తిరుమల/కోవూరు: తిరుమల కొండపై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అలిపిరి నడకదారిలో శుక్రవారం రాత్రి ఆరేళ్ల చిన్నారి నడుస్తుండగా అకస్మాత్తుగా ఓ వన్యమృగం చేసిన దాడిలో మృత్యువాత పడింది. నరసింహస్వామి ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం, పోతిరెడ్డిపాళేనికి చెందిన దినేష్ కుమార్, తన భార్య శశికళ, కుమార్తె లక్షిత (6), కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తిరుపతికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు వారంతా అలిపిరి నడకమార్గం ద్వారా తిరుమలకు బయల్దేరారు.
రాత్రి 7.30 గంటల సమయంలో నరసింహస్వామి ఆలయం సమీపంలో బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రుల కంటే ముందుగానే ఆ చిన్నారి నడుస్తుండడంతో వేరే భక్తుల గుంపులో కలిసి వెళ్లి ఉంటుందని తల్లిదండ్రులు తొలుత భావించి వెతకడం ప్రారంభించారు. ఎంతకూ కనపడకపోవడంతో చివరికి భద్రతా సిబ్బందికి తెలిపారు. రాత్రి 10.30కు తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుమల వన్‌టౌన్ సీఐ జగన్మోహన్‌రెడ్డి, టూటౌన్ సీఐ చంద్రశేఖర్ అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. రాత్రి నుంచి 70 మంది టీటీడీ, అటవీశాఖ సిబ్బంది, పోలీసులు గాలింపు చేపట్టారు.
శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో నరసింహస్వామి ఆలయం సమీపంలోని నడకదారి నుంచి 150 మీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పూర్తిగా ముఖాన్ని జంతువు తినడంతోపాటు కాలిని తీవ్రంగా గాయపర్చింది. దీంతో బాలిక అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. చిరుత లేదా ఎలుగుబంటి దాడిచేసి ఉండవచ్చని భావిస్తున్నారు. తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య, వీజీఓ బాలిరెడ్డి, టూ టౌన్ ఎస్‌ఐ సాయినాథ్ చౌదరి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రుయా ఆస్పత్రికి తరలించారు.
తీవ్రంగా కలిచివేసింది: ఈఓ ధర్మారెడ్డి
చిన్నారి మృతి తమను తీవ్రంగా కలిచివేసిందని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. ఘటనాస్థలాన్ని ఆయన పరిశీలించారు. మృతురాలి కుటుంబానికి టీటీడీ నుంచి రూ.5 లక్షలు, అటవీశాఖ నుంచి రూ.5 లక్షలు అందిస్తామని చెప్పారు. బాలిక ఒంటరిగా వెళ్లడాన్ని సీసీ కెమెరాల్లో గుర్తించామన్నారు. బాలిక నరసింహస్వామి ఆలయానికి సమీపంలో నడకదారి నుంచి పక్కకు అటవీ ప్రాంతంలోకి ఆడుకుంటూ వెళ్లినట్లు అనుమానిస్తున్నామన్నారు. ఎందుకంటే.. బాలిక ఆటవస్తువులు అటవీ ప్రాంతంలోనే దొరికాయని తెలిపారు. ఈ సమయంలో వన్యమృగం దాడిచేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోందన్నారు.
భద్రత విషయంలో రాజీలేదు: భూమన
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పష్టంచేశారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆయన అధికారులతో ఆయన మాట్లాడారు. అనంతరం బాలిక లక్షిత మృతదేహం లభించిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ ఘటనలో ఎవరి నిర్లక్ష్యంలేదని చెప్పారు.
పోతిరెడ్డిపాళెంలో విషాదఛాయలు
ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి వన్యమృగం దాడిలో మృతిచెందిందన్న విషయం తెలుసుకున్న పోతిరెడ్డిపాళెం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బాలిక మృతి వార్త కుటుంబ సభ్యులకు తెలియడంతో గ్రామంలో రోదనలు మిన్నంటాయి. దినేష్ ఇంటి వద్దకు గ్రామస్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వెంటనే టీటీడీ బోర్డు చైర్మన్ భూమన, ఈఓ ధర్మారెడ్డికి ఫోన్‌చేసి బాధిత కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
అధికారులతో అత్యవసర సమావేశం
అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో మరింత భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ, అటవీ పోలీస్ అధికారులతో జరిపిన అత్యవసర సమావేశంలో ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నడకమార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. నడక మార్గానికి ఇరువైపులా కంచె ఏర్పాటుకు సమగ్ర నివేదిక అందించాలని డీఎఫ్‌ఓను ఆదేశించామన్నారు.
వన్యమృగాన్ని బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతీ 100 మంది భక్తుల గుంపునకు సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటుకు అనుమతిస్తామని చెప్పారు. నడకదారుల్లో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. చిన్నపిల్లలతో నడకమార్గాల్లో వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఈఓ విజ్ఞప్తి చేశారు. సీసీఎఫ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ బోన్ల ద్వారా నడక మార్గాల్లో సంచరించే వన్యమృగాలను బంధిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment