గూండాల రాజ్యం
రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తున్నది. ఫిట్‌నెస్ లేని బస్సులు.., శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. మా కుటుంబానికి జరిగిన అన్యాయం ఇక ముందు మరెవరికి జరగకుండా చూడాలని వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లాను. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలతో పోలీసులు మమ్మల్ని దొంగల్లా చూస్తూ అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో న్యాయం అడిగే స్వేచ్ఛ లేదా?
- మహ్మద్, బస్సు ప్రమాదంలో మృతి చెందిన సర్దార్ సోదరుడు
మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లింపు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని హావేరి వద్ద ఈ నెల 14న వోల్వో బస్సు దగ్ధం సంఘటనలో మృతుల కుటుంబాలకు బస్సు యాజమాన్యం నష్ట పరిహారం అందజేసింది. నేషనల్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దగ్ధం దుర్ఘటనలో ఏడుగురు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. స్థానిక చామరాజపేట స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జేడీఎస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ ఆ ట్రావెల్స్ యజమాని. దుర్ఘటన జరిగిన రోజే ఆయన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. లక్ష చొప్పున ప్రకటించింది. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించిన రోజు..జమీర్ నష్ట పరిహారం చెక్కులను కూడా పంపిణీ చేశారు. కాగా, ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారం అందాల్సి ఉంది.