చికిత్స కావాలి! | Want to be treated! | Sakshi
Sakshi News home page

చికిత్స కావాలి!

Published Tue, Nov 18 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

చికిత్స కావాలి!

చికిత్స కావాలి!

సాక్షి, కర్నూలు :  పర్ల గ్రామానికి చెందిన వెంకటస్వామికి పక్షవాతం రావడంతో చికిత్స కోసం కర్నూలు జనరల్ ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. మూడు రోజుల క్రితం ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచే అతనికి కష్టాలు మొదలయ్యాయి. తలపై కుట్ల నుంచి రక్తం కారుతున్న్నా డాక్టర్లు పట్టించుకోవడం లేదు. ఆపరేషన్ చేసిన వ్యక్తికి ఒక్క సెలైన్ బాటిల్ కూడా ఇప్పటి వరకు ఎక్కించలేదు.

ఏదైనా జరగరానిది జరిగితే.. పరిస్థితి ఏంటి?.. మనకు తెలిసిన సంఘటన ఇది. తెలియని ఉదంతాలు ఎన్నో.. మరెంతో మందికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యసేవలు అందక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇదీ మన ఆస్పత్రుల దీనస్థితి.     

 జిల్లా కేంద్రంలో జనరల్ ఆస్పత్రితోపాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, బనగానపల్లె ప్రాంతీయ ఆస్పత్రుల్లో సరైన సదుపాయలు లేక, డాక్టర్ల కొరత, నిర్లక్ష్యం వెరసి పేదలకు ప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. రూ. వేలల్లో చేతి చమురు వదిలించుకొని ఆర్థికంగా చితికి పోవాల్సి వస్తోంది. ఈ విషయంపై ‘సాక్షి నెట్‌వర్క్’ ప్రభుత్వ ఆస్పత్రుల్లో విజిట్ నిర్వహించగా పలు ఆసక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు సరైన వైద్యం అందడం లేదు. పాము కాటేస్తే ప్రాణాలు కాపాడలేని దయనీయ స్థితిలో మన ఆస్పత్రులు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో జనరల్ ఆస్పత్రితోపాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, బనగానపల్లెలో ప్రాంతీయ ఆస్పత్రులు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మినహా మిగిలిన అన్ని చోట్లా మౌలిక వసతుల లేమి రాజ్యమేలుతోంది.

ఏటా రూ. కోట్లు వైద్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్నా.. ఆ స్థాయిలో వైద్య సేవలు మాత్రం అందడం లేదు. డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. కనీసం ప్రసవాలైనా ప్రభుత్వాస్పత్రుల్లో జరగడం లేదు. ఏదైనా వైద్యం కోసం రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే రూ. వేలకు వేలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.

 కర్నూలు ఆస్పత్రిలో సిబ్బంది కొరత..
 రోగుల సహాయకులుగా ఉండాల్సిన వార్డుబాయ్‌ల కొరత బాగా ఉంది. పారా మెడికల్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. 1950 నాటి పోస్టులే కొనసాగుతున్నాయి తప్ప కొత్తగా వాటి సంఖ్యను పెంచడం లేదు. రోగుల అవసరాలకు అనుగుణంగా పారామెడికల్ విభాగంలో 48 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. సిబ్బంది కొరత వల్ల రోగులకు త్వరతగతిన వైద్యసేవలు అందడం లేదు.

 ఫోన్‌లోనే వైద్య సలహాలు..
 నిబంధనల ప్రకారం వైద్యులు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఓపీ గదుల్లో కూర్చొని రోగులను పరీక్షించాలి. తర్వాత 2 గంటల వరకు క్యాజువాల్టీ, వార్డుల్లో ఉన్న రోగులను పరీక్షించి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకోవాలి. అయితే ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన ఓపీకి సరైన సమయానికి ఏ ఒక్క డాక్టరు రాలేదు. క్యాజువాల్టీ అనేది అత్యవసర విభాగం. అక్కడ డ్యూటీ డాక్టర్లు కచ్చితంగా ఉండాలి. వారికి ప్రభుత్వం ప్రత్యేక గదులు, భోజన సదుపాయం కల్పించింది.

అయితే వారు అందుబాటులో ఉండడం లేదు. కాల్‌డ్యూటీ పేరుతో ఫోన్‌లోనే వైద్య సలహాలు అందిస్తున్నారు. కాల్ డ్యూటీ డాక్టర్లయినా అస్పత్రిలోనే ఉండాలి. కానీ, జిల్లా ఆస్పత్రుల్లో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. డ్యూటీకి డుమ్మా కొట్టి.. ఫోన్లలో వైద్యం అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సైతం ఈ విషయంలో చాలా సార్లు సీరియస్ అయినప్పటికీ డాక్టర్ల పనితీరులో మార్పు రాలేదు.
 
 రోగుల ఎదురుచూపులు..
      ఎమ్మిగనూరులో ఇటీవల టుబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న కొద్ది మంది బాలింతలు స్త్రీ వ్యాధి నిపుణురాలు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి కోసం 7 గంటల నుంచి క్యూలో కూర్చొన్నారు. కానీ వైద్యురాలు తీరిగ్గా 9.53 గంటలకు విధులకు హాజరై ఓపీని ప్రారంభించడంతో మధ్యాహ్నం వరకు బాలింతలు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది.

     నంద్యాలలో 9.20 గంటలకు ఓపీ వైద్యులు ఒక్కొక్కరుగా రావడం ఆరంభించి 9.40 గంటలకు ఆసుపత్రికి వచ్చారు. అయితే ఓపీ నెంబర్ 1లో పురుషులు, స్త్రీలకు ఒకే గదిలో ఉంచడంతో పరీక్షలు చేయించుకునేందుకు రోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

     ఆదోని ఆస్పత్రి చీఫ్ డాక్టర్ లింగన్నతో సహా మిగలిన వైద్యులు 20 నుంచి 30 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. ఆర్‌ఎంఓ డాక్టర్ విజయలక్ష్మి మాత్రం సమయపాలన పాటించారు. కొంత ఆలస్యంగా విధులకు హాజరైనా వైద్యులు ఓపీలో తమకు కేటాయించిన గదులకు పది గంటలపైనే చేరుకున్నారు. దీంతో అప్పటికే ఆసుపత్రికి వచ్చిన రోగులు దాదాపు గంట సేపు నిరీక్షించాల్సి వచ్చింది. కూర్చోడానికి బెంచీలు లేక పోవడంతో చాలా మంది నేలపైనే కూర్చున్నారు.

 సౌకర్యలేమి..
     కర్నూలు జనరల్ ఆస్పత్రిలో న్యూరోసర్జరీ, కార్డియాలజీ, కార్డియోథోరాసిక్, గైనిక్, జనరల్ మెడిసిన్ ఈ విభాగాలకు నిత్యం విపరీతమైన రోగుల తాకిడి ఉంటుంది. ఈ రోజు వరకు ఇక్కడ రోగులకు నేల మీదే వైద్యం అందుతున్న పరిస్థితి ఉంది.

     నంద్యాల ప్రాంతీయ ఆస్పత్రిలో ప్రసవాలకు వచ్చే గర్భిణీలకు సరిపడా మంచాలు లేవు. ఒకే సెలైన్ స్టాండుకు రెండేసీ సెలైన్లను ఉపయోగిస్తున్నారు. రోగుల కోసం వార్డుల్లో ఉంచిన మంచాలు, వీల్ చైర్స్ విరిగిపోయాయి.  

     బనగానపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక వసతుల కొరత ఉంది. డ్రైనేజీ సమస్యతో పాటు పైప్‌లైన్ సమస్య ఉంది. అంబులెన్స్ సౌకర్యం లేదు. జనరేటర్ సైతం అందుబాటులో లేదు. ఎన్నో సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మంచినీటి సిస్టమ్ పనిచేయడంలేదు. బ్లడ్‌బ్యాంకు కూడా ఏర్పాటు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement