వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టులొచ్చాయ్.. | vro,vra posts to be filled very soon | Sakshi
Sakshi News home page

వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టులొచ్చాయ్..

Published Sun, Dec 22 2013 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM

vro,vra posts to be filled very soon

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులకు శుభవార్త. దీర్ఘకాలంగా వారు ఎదురుచూస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌వో), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) పోస్టులకు ఎట్టకేలకు ఈనెల 28న నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,657 వీఆర్‌వో, 4,305 వీఆర్‌ఏ పోస్టులను వచ్చే ఫిబ్రవరి నెలాఖరు కల్లా భర్తీ చేయనున్నట్లు రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ఈనెల 28న జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేస్తారని చెప్పారు. 2014, ఫిబ్రవరి 2న రాతపరీక్ష నిర్వహించి, అదే నెల 20న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.

 

శనివారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్ల డించారు. గతంలో మాదిరిగానే వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టులను ఈసారి కూడా పారదర్శకంగా భర్తీ చేస్తామన్నారు. ఎలాంటి అవకతవకలు, అక్రమాలు, అడ్డదారులకూ అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే సీసీఎల్‌ఏ కార్యాలయం లేదా జిల్లా కలెక్టరేట్లలో సంప్రదించి, నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.
 
 వీరికీ అర్హత: ఈ పోస్టులకు సంబంధించి కనీస విద్యార్హతల విషయానికొస్తే, వీఆర్‌వోలకు ఇంటర్ లేదా సాంకేతిక విద్యాశాఖ గుర్తింపు ఉన్న మూడేళ్ల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. వీఆర్‌ఏలకు పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులు అర్హులు. వీఆర్‌వోలకు 18 నుంచి 36 సంవత్సరాల వయోఃపరిమితి కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 41 ఏళ్లు, వికలాంగులకు 46 ఏళ్లు, మాజీ సైనికులకు 39 ఏళ్ల వరకు సడలింపు ఇచ్చారు. వీఆర్‌ఏలకు 18 నుంచి 37 సంవత్సరాలు కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 42, వికలాంగులకు 47, మాజీ సైనికులకు 40 ఏళ్ల వరకు సడలింపు ఉంది. పరీక్ష ఫీజు రూ. 500 కాగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200 చెల్లించాలి. వికలాంగులకు పూర్తి మినహాయింపు ఉంది. దరఖాస్తులను ఈసేవ, మీసేవ, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు.

 

పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ప్రశ్నపత్రం తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. జనరల్ స్టడీస్ 60, అర్థమెటిక్ 30, లాజికల్ స్కిల్స్ 10 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. జనరల్ స్టడీస్‌లో సగం ప్రశ్నలు గ్రామీణ ప్రాంతాలు, అక్కడి ప్రజల జీవన విధానంపై అవగాహనను పరీక్షించేవిగా ఉంటాయి. ప్రశ్నపత్రం వీఆర్‌వోలకు ఇంటర్మీడియెట్, వీఆర్‌ఏలకు 10వ తరగతి స్థాయిలో ఉంటుంది. ఇక స్థానికత (లోకల్) నిర్ధారణ విషయానికొస్తే, వీఆర్‌వో పోస్టులను జిల్లా యూనిట్‌గా, వీఆర్‌ఏ పోస్టులను రెవెన్యూ గ్రామం యూనిట్‌గా భర్తీ చేస్తారు.
 
 షెడ్యూల్ ఇలా...
 నోటిఫికేషన్ జారీ        : డిసెంబర్ 28
 దరఖాస్తు గడువు        : 2014, జనవరి 12
 నెట్‌లో దరఖాస్తు గడువు        : జనవరి 13
 హాల్ టికెట్ల జారీ        : జనవరి 19 నుంచి
 పరీక్ష తేదీ        : ఫిబ్రవరి 2
 (వీఆర్‌వోలకు ఉదయం, వీఆర్‌ఏలకు మధ్యాహ్నం)
 ప్రాథమిక ‘కీ’ వెల్లడి        : ఫిబ్రవరి 4
 తుది ‘కీ’ వెల్లడి        : ఫిబ్రవరి 10
 ఫలితాల ప్రకటన        : ఫిబ్రవరి 20
 నియామక పత్రాల జారీ        : ఫిబ్రవరి 26 నుంచి
 
 జిల్లాల వారీగా పోస్టులు...
 
 జిల్లా    వీఆర్‌ఏ    వీఆర్‌వో
 శ్రీకాకుళం    176    77
 విజయనగరం    137    90
 విశాఖపట్నం    12    41
 తూర్పు గోదావరి    357    87
 పశ్చిమ గోదావరి    360    51
 కృష్ణా    403    64
 గుంటూరు    425    83
 ప్రకాశం    282    117
 ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు    145    48
 చిత్తూరు    188    104
 అనంతపురం    167    64
 వైఎస్సార్ కడప    128    27
 కర్నూలు    176    105
 మహబూబ్‌నగర్    94    103
 కరీంనగర్    223    83
 మెదక్    172    98
 వరంగల్    177    62
 నిజామాబాద్    94    65
 ఆదిలాబాద్    83    53
 ఖమ్మం    105    78
 నల్లగొండ    201    68
 రంగారెడ్డి    158    72
 హైదరాబాద్    42    17
 మొత్తం    4,305    1,657


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement