శేషాచలంలో ప్రమాద ఘంటికలు | Warning of fire risks In Seshachalam Forest | Sakshi
Sakshi News home page

శేషాచలంలో ప్రమాద ఘంటికలు

Published Fri, Mar 9 2018 9:33 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

Warning of fire risks In Seshachalam Forest - Sakshi

అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు (ఫైల్‌)

వేసవి ప్రారంభం కాకముందే పగలు ఎండలు దంచేస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అప్పుడే 40 డిగ్రీలు తాకుతున్నాయి. ఈ క్రమంలో శేషాచలంలో అగ్నిప్రమాద ఘంటికలు హెచ్చరిస్తున్నాయి. గతంలో జరిగిన ఘటనల నుంచి పాఠాలు నేర్వని టీటీడీ అటవీ శాఖ నిద్రమత్తు వీడడం లేదు. ముందస్తుగా అటవీ మార్గాల్లో ముళ్లపొదలు తొలగించలేదు. ఈ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సాక్షి, తిరుమల: తిరుమల శేషాచల అడవుల్లో అగ్నిప్రమాద ఘంటికలు మోగాయి. ఈనెల 2వ తేదీ తిరుమల బాలాజీనగర్‌కు సమీప పాచికాల్వ గంగమ్మ ఆలయ  అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. 4వ తేదీ బాలాజీనగర్‌ సమీపంలోనే మరో ప్రమాదం జరిగింది. సమీపంలో నివాసమున్న వారు తక్షణం స్పందించి, మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక యంత్రాల సాయంతో ఘటన స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.

పాఠాలు నేర్వరా?
తిరుమల శ్రీవారి ఆలయానికి చుట్టూ 28 కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ భూమి టీటీడీ పరిధిలో ఉంది. ఇందులోని అ టవీ ప్రాంతాన్ని దేవస్థానం అటవీ శాఖ సంరక్షిస్తోంది. 2014లో కాకులకొండ ప్రాంతంలో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటన టీటీడీని కలవరపెట్టింది. ఎక్కడో జరిగిన ప్రమాదం తిరుమల కాకులకొండ వరకు పాకింది. దట్టమైన అడవి కాలి బూడిదైంది. పరిస్థితి చేయి దాటిపోవడంతో వాయుసేన హెలికాఫ్టర్ల ద్వారా మంటలు ఆర్పే పరిస్థితి ఏర్పడింది.

ముందస్తు చర్యలేవి?
కాకులకొండ ఘటన తర్వాత కొంతకాలం టీటీడీ అటవీ శాఖ అగ్నిప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉంటోం ది. ముందుస్తుగా అటవీ మార్గాల్లో ఫైర్‌లైన్స్‌ నిర్మించేవారు. తిరుమల, తిరుపతిలోని అటవీ శాఖలో పనిచేసే శాశ్వత ఉద్యోగులు 100 మంది, వేసవి పనులు కోసం మరో వందమంది కార్మికులను సిద్ధంగా ఉంచుతున్నారు. మంటలను ఆర్పేందుకు వెళ్లే సిబ్బందికి అవసరమైన అధునాతన షూ(బూట్లు), హెల్మెట్లు, ఫైర్‌సూట్లు ఏర్పాటు చేశారు. 2016లో కొత్తగా వాటర్‌ స్ప్రింక్లర్స్‌ కూడా కొనుగోలు చేశారు. అయితే ఈ వేసవిలో అలాంటి పరిస్థితి కనిపించటం లేదనే విమర్శలున్నాయి. శేషాచలం పరిధిలో సుమారు 70 కిలోమీటర్ల మేర ఫైర్‌లైన్స్‌ నిర్మించాల్సి ఉంది. అలాంటి చర్యలు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమాచారం తెలిసినా తక్షణమే స్పందించే పరిస్థితి కనిపించటం లేదు. అగ్నిప్రమాదం చిన్నదేనని వది లేస్తే ఫలితం ఎలా ఉంటుందో కాకులకొండ ఘటనే నిదర్శనం. దానికి తగ్గట్టు టీటీడీ అటవీ శాఖ అప్రమత్తం కావాలని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

స్థానికులు, భక్తులు సహకరించాలంటున్నటీటీడీ అటవీ శాఖ
శేషాచలం అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా ఉండేందుకు స్థానికులు, భక్తులు టీటీడీకి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. భక్తులు నడిపే వాహనాల వల్ల రెండు ఘాట్‌రోడ్లు, నారాయణగిరి పర్వత శ్రేణులు, పాపవినాశనంలో మార్గంలో నిప్పు రాచుకునే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిరుమలలో నివాసించే బాలాజీ నగర్‌వాసులు, అటవీ సరిహద్దు నివాసాల వల్ల కూడా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశముందని గుర్తు చేశారు. అనుకోని ప్రమాదాలు జరిగితే అగ్నిమాపక, అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని టీటీడీ అటవీ శాఖ విజ్ఞప్తి చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement