మాఫీ గారడీ | Waived juggling | Sakshi
Sakshi News home page

మాఫీ గారడీ

Published Wed, Nov 5 2014 1:49 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

మాఫీ గారడీ - Sakshi

మాఫీ గారడీ

నెల్లూరు(హరనాథపురం):  దేశానికి వెన్నుముక అయిన రైతును రుణమాఫీ పేరుతో మభ్యపెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం పదవి చేపట్టాక వారిని నిండా ముంచారు. ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా రుణమాఫీని తుంగలో తొక్కేందుకు నానా షరతులు విధిస్తూ రైతులకు నిద్రలేని రాత్రులు మిగిల్చారు. మొదట రుణమంతా మాఫీ అని ప్రకటించి అనంతరం దానిని రూ.1.5 లక్షకు పరిమితం చేశారు.

దానికీ రకరకాల షరతులు పెట్టారు. లబ్ధిపొందే రైతుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు 30 అంశాలతో కూడిన వివరాలను బ్యాంకులకు అందించాలని మొదట పేర్కొన్నారు. తర్వాత రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, పాస్‌పుస్తకాలు ఉం టే సరిపోతుందన్నారు. బ్యాంకర్లు పంపిన వివరాల జాబితా సక్రమంగా లేదంటూ, సరిచేసి పంపాలని తిప్పిపంపారు. ఎట్టకేలకు బ్యాంకు అధికారులు కసరత్తు చేసి లబ్ధిదారుల వివరాల బాబితాను ప్రభుత్వానికి పంపారు.

జాబితాను బుధవారం ప్రకటిస్తామని, 15వ తేదీన రుణం లో 20 శాతం చెల్లిస్తామని, ఐదేళ్లలో రైతు రుణమాఫీ పూర్తవుతుందని బాబు చెబుతున్నారు.  తమ పేరు లబ్ధిదారుల జాబి తాలో ఉంటుందో..ఉండదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రబీ సీజన్ ప్రారం భం కావడంతో కొత్త అప్పు పుట్టక, పెట్టుబడి లేక అన్నదాత అగచాట్లు పడుతున్నారు.

 జిల్లాలో 4,93,906 మంది రైతులు గత ఏడాది రబీ, ఖరీప్ సీజన్లలో పంట రుణంగా రూ. 3,093.02 కోట్లు బ్యాంకుల నుంచి పొందారు. రుణాలు చెల్లించకపోవడంతో రూ.లక్ష రుణానికి రైతు వడ్డీగా రూ.7 వేలుకు బదులు రూ.14 వేలు చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు ఒక్కో రైతు కుటుంబానికి మాఫీ చేసేది రూ.1.5 లక్ష మాత్రమేనని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎక్కువ మంది రైతులు అంతకంటే ఎక్కువ మొత్తాన్నే రుణం గా పొందారు. రుణాలు మాఫీతో కష్టాలు గట్టెక్కుతాయని ఆశించిన రైతన్నకు చంద్రబాబు షరతులతో భంగపాటు తప్పలేదు.

 బంగారు రుణాలపై అదనపు భారం....
 జిల్లాలో బంగారు ఆభరణాలు తనఖా పెట్టి 2,20,625 మంది రైతులు రూ.921 కోట్లు అప్పుగా తీసుకున్నారు. బంగారు రుణాల మాఫీ లేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి మొదట ప్రకటించారు. రూ.లక్షకు మించి తీసుకున్న రుణాలను వ్యవసాయేతర రుణాలుగా పరిగణిస్తామని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు.

వీరికి కూడా రుణమాఫీ ఉంటుందని సీఎం చెబుతుండటంతో ఎవరి మాట నమ్మాలో తెలియక రైతులు గందరగోళంలో పడుతున్నారు. మొత్తంగా రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్యను కుదిం చేందుకు చంద్రబాబు అంకెల గారడీ చేస్తున్నారు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టారు.

 డ్వాక్రా మహిళలకూ నిరాశే
 డ్వాక్రా రుణాల విషయంలోనూ షరతులు పెట్టారు. జిల్లాలో సుమారు 41వేల మహిళా సంఘాల సభ్యులు రుణాలు పొందారు. 2013-14లో 8,690 సంఘాలకు సుమారు రూ.200 కోట్ల మేర వివిధ బ్యాంకుల నుంచి రుణాలు అందాయి. గతంలో బ్యాంకు లింకేజీ, స్వయం ఉపాధి కింద పొందిన రుణాలు రూ.236 కోట్లు ఉన్నాయి. నెల్లూరు నగరంలోనే 4120 గ్రూపులకు రూ.40కోట్లు రుణాలు అందాయి.

ప్రభుత్వం మాఫీ చెల్లిం పులు ప్రారంభిస్తే అప్పుడు చూద్దాం.. ముందు బకాయిలు కట్టాల్సిందే అని బ్యాం కర్లు హుకుం జారీ చేస్తున్నారు. మాఫీతో రుణభారం తగ్గిపోతుందని ఆశించిన మహిళలు ఇప్పుడు మెదటికే మోసం వస్తుందేమోనని భయపడుతున్నారు. తమను డిఫాల్టర్లుగా చిత్రీకరించి రుణమాఫీకి అనర్హులుగా ప్రకటిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు.

కొత్తగా డ్వాక్రా సంఘాలకు మూలధన సహాయంగా ఒక్కో సంఘానికి రూ.లక్ష ఇస్తామని కొత్త హామీ పుట్టుకొచ్చింది. ఒక్కో గ్రూపు 2 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు తీసుకుని ఉండగా, రుణం మొత్తం రద్దవుతుందని ఆశించిన మహిళలకు నిరాశే మిగిలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement