సాక్షి, అమరావతి: తిరుమల నడక మార్గంలో వన్యప్రాణుల నుంచి భక్తులను రక్షించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ఏపీ హైకోర్టు అటవీ శాఖ, టీటీడీ అధికారులను బుధవారం ఆదేశించింది. అలిపిరి నుంచి తిరుమల వరకు నడక మార్గం వెంట ఇనుప కంచె ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాలను కూడా తెలియజేయాలని కోరింది. వన్యప్రాణులు తిరిగే చోట మనమంతా తిరుగుతున్నామని, అందువల్ల వన్యప్రాణుల జీవనం, భక్తుల భద్రత మధ్య సమతుల్యత ఉండేలా చూడాలని హైకోర్టు స్పష్టం చేసింది.
అలాగే వన్యప్రాణుల రాకపోకలకు వీలుగా తగిన రక్షిత మార్గాలను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలంది. ఇటీవల చిరుత పులి దాడిలో మరణించిన చిన్నారి కుటుంబానికి చెల్లించిన రూ.15 లక్షల పరిహారాన్ని రూ.30 లక్షలకు పెంచాలని టీటీడీకి స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్, చిత్తూరు జిల్లా అటవీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వన్యప్రాణుల సంచారం భక్తులకు ప్రమాదంగా మారుతున్న నేపథ్యంలో అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారి వెంట ఇనుప కంచె ఏర్పాటు చేసేలా టీటీడీ అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ తిరుపతికి చెందిన బీజేపీ నేత గుడిపల్లి భానుప్రకాశ్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున యలమంజుల బాలాజీ, అటవీ శాఖ తరఫున ఖాసిం సాహెబ్, టీటీడీ తరఫున అనూప్ వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment