వెలుగులోకి వీఆర్‌ఓ అక్రమాలు | Vro Caught Bribery Demand In Chittoor | Sakshi
Sakshi News home page

వెలుగులోకి వీఆర్‌ఓ అక్రమాలు

Published Tue, Jul 31 2018 12:03 PM | Last Updated on Tue, Jul 31 2018 12:03 PM

Vro Caught Bribery Demand In Chittoor - Sakshi

పిచ్చాటూరు మాజీ వీఆర్‌ఓ నాగభూషణంపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న బాధితుడు రాధాక్రిష్ణన్‌ (ఇన్‌సెట్‌) నాగభూషణం(ఫైల్‌)

తిరుపతి : సస్పెన్షన్‌లో ఉన్న పిచ్చాటూరు మాజీ వీఆర్‌ఓ నాగభూషణం అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తల్లి పేరుతో ఉన్న పట్టాను మార్చేందుకు రూ.1.25 లక్షలు తీసుకున్నాడు. దీంతో బాధితుడు సోమవారం పోలీసులు, తహసీల్దారుకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు, తహసీల్దారు కథనం మేరకు.. పిచ్చాటూరు బజారు వీధికి చెందిన కె.రాధాక్రిష్ణన్‌కు ఎక్కువయ్యాయి. తన తల్లి సి.పట్టమ్మ పేరుతో ఉన్న పట్టాను (దస్తావేజు నెం.729/2018) తన పేరుతో మార్చుకొని బ్యాంకులో రుణం తీసుకోవాలని అనుకున్నాడు. పిచ్చాటూరు వీఆర్‌ఓగా పని చేసిన నాగభూషణంను కలిసి సలహా కోరాడు. దీన్ని నాగభూషణం ఆసరాగా తీసుకున్నాడు.

రెవెన్యూ రికార్డుల్లో పట్టమ్మ పేరు తొలగించి రాధాక్రిష్ణన్‌ పేరు చేర్చడానికి రూ.50 వేలు, రాధాక్రిష్ణ తండ్రి, తాత డెత్‌ సర్టిఫికెట్‌ తీసుకోవడానికి రూ.20 వేలు, రిజిస్ట్రేషన్‌ ఖర్చులకు మరో రూ.55 వేలు అవుతుందని చెప్పాడు. అందుకు ఒప్పుకున్న రాధాక్రిష్ణన్‌ ఈ నెల 7వ తేదీన రూ.50 వేలు, 14వ తేదీన రూ.20 వేలు 18న 10 వేలు, 24న రూ.45 వేలు చొప్పున మొత్తం రూ.1.25 లక్షల నగదును స్థానికుడైన ఆరుముగం ద్వారా నాగభూషణంకు అందజేశాడు. నాగభూషణం పని చేయలేదు. దీనిపై ప్రశ్నించగా మరో రూ.50 వేలు ఇస్తే ఒరిజినల్‌ సెటిల్‌మెంట్‌ డ్యాక్యుమెంట్‌ ఇస్తామని అతను నమ్మబలికాడు. దీంతో రాధాక్రిష్ణన్‌ ఎస్‌ఐ రామాంజనేయులు, తహసీల్దారు కిరణ్‌కు ఫిర్యాదు చేశాడు. డబ్బు తీసుకున్నట్టు ఎవరికీ చెప్పరాదని, చెబితే చంపేస్తామని నాగభూషణం తనను బెదిరిస్తున్నట్లు బాధితుడు వాపోయాడు. మధ్యవర్తి బీఈ ఆరుముగంతోపాటు నాగభూషణంపై  విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరాడు. బాధితుడు ప్రస్తుత వీఆర్‌వో విశ్వనాథం, ఆర్‌ఐ స్వరూపరాణి సమక్షంలో ఫిర్యాదు చేయడం గమనార్హం.

మరో ఆరుగురి నుంచి రూ.5 లక్షలు వసూలు
నాగభూషణం మరో ఆరుగురి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందినట్లు తహసీల్దారు చెప్పారు. వాటిపై విచారణ చేసి రెవెన్యూ శాఖ తరపున నాగభూషణంపై మరో కేసు నమోదు చేయనున్నామన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ సమస్యలు ఉంటే నేరుగా సంబంధిత వీఆర్‌ఓ ద్వారా తమను సంప్రదించాలని తెలిపారు. వీలైనంత త్వరలో పనులు పూర్తి చేస్తామని, మాజీ వీఆర్‌ఓలను, దళారులను ఆశ్రయించవద్దని ప్రజలకు సూచించారు.

జిల్లా యంత్రాంగాన్నితప్పుదారి పట్టించిన ఘనుడు
దీనిపై తహసీల్దారు కిరణ్‌ సోమవారం విలేకరులతో మాట్లాడారు. పిచ్చాటూరు వీఆర్‌ఓగా పని చేస్తున్న నాగభూషణంను గత ఏడాది పులిచెర్ల మండలానికి కలెక్టర్‌ బదిలీ చేశారని తెలిపారు. ఆయన విధులకు హాజరు కాలేదన్నారు. పైగా సమాచార హక్కు చట్టం పేరిట నకిలీ పత్రాలను సృష్టించి ఆంధ్రప్రదేశ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌లో కేసు వేసినట్టు పేర్కొన్నారు. ఇందులో జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న, అప్పటి తిరుపతి సబ్‌ కలెక్టర్‌ నిషాంత్‌ కుమార్‌ను ప్రతివాదులుగా చేర్చారని తెలిపారు. ఈలోపే తనకు న్యాయం చేయాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రిని ఆశ్రయించాడన్నారు. అతనికి ఉద్యోగం ఇవ్వాలని మంత్రి సర్క్యులర్‌ ఇచ్చారని పేర్కొన్నారు. దాన్ని కలెక్టర్, సబ్‌కలెక్టర్‌ అమలు చేయలేదని నాగభూషణం ట్రిబ్యునల్‌కు తెలిపాడని వివరించారు. దీంతో వ్యక్తిగతంగా హాజరుకావాలని కలెక్టర్, సబ్‌కలెక్టర్‌ను ట్రిబ్యునల్‌ కోర్టు ఆదేశించిందని తెలిపారు. నాగభూషణంపై ఉన్న ఆరోపణలను కలెక్టర్, సబ్‌ కలెక్టర్‌ నిరూపించడంతో ట్రిబ్యునల్‌ కేసును కొట్టి వేసిందన్నారు. అనంతరం నాగభూషణంను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement