తిరుమల శేషాచలం అడవిలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
⇒ తిరుమలకు 10 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం
⇒వంద హెక్టార్ల అడవి దగ్ధం
⇒టీటీడీ, అటవీశాఖ ముందస్తు ఏర్పాట్లు
తిరుమల: తిరుమల శేషాచలం అడవిలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తిరుమలకు 10కిలోమీటర్ల దూరంలో శేషతీర్థం సమీపంలోని పుల్లుట్లలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతమంతా రిజర్వు ఫారెస్ట్ పరిధిలోకి వస్తుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా అడవి ఎండిపోతోంది. దీంతో కార్చిచ్చు రేగి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఫలితంగా సుమారు 100 హెక్టార్లకుపైగా అడవి కాలిపోయిందని అటవీశాఖాధికారులు భావిస్తున్నారు. తిరుపతి రేంజర్ బాలాజీ సిబ్బందితో కలసి మంటలు ఆర్పేపనిలో నిమగ్నమయ్యారు.
గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని.. ఆ మంటలు సమీప తిరుమల కొండలకు విస్తరించే అవకాశం ఉందని టీటీడీ డీఎఫ్‌వో శివరామ్‌ప్రసాద్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అదనపు సిబ్బందితో కలసి కాకులకొండ వద్దకు వెళ్లి పరిశీలించారు. మంటల తీవ్రత తగ్గి, కేవలం పొగ మాత్రమే రావటాన్ని గుర్తించారు. అయినప్పటికీ , మంటలు విస్తరిస్తే వాటిని అదుపు చేసేందుకు సిబ్బందితోపాటు నీటి ట్యాంకర్లు కూడా సిద్ధం చేశారు. ఇదే ప్రాంతంలో 2014 మార్చిలో జరిగిన ప్రమాదాన్ని అరికట్టేందుకు నేవీ హెలికాఫ్టర్లు వినియోగించిన విషయం తెలిసిందే.