ఓటుకు పోటు
Published Mon, Jan 20 2014 2:07 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
సాక్షి, గుంటూరు: పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఓటు హక్కు కోసం బీఎల్‌వోల వద్ద, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న యువత కొత్త జాబితాలో తమ పేరు చూసుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియలో భాగంగా అధికారులు ఏవో సాకులతో దాదాపు సగం దరఖాస్తులను తిరస్కరించారని, బోగస్ ఓట్ల తొలగింపుల్లో కొందరు అర్హుల ఓట్లు కూడా తొలగించారని సమాచారం. ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా జిల్లాలో 2,66,245 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సుమారు లక్షన్నర మందికే ఓటర్ల జాబితాలో చోటు కల్పించినట్లు తెలుస్తోంది.
పై పెచ్చు తొలగింపులకు అందిన 24,251 దరఖాస్తులతో పాటు అధికార యంత్రాంగం సుమోటోగా తొలగించిన ఓట్ల సంఖ్య 50 వేలకు పైగా ఉన్నాయి. ఈ నెల 31న ఓటర్ల తుది జాబితా ప్రచురించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. తుది జాబితా అనంతరం మళ్లీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ చెబుతున్నప్పటికీ సార్వత్రిక ఎన్నికలకు ఓటు హక్కు దక్కుతుందో లేదోనని జిల్లా ఓటర్లు ఆందోళనలో ఉన్నారు. బోగస్ ఓట్లు, ఎలక్టోరల్ పాపులేషన్ రేషియో (ఈపీ రేషియో) పేరుతో అధికారులు తొలగింపులు అధికంగా చేపట్టినట్లు తెలుస్తోంది. పైగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారికీ జాబితాలో చోటు కల్పించారో.. లేదో.. నన్న అనుమానం వ్యక్తమౌతోంది. శుక్రవారంతో ఓటర్ల చేర్పులు, తొలగింపులపై రెవెన్యూ యంత్రాంగం విచారణ పూర్తి చేసింది. ప్రస్తుతం జాబితా ప్రచురణ కోసం కంప్యూటరైజేషన్, డేటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగించనున్నారు.
ఈపీ రేషియో అంటే...
సార్వత్రిక ఎన్నికల కోసం అధికారులు తప్పుల్లేని ఓటర్ల జాబితా తయారు చేయాల్సి ఉంది. అర్హులైన వారికి అంటే జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ఓటు హక్కు కల్పించాలి.
ఎన్నికల కమిషన్ నిర్ధేశాల ప్రకారం ఈపీ రేషియో అంటే ప్రతి వంద మంది జనాభాలో 66 నుంచి 70 వరకు ఓటర్లుండాలి.
జనాభాలో 70 శాతానికి మించి ఓటర్లుంటే అధికారులు అక్కడ బోగస్ ఓట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ సాకుతో అర్హులై దరఖాస్తు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పించలేదు.
తుది జాబితా ప్రకటించే ముందు ఎన్నికల కమిషన్‌కు జాబితా పంపి అనుమతి తీసుకోవాలి.
సాధారణంగా అధికార యంత్రాంగం 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఈపీ రేషియోతో సరిచూసి ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు. 2011 నుంచి మూడేళ్ళ వ్యవధిలో సంబంధిత నియోజకవర్గంలో పెరిగిన జనాభాను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
సుమోటో తొలగింపులు ఎక్కడ అధికం
మామూలుగా బోగస్ ఓట్లు అధికారులు క్షేత్ర పరిశీలనకు వె ళ్లి నిష్పాక్షిక విచారణ జరిపితే ఎవ్వరికి అభ్యంతరం ఉండదు.అధికారులు ఈపీ రేషియో కోసమో.. అధికంగా చేర్పులకు దరఖాస్తులు అందాయోనని సుమోటో తొలగింపులు చేపట్టడంతో పాటు చేర్పులకు కొన్ని చోట్ల అవకాశం కల్పించలేదు.
సవరణలకు 29,478 దరఖాస్తులు అందాయి. వీటిని ఏ మేరకు పరిగణనలోకి తీసుకున్నారో అనుమానమే.
నరసరావుపేట, చిలకలూరిపేట, మాచర్ల, పెదకూరపాడు, గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో బోగస్ ఓట్లు అధికంగా ఉన్నాయని అంచనాకు వచ్చారు. చిలకలూరిపేట, మాచర్ల, వేమూరు నియోజకవర్గాల్లో అర్హులైన వారి ఓట్లు అధికంగా తొలగించినట్లు ఆరోపణలున్నాయి.
పిల్లల చదువుల నిమిత్తం ఎక్కువ మంది గుంటూరులో నివాసం ఉంటున్నారని, అక్కడ ఓటు కోసం దరఖాస్తు చేసి ఇక్కడ ఓటును అలాగే ఉంచడంతో తొలగింపులు చేపట్టామనేది రెవెన్యూ యంత్రాంగం వాదన. మరో రెండు రోజులు జాబితా రూపకల్పన కోసం కసరత్తు చేసి కంప్యూటరీకరణ చేయనున్నారు.
31 నాటికల్లా ప్రచురించే తుది జాబితాలో ఎవరి ఓటుకు పోటేశారో.. వెల్లడి కానుంది.
Advertisement
Advertisement