సాక్షి, నల్లగొండ: జిల్లాలో ఆదివారం ఉదయం వీఆర్‌ఓ, మధ్యాహ్నం వీఆర్‌ఏ పరీక్షలు ప్రశాం తంగా, సజావుగా జరిగాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో వీఆర్‌ఓ పరీక్షకు 86.24 శాతం, వీఆర్‌ఏకు 89.14 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మూడు.. నాలుగు నిమిషాలు కేంద్రాల వద్దకు ఆలస్యంగా వెళ్లిన అభ్యర్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతించలేదు. దూర ప్రాంతాల నుంచి రావడంతో ఆలస్యమైందని వేడుకున్నా అధికారులు కనికరించకపోవడంతో అభ్యర్థులు కన్నీళ్లతో వెనుదిరిగారు.
రోజులపాటు పుస్తకాలతో కుస్తీపట్టిన శ్రమంతా వృథా అయ్యిందని విలపించారు. రెండుమూడు సెంటర్లలో మినహా మిగిలిన ప్రాంతాల్లో ప్రశాంతంగా జరిగింది. మరికొందరు పరీక్ష సమయానికి రెండు నిమిషాల ముందు ఉరుకూపరుగులతో పరీక్ష హాల్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. పరీక్ష కేంద్రాలున్న పట్టణాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించినా అభ్యర్థులకు కష్టాలు తప్పలేదు. రోజువారీగా తిరిగే బస్సులకు అదనంగా మరో 124 బస్సులను నడిపించారు. అయినా బస్సులన్నీ కిటకిటలాడాయి. దీంతో ముఖ్యంగా వికలాంగులు నానా అవస్థలు పడ్డారు.
వీఆర్‌ఓకు 86.24 శాతం హాజరు....
68 వీఆర్‌ఓ పోస్టులకుగాను 85,438 దరఖాస్తులు అందగా.. వీరికి 278 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇం దులో 73,690 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 201 వీఆర్‌ఏ పోస్టులకుగాను 4997 దరఖాస్తులు అధికారులకు అందాయి. వీరికి కేవలం జిల్లాకేంద్రంలోనే 14 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,468 మంది పరీక్ష రాశారు. మొత్తం మీద వీఆర్‌ఓ పరీక్షకు 11,748, వీఆర్‌ఏ పరీక్షకు 529 మంది గైర్హాజరయ్యారు. హాజరైన అభ్యర్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే ఒక్కో వీఆర్‌ఓ పోస్టుకు 1,083 మంది పోటీలో ఉన్నారు.
హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు...
దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు పరీక్ష కేంద్రాల చిరునామా, మార్గాలు తెలపడానికి పలుచోట్ల హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు అందుబాటులో ఉన్నారు. వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్ష కేంద్రాలు ఎక్కడున్నాయో తెలపడంతో అభ్యర్థులకు శ్రమ తప్పి సమయం ఆదా అయ్యింది.
పలు వీఆర్‌ఓ పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ చిరంజీవులు సందర్శించారు. ఎన్జీ కళాశాలలో పరీక్ష ప్రారంభానికి ముందు హాల్‌లో అభ్యర్థులతో మాట్లాడారు. ఎలా సన్నద్ధమయ్యారని అడిగి తెలుసుకున్నారు. ప్రతిభనే నమ్ముకోండి.. మధ్యవర్తుల మాటలను ఎట్టిపరిస్థితుల్లోనూ వినకండి.. అని అభ్యర్థులకు సూచిం చారు. అనంతరం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ఎస్‌ఆర్‌టీఐ, డైట్ సెంటర్లలో తిరిగారు. పరీక్షల నిర్వహణ తీరుపై అధికారులతో సమీక్షించారు. మధ్యాహ్నం ప్రభుత్వ మహిళా డిగ్రీ, బాలికల జూనియర్ కళాశాలల్లో పడిన వీఆర్‌ఏ పరీక్ష కేంద్రాలను సందర్శించారు.
సజావుగా పల్లె ‘పరీక్ష’
Published Mon, Feb 3 2014 4:06 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement