మెదక్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మెదక్ పట్టణంలోని ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతయ్యాయి. వివిధ వార్డుల్లో ఓటరు గుర్తింపు కార్డులున్నా జాబితాలో పేర్లు కనిపించకపోవడంతో ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు వందల్లో ఓట్లు గల్లంతైనట్టు సమాచారం. తమ ఓటు ఎక్కడుందో తెలియక స్థానికులు అయోమయానికి గురవుతున్నారు. తమ ముందూ, వెనుక వార్డుల్లోని జాబితాల్లో పేర్లను వెతుక్కుంటున్నారు. ‘సారూ.. నా ఓటు పక్క వార్డు జాబితాలో ఉంది. మా వార్డులోకి మార్చండి’ అంటు దరఖాస్తు చేసుకుంటున్నారు. కౌన్సిలర్‌గా పోటీ చేసే అభ్యర్థులు సైతం తమ పేర్లు మారిపోయాయంటూ వాపోతున్నారు.
పట్టణంలోని 2, 7 వార్డుల్లో 50 మంది ఓటర్లను అదనంగా చేర్చారు. 10వ వార్డుకు చెందిన 500 ఓట్లు 9వ వార్డు జాబితాలో ఉన్నాయి. అదే విధంగా 2, 27వ వార్డుకు సంబంధించి సుమారు 200 ఓట్లు గల్లంతయ్యాయి. 6వ వార్డులో ఇప్పటికీ ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నా జాబితాలో పేర్లు లేవని స్థానికులు చెబుతున్నారు. అయితే దొంగ ఓట్లను చేర్చినట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. 18వ వార్డులో ఒకే ఇంటి నంబర్‌పై 130 ఓట్లు వచ్చాయంటూ అదే వార్డుకు చెందిన వారు మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పట్టణంలోని 27 వార్డుల్లోనూ జాబితా తప్పుల తడకగా ఉంది. గత ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వారికి ప్రస్తుత జాబితాలో పేర్లు లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా తహశీల్దార్ కార్యాలయం విడుదల చేసిన ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లు.. మున్సిపల్ ఎన్నికల జాబితాలో లేవు. దీంతో తమ ఓటు ఎక్కడుందో తెలియక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని వార్డుల్లో మరణించిన వారి పేర్లు జాబితాలో దర్శనమివ్వడం గమనార్హం.
ఆశించిన స్థాయిలో పెరగని ఓటర్లు
మెదక్ మున్సిపల్ పరిధిలో జనాభాకు అనుగుణంగా ఆశించిన స్థాయిలో ఓటర్ల సంఖ్య పెరగలేదు. 2005 ఎన్నికల్లో పట్టణ జనాభా 41 వేల 945 ఉండగా, 29వేల 376 మంది ఓటర్లు ఉన్నారు. కాని ఓటుపై అవగాహన లేక ఎంతోమంది అర్హులు ఓటు నమోదు చేయించుకోలేదని భావించిన ప్రభుత్వం ఓటు నమోదు చేసుకోవాలంటూ ప్రత్యేకంగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. 18 సంత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కచ్చింగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. అయినప్పటికీ మెదక్ మున్సిపల్ పరిధిలో పెద్దగా కొత్త ఓటర్ల నమోదు జరగలేదు. కానీ కొత్తగా నమోదు చేసుకున్నవారికి కూడా పూర్తిస్థాయిలో గుర్తింపు కార్డులు మంజూరు కాలేదు.
ప్రస్తుతం మెదక్ పట్టణంలో 44 వేల 110 మంది జనాభా ఉంది. కాగా 1వ వార్డులో 1105, 2వ వార్డులో 1878, 3వ వార్డులో 936, 4వ వార్డులో 1035, 5వ వార్డులో 1117, 6వ వార్డులో 1129, 7వ వార్డులో 1706, 8వ వార్డులో 1520, 9వ వార్డులో 2013, 10వ వార్డులో 748, 11వ వార్డులో 1236, 12వ వార్డులో 1632, 13వ వార్డులో 1341, 14వ వార్డులో 1029, 15వ వార్డులో 1043, 16వ వార్డులో 1143, 17వ వార్డులో 890, 18వ వార్డులో 1327, 19వ వార్డులో 849, 20వ వార్డులో 775, 21వ వార్డులో 942, 22వ వార్డులో 952, 23వ వార్డులో 1012, 24వ వార్డులో 1038, 25వ వార్డులో 1118, 26వ వార్డులో 557, 27వ వార్డులో 996 మంది ఓటు హక్కును కలిగి ఉన్నారు. పట్టణంలో అత్యధికంగా 9వ వార్డులో 2013, అత్యల్పంగా 26వ వార్డులో 557 ఓట్లు ఉన్నాయి.
నాలుగు రోజుల్లో కొలిక్కి వచ్చేనా?
మున్సిపల్ ఓటర్ల జాబితాలోని గల్లంతయిన ఓట్లు, గుర్తింపు కార్డు ఉండి జాబితాలో పేర్లు లేకపోయిన వాటిని ఈ నెల 10 లోపు సవరణ చేస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అదే విధంగా కొత్త కార్డు కావాల్సిన వారు ఫారమ్ 6ను ఇవ్వాలని సూచించారు. కాని యేళ్ళ నుంచి దరఖాస్తు చేసుకున్నా ఇవ్వని ఓటరు కార్డు నాలుగు రోజుల్లో ఇస్తారా? అన్న సందేహం ప్రజల్లో ఉంది.
ఓట్లు.. పాట్లు
Published Fri, Mar 7 2014 11:36 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement