
'జగన్ పర్యటనతో సంతోషంగా ఉన్నారు'
నంద్యాల: వైఎస్ జగన్ పర్యటనతో ఆర్యవైశ్యులు సంతోషంగా ఉన్నారని, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని జగన్ చెప్పడం హర్షనీయమని వైఎస్సార్ సీపీ నేతలు కోలగట్ల వీరభద్రస్వామి, వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. నంద్యాల పట్టణంలో రోడ్ల వెడల్పు కారణంగా ఆస్తులు కోల్పోయిన వారికి జగన్ న్యాయం చేస్తారని హామీయిచ్చారు. కేశవరెడ్డి, అగ్రిగోల్డ్ బాధితులన ఆదుకుంటారని హామీయిచ్చారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వియ్యంకుడే కాబట్టి కేశవరెడ్డి జోలికి సీఎం చంద్రబాబు పోవడం లేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో జగన్ అందరికీ న్యాయం చేస్తారన్నారు.
శిల్పామోహన్ రెడ్డిని గెలిపిస్తే నంద్యాల జిల్లా కేంద్రం అవుతుందని, మోడల్ టౌన్‌గా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యనిషేధం అమలు తీసుకువస్తామని జగన్ ప్రకటించగానే బెల్ట్ షాపులు రద్దు చేస్తామంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ నోటి వెంట మాట వస్తేనే చంద్రబాబు చేస్తున్నారని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో చంద్రబాబు జిమ్మిక్కులు పనిచేయవన్నారు. చంద్రబాబు తన మూడేళ్ల పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు. నవరత్నాల హామీలు ప్రకటించగానే జగన్‌పై టీడీపీ నాయకులు మూకుమ్మడి దాడి చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు.