మూడేళ్ళుగా ఆ తలుపులు తెరుచుకోలేదు. రక్త నిల్వలూ లేవు. ఎవరికీ సరఫరా కావడం లేదు. ఉద్యోగులు ఎవరూ ఇక్కడ పనిచేయడం లేదు. అయినా వారికి నెలనెలా జీతాలు చెల్లించేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించే నాథులు లేరు. ఇదీ గుంటూరులోని రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంకు నిర్వాహకుల తీరు.
సాక్షి, గుంటూరు : జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంక్‌లో నగరానికి చెందిన అనేక మంది ప్రముఖులు మెంబర్లుగా ఉన్నారు. చాలా ఏళ్లపాడు ఎంతో సమర్థంగా దీనిని నడిపి ఎందరో నిరుపేద రోగులకు అతి తక్కువ ధరకే వివిధ గ్రూపుల రక్తాన్ని అందించారు. కానీ గడచిన మూడేళ్లుగా ఇది మూతపడింది. ఫలితంగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో చికిత్స నిమిత్తం వచ్చే అనేక మంది పేద రోగులు రక్తం అందక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
గతంలో రోజుకు 35 నుంచి 40 మంది రోగులకు రక్తాన్ని సరఫరా చేస్తూ ఈ బ్లడ్ బ్యాంకు ఎందరికో ప్రాణదానం చేసింది. ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల కంటే సుమారు రూ. 400లు తక్కువ ధరకు రక్తాన్ని అందించి నిరుపేద రోగులకు ఆలంబనగా నిలిచింది. ప్రస్తుతం ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల్లో బ్లడ్ యూనిట్ ధర రూ. 1450లు ఉండగా రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్‌బ్యాంక్‌లో యూనిట్ రూ. 1050లకే అందించేవారు. బ్లడ్ బ్యాంకు చేస్తున్న సేవలను గుర్తించి అనేక మంది తమ రక్తాన్ని ఇక్కడే ఇచ్చేవారు.
అయితే బ్లడ్‌బ్యాంకులో కాంపౌనెంట్ సపరేట్‌గా పెట్టి ఆధునికీకరణ చేయాలని నిర్ణయించిన కమిటీలోని కొందరుసభ్యులు అందుకు సుమారు రూ. 20 లక్షల నిధులు అవసరమవుతాయని గుర్తిం చారు. ఈ మొత్తాన్ని సమకూర్చేవరకు బ్లడ్‌బ్యాంకును మూసివేయాలని నిర్ణయించారు. కానీ పనులు మాత్రం చేపట్టలేదు. పేదల అవసరాలు తీర్చలేదు.
మూడేళ్ళల్లో రూ. 15 లక్షల
జీతాలు చెల్లింపు
బ్లడ్‌బ్యాంకు మూతపడి మూడేళ్ళు గడుస్తున్నా అందులో పనిచేసే మెడికల్ ఆఫీసర్‌కు నెలకు రూ. 10వేలు చొప్పున, టెక్నీషియన్లు ముగ్గురికి రూ. 6వేలు చొప్పున, సబ్ స్టాఫ్‌కు రూ. 15వేలు చొప్పున జీతాలు చెల్లిస్తూ వస్తున్నారు. వీరు బ్లడ్ బ్యాంకు మూసివేయడంతో వేరే చోట హ్యాపీగా పనిచేసుకుంటూ అక్కడ, ఇక్కడా జీతాలు పుచ్చుకుంటున్నారు. ఈ విధంగా మూడేళ్ళల్లో సుమారు రూ. 15 లక్షలు వీరికి జీతాల కింద చెల్లించారు. కాంపోనెంట్ సపరేటర్‌ను ఏర్పాటు చేయాలంటే రూ. 20లక్షలు భారంగా భావించిన నిర్వాహకులకు బ్లడ్‌బ్యాంకులో పనిచేయకుండానే ఉద్యోగులకు రూ. 15లక్షల మేర జీతాలు ఎలా చెల్లించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అయితే కొందరు నిర్వాహకులు గురువారం హడావుడిగా కమిటీ సమావేశం నిర్వహించి రెండు నెలల్లో బ్లడ్‌బ్యాంకును తెరిచేందుకు చర్యలు చేపడతామంటూ తీర్మానించడం గమనార్హం. ఏదేమైనా బ్లడ్‌బ్యాంకుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ స్పందించి బ్లడ్‌బ్యాంకును తెరిచేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఆఫీసు మూత.. వేతనాలు మోత
Published Sat, Mar 14 2015 2:10 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement
Advertisement