
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య 3,69,33,091కు చేరింది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ప్రత్యేక సవరణ(ఎస్‌ఎస్‌ఆర్)–2019 అనంతరం తుది ఓటర్ల జాబితాను శుక్రవారం ప్రకటించింది. దీనిప్రకారం రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. తుది ఓటర్ల జాబితాలో 1,83,24,588 మంది పురుషులు, 1,86,04,742 మంది మహిళలు, 3,761 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వీరిలో 2,520 మంది ప్రవాసాంధ్ర(ఎన్‌ఆర్‌ఐ) ఓటర్లు కూడా ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించినందున ఎస్‌ఎస్‌ఆర్–2019 తుది ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ) కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఓటర్ల జాబితాలో ప్రజలు తమ పేరు ఉందో లేదో వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని, ఎవరి పేర్లయినా లేకపోతే నమోదు కోసం ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ముఖ్య ఎన్నికల అధికారి ఆర్.పి.సిసోడియా సూచించారు. ఓటర్ల నమోదు కోసం ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్ (నేరుగా) గానీ ఫారం–6 సమర్పించవచ్చని పేర్కొన్నారు. నామినేషన్ల చివరి రోజు వరకూ అర్హులు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
- ముసాయిదా ఓటర్ల జాబితాలో 1,74,58,240 మంది పురుషులు, 1,77,33,676 మంది మహిళలు, 3,344 మంది ట్రాన్స్‌జెండర్లు కలిపి మొత్తం 3,51,95260 మంది ఓటర్లు ఉండగా ఎస్‌ఎస్‌ఆర్–2019 తుది జాబితాకు వచ్చేసరికి 1,83,24,588 మంది పురుషులు, 1,86,04,742 మంది మహిళలు, 3,761 మంది ట్రాన్స్‌జెండర్లు కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091కి పెరిగింది.
- ప్రవాసాంధ్ర ఓటర్ల సంఖ్య ముసాయిదా ఓటర్ల జాబితాలో 15 మాత్రమే ఉండగా, తుది జాబితాకు వచ్చే సరికి 2,520కి చేరింది.
- తుది ఓటర్ల జాబితాలో 18–19 మధ్య వయస్కులు 5,39,804 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 3,11,059 మంది, మహిళలు 2,28,625 మంది, ట్రాన్స్‌జెండర్లు 120 మంది ఉన్నారు.
- తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 40,13,770 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 17,33,667 మంది ఓటర్లు ఉన్నారు.
- శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో మాత్రమే మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. మిగిలిన 11 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండడం గమనార్హం.
- ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన తర్వాత 21,24,525 మంది కొత్తగా ఓటర్ల జాబితాలో చేరగా, 3,86,694 మంది పేర్లను తొలగించారు.
- ముసాయిదా జాబితా ప్రకటన తర్వాత 18–19 వయస్కులు 5,03,516 మంది ఓటర్లుగా నమోదయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment