భారీగా తగ్గిన ఓటర్లు
జిల్లాలో మొత్తం ఓటర్లు 33,38,938
గతేడాది కంటే 71,679తక్కువ
4 నియోజకవర్గాల్లో పెరుగుదల.. 11 నియోజకవర్గాల్లో తగ్గుదల
అత్యధికంగా విశాఖ పశ్చిమలో 17,987 ఓటర్ల తొలగింపు
కొత్త ఓటు హక్కు పొందిన యువత 26,693 మందే
2016 ఓటర్ల తుది జాబితా వెల్లడి
విశాఖపట్నం: గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని ఓటర్లలో భారీగా కోతపడింది. ఓటర్ల తుది జాబితా-2016ను మంగళవారం జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. తుది జాబితా ప్రకారం జిల్లాలో 33,43,190 మంది ఓటర్లున్నట్టుగా ప్రకటించారు. గతేడాది ప్రకటించిన ఓటర్ల జాబితాతో పోలిస్తే ఏకంగా 20 శాతం మేర కోతపడింది. వీటిపై డిసెంబర్ -15వ తేదీ వరకు విచారణ చేసి, జనవరి 11న తుది జాబితా సిద్ధంచేశారు.
తగ్గడం ఇదే తొలిసారి
ఓటర్ల సవరణ కోసం గతేడాది అక్టోబర్-5 భారత ఎన్నికల సంఘం నోటిఫి కేషన్ జారీ చేసింది. నవంబర్ 16 వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. అక్టోబర్ 11న, నవంబర్ 1న పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలు నిర్వ హించారు. కొత్తగా ఓటుహక్కు కోసం 26,693 మంది, ఓటు హక్కు తొలగింపు కోసం 623 మంది, చేర్పులు మార్పుల కోసం 5145 మంది, నియోజకవర్గ పరిధిలో ఒక పోలింగ్ బూత్ నుంచి మరో పోలింగ్ బూత్‌కు ఓటు బదిలీ కోసం 1412 మంది దరఖాస్తు చేసు కున్నారు. వీటిపై డిసెంబర్ -15 వరకు విచారణ చేపట్టారు. తుది జాబితాను జనవరి 11న ప్రచురించారు. ఈ వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడంతో గతంతో పోలిస్తే ఓట్ల సంఖ్య పెరగాల్సింది పోయి గణనీయంగా తగ్గింది. 2015 ఓటర్ల జాబితా కింద జిల్లాలో 34,10,617 మంది కాగా, తాజాగా సవరించిన ఓటర్ల జాబితా-2016 ప్రకారం జిల్లాలో 33,38,938 మంది ఓటర్లున్నారు. అంటే ఏకంగా 71,679 మంది ఓటుహక్కును కోల్పోయారు. ఇంత భారీ స్థాయిలో ఓటర్లలో కోత పడడం ఇదే తొలిసారి.
2015లో పురుష ఓటర్లు 17,00195 మంది ఉంటే.. ప్రస్తుతం 16,63,444 మంది ఉన్నారు. అలాగే 2015లో స్త్రీలు 17,10,161 మంది ఉంటే ప్రస్తుతం 16,75,236 మంది ఉన్నారు. ఈ లెక్కన పురుష ఓట్లు 36,751 మహిళా ఓట్లు 34,925 తగ్గాయి. 2015లో ఇతరులు 261 మంది ఉంటే ప్రస్తుతం 258 మంది ఉన్నారు.
ఏడుగురు ప్రవాస భారతీయులకు ఓటు హక్కు
2016లో కొత్తగా విశాఖ ఈస్ట్ పరిధిలో ఏడుగురు ప్రవాస భారతీయులకు ఓటు హక్కు కల్పించారు. 4252 మంది సర్వీస్ ఓటర్లుండగా, వారిలో 3459 మంది పురుషులు, 793 మంది స్త్రీలు ఉన్నారు. సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం హెచ్చుతగ్గులు నియోజక వర్గాల వారీగా పరిశీలిస్తే భీమిలిలో 2353, విశాఖ ఈస్ట్‌లో 2906, మాడుగులలో 744, పాడేరులో 750 చొప్పున ఓట్ల సంఖ్య పెరగగా, విశాఖ సౌత్‌లో 7035, నార్త్‌లో 15,852, పశ్చిమలో అత్యధికంగా 17,987, గాజువాకలో 12,049, చోడవరంలో 1953, అరకువాలీ (ఎస్టీ)లో 2698, అనకాపల్లిలో 3620, యలమంచలిలో 8290, పాయకరావుపేటలో 6777, నర్సీపట్నంలో 1849 చొప్పున ఓట్లు తగ్గాయి. 18-19 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఓటు హక్కుకు అర్హతకలిగిన యువత 1.75,298 మంది ఉన్నారు. వారిలో 62,250 మంది మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండగా, కొత్తగా 26,693 మంది మాత్రమే ఓటు హక్కు పొందారు.1,13,048 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. మరో పక్క చనిపోయిన వారితో పాటు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారు, అనర్హులను తొలగించడంతో సవరించిన జాబితాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది.