walk way devotees
-
తిరుమల: మరోసారి భయపెట్టిన చిరుత
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల్ని మరోసారి చిరుత భయపెట్టింది. అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం సమీపంలో ఓ చిరుత పులి కనిపించింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నడకదారిలో గుంపులుగా భక్తులను పంపుతున్నారు. మరోవైపు చిరుతను ట్రేస్ చేసి పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత..
సాక్షి, తిరుమల: తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. శ్రీవారి ఆలయానికి వెళ్లే నడకదారిలో బుధవారం తెల్లవారుజామున మరో చిరుత బోనులో పట్టుబడింది. కాగా, నడకదారిలో వారం రోజులుగా అటవీశాఖ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారు. వివరాల ప్రకారం.. తిరుమల నడకదారిలో మరో చిరుత బోనులో చిక్కింది. చిరుత సంచారాన్ని గుర్తించిన అధికారులు బోనులు ఏర్పాటు చేయడంతో తాజాగా చిరుత బోనులో చిక్కింది. అయితే, చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే తాజాగా చిరుత చిక్కడం విశేషం. ఇక, చిరుతను జూపార్క్‌కు తరలించడానికి అటవీశాక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో ఇప్పటి వరకు ఆరు చిరుతలను అటవీశాఖ అధికారులు బంధించారు. ఇది కూడా చదవండి: బంగాళాఖాతంలో అల్పపీడనం! -
Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత
సాక్షి, తిరుపతి: తిరుమలలో కాలి బాటలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం TTD, అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత సతల్ఫితాన్ని ఇస్తోంది. తాజాగా మరో చిరుత పులిని బంధించారు అధికారులు. మూడు నెలల వ్యవధిలో బోనులో చిక్కిన ఐదవ చిరుత ఇది. నరసింహ ఆలయం- ఏడవ మైలు రాయి మధ్య ఏర్పాటు చేసిన ట్రాప్‌లో ఈ చిరుత చిక్కినట్లు అటవీ శాఖఅధికారులు తెలిపారు. నాలుగు రోజుల కిందట ట్రాప్ కెమెరాల్లో దీని సంచారాన్ని అధికారులు గుర్తించి.. బోను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు నిన్న రాత్రి అది ట్రాప్‌లో చిక్కింది. ఇక కాసేపట్లో అటవీ శాఖ అధికారులతో పాటు టీటీడీ చైర్మన్ భూమన చిరుతను బంధించిన ప్రాంతానికి వెళ్తున్నట్లు సమాచారం. ఇక.. తిరుపతిలో 'ఆపరేషన్ చిరుత’ కొనసాగుతోంది. తాజాగా చిక్కిన చిరుతతో కలిపి ఐదింటిని అధికారులు బంధించినట్లయ్యింది. మిగిలిన వాటి కోసం అన్వేషణ కొనసాగుతుందని అధికారులు అంటున్నారు. భద్రతే ప్రధాన ప్రాముఖ్యత.. నడక మార్గంలో గత కొన్నిరోజులుగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. వాటిని ట్రాప్ చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. చిన్నారి కౌశిక్‌పై దాడి.. అలాగే చిన్నారి లక్షిత మృతి ఘటనలతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. భక్తుల భద్రతే తమ ప్రధాన ప్రాముఖ్యతగా పేర్కొంటూ.. రక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేక సమావేశాల ద్వారా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కూడా. మరోవైపు టీటీడీ సమన్వయంతో అటవీ శాఖ అధికారులు చిరుతలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించి.. సక్సెస్ అవుతున్నారు. జూన్ 24, ఆగష్టు 14, ఆగష్టు 17, ఆగష్టు 28వ తేదీల్లో, తాజాగా.. సెప్టెంబర్ 6వ తేదీన చిరుతలు బోనులో పడ్డాయి. ఇదీ చదవండి: కర్ర పంపిణీపై విమర్శలు.. స్పందించిన టీటీడీ -
నడక మార్గంలో ఏం చర్యలు తీసుకుంటున్నారు?
సాక్షి, అమరావతి: తిరుమల నడక మార్గంలో వన్యప్రాణుల నుంచి భక్తులను రక్షించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ఏపీ హైకోర్టు అటవీ శాఖ, టీటీడీ అధికారులను బుధవారం ఆదేశించింది. అలిపిరి నుంచి తిరుమల వరకు నడక మార్గం వెంట ఇనుప కంచె ఏర్పాటు విషయంలో సాధ్యాసాధ్యాలను కూడా తెలియజేయాలని కోరింది. వన్యప్రాణులు తిరిగే చోట మనమంతా తిరుగుతున్నామని, అందువల్ల వన్యప్రాణుల జీవనం, భక్తుల భద్రత మధ్య సమతుల్యత ఉండేలా చూడాలని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే వన్యప్రాణుల రాకపోకలకు వీలుగా తగిన రక్షిత మార్గాలను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలంది. ఇటీవల చిరుత పులి దాడిలో మరణించిన చిన్నారి కుటుంబానికి చెల్లించిన రూ.15 లక్షల పరిహారాన్ని రూ.30 లక్షలకు పెంచాలని టీటీడీకి స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్, చిత్తూరు జిల్లా అటవీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వన్యప్రాణుల సంచారం భక్తులకు ప్రమాదంగా మారుతున్న నేపథ్యంలో అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారి వెంట ఇనుప కంచె ఏర్పాటు చేసేలా టీటీడీ అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ తిరుపతికి చెందిన బీజేపీ నేత గుడిపల్లి భానుప్రకాశ్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున యలమంజుల బాలాజీ, అటవీ శాఖ తరఫున ఖాసిం సాహెబ్, టీటీడీ తరఫున అనూప్ వాదనలు వినిపించారు. -
తిరుమల: ‘చిన్నారిపై దాడి చేసిన చిరుతను జూపార్క్‌లోనే ఉంచుతాం’
సాక్షి, తిరుమల: తిరుమల నడకదారిలో గురువారం తెల్లవారుజామున మరో చిరుత బోనులో చిక్కింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దే చిరుత బోనులో చిక్కింది. ఇక, మూడు రోజుల క్రితమే ఇక్కడ మరో చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే. కాగా, 50 రోజులు వ్యవధిలో మూడు చిరుతలను అధికారులు బంధించారు. పట్టుబడిన చిరుతను తిరుపతి జూపార్క్‌కు తరలించారు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తాం: భూమన ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘అర్ధరాత్రి 1.30 గంటలకు చిరుత బోనులో చిక్కింది. బోనులో చిక్కిన చిరుతను మగ చిరుతగా అధికారులు నిర్ధారించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకు నడకదారిలో భద్రతను కల్పిస్తూనే చిరుతలను బంధించే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అటవీశాఖ అధికారుల సూచనలతోనే భక్తులకు కర్రలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. కర్రలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సమంజసం కాదు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తాం. మరిన్ని చిరుతలను బంధించేలా కార్యాచరణ రూపొందిస్తాం’ అని స్పష్టం చేశారు. టీటీడీపై ట్రోల్ చేయడం సరికాదు: ధర్మారెడ్డి టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ‘చిరుతలకు సంబంధించి సమాచారం సేకరిస్తున్నాం. శ్రీశైలం నుంచి నిపుణుల బృందాన్ని తిరుమలకు పిలిపించాం. భక్తులకు కర్రలు ఇవ్వడంతో వారికి సహాయంగా ఉంటుంది. వందలాది మంది భక్తులు కర్రలతో పాదయాత్ర చేయడంతో జంతువులు దరిచేరవు. సోషల్ మీడియాలో టీటీడీపై ట్రోల్ చేయడం సరికాదు’ అని అన్నారు. చిరుతల కోసం మరో ఆరు బోన్లు.. ఈ సందర్బంగా సీసీఎఫ్ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘పట్టుబడ్డ చిరుతకు ఐదేళ్ల వయసు ఉంటుంది. చిరుతకు జూపార్క్‌లో ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తాం. చిక్కిన చిరుతల్లో చిన్నారిపై దాడి చేసిన చిరుతను గుర్తించాలి. చిన్నారిపై దాడి చేసిన చిరుతను జూపార్క్‌లో ఉంచుతాం. మరో చిరుతను ఎక్కడ ఉంచాలో అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. చిరుతలను ట్రాప్ చేయడానికి మరో ఆరు నూతన బోన్లు కొనుగోలు చేస్తున్నాం. నడక దారిలో ఏర్పాటు చేసిన కెమెరాలను ప్రతీరోజు పరిశీలిస్తున్నాం. క్రూర మృగాలు సంచారం ఉన్న ప్రదేశాల్లో ట్రాప్ కేజ్ ఏర్పాటు చేస్తాం. ఎలుగుబంటి కదలికలు కూడా గుర్తించాం. ఎలుగుబంటిని పట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం’ అని వెల్లడించారు. ఇది కూడా చదవండి: భక్తులకు కర్రలు కాకుండా.. తుపాకులివ్వాలా!.. తప్పుడు ప్రచారంపై చర్యలు తప్పవు! -
భక్తులకు కర్రలు కాకుండా.. తుపాకులివ్వాలా!.. తప్పుడు ప్రచారంపై చర్యలు తప్పవు!
"టీటీడీపై హద్దు పద్దు లేని దుష్ప్రచారం".."ఎవరైతే దుష్ప్రచారంలో భాగంగా సోషల్ మీడియాలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వీడియోలను కట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారో వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతున్న టీటీడీ సైబర్ సెక్యూరిటీ విభాగం." సాక్షి, తిరుమల: తిరుమలకు నడిచి వెళ్లే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని భక్తులకు చేతికర్ర ఇవ్వాలని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై సామాజిక మాధ్యమాల్లో చాలామంది వెకిలిగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దుడ్డుకర్ర భక్తుల ప్రాణాలు కాపాడుతుందా అని హేళన చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నవారికి ఏమాత్రం బాధ్యత లేదనిపిస్తుంది. లేదా ప్రభుత్వం మీద ఉద్దేశపూర్వకంగానే ఇలా మాట్లాడుతున్నారని అనిపిస్తుంది. అంతా అడవి మార్గమే.. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లాలంటే.. మొత్తం అటవి మార్గమే. అది అలిపిరి మెట్ల మార్గమైనా, శ్రీవారిమెట్టు మార్గమైనా తొలిమొట్టు మొదలు చివరి సోపానం దాకా అడవే. అందులోనూ రిజర్వు ఫారెస్టు. అందుకే శేషాచల అడవుల్లో వన్యప్రాణులు ఎక్కువగానే వుంటాయి. కరోనా లాక్ డౌన్ వల్ల నెలల తరబడి చడీచప్పుడు లేకపోవడంతో అడవి జంతువులు.. మెట్లమార్గంలోనూ, ఘాట్ రోడ్లలోనూ స్వేచ్ఛగా తిరుగాడటం మొదలుపెట్టాయి. అందుకే కరోనా తరువాత.. చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్ల సంచారంపై తరచూ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భక్తులపై అడవి జంతువుల దాడులు పెరిగాయి. భక్తుల రక్షణ కోసం టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటున్నా అప్పుడప్పుడు అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు సమస్య మరింత తీవ్రమైంది. అద్భుతమైన ఏర్పాటు.. నడక దారి భక్తుల రక్షణ కోసం, సౌకర్యం కోసం.. వందల కోట్లు ఖర్చుచేసి నడక దారులను అద్భుతంగా నిర్మించారు. నడవడానికి సౌకర్యవంతంగా మెట్లు, వాతావరణ ఇబ్బందులను తట్టుకునేలా పైకప్పు నిర్మించారు. రాత్రిపూట కూడా నడవడానికి ఇబ్బందిలేకుండా కాంతివంతమైన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. అలాగే.. చిరుతల జాడ కనిపించినపుడు వాటిని బంధించి దూరంగా విడిచిపెడుతున్నారు. దేశంలోని ఏ దేవాలయమూ కల్పించని ఏర్పాట్లను టీటీడీ చేస్తున్నది. ఇన్ని చేస్తున్నా ఏదో ఒక కారణంతో టీటీడీని విమర్శిస్తున్న వారు ఉన్నారు. తిరుమలకు సంబంధించిన ప్రతీ అంశాన్ని సున్నితంగా మార్చేయడం, సంచలనం చేయడమే ఇందుకు కారణం. అది వేరే అంశం. చేతికర్రతో ఎంతో ధైర్యం.. ఇక ప్రస్తుత విషయానికొస్తే.. భక్తల రక్షణ కోసం చేతికి కర్రలు ఇవ్వాలని నిర్ణయించడం తప్పవుతుందా..! భక్తులకు కర్రలు కాకుండా తుపాకులివ్వాలా..! అయినా కర్రని తేలిగ్గా తీసేయాల్సిన పనిలేదు. గ్రామాల్లో ఒంటరిగా పొలానికెళ్లే రైతు చేతిలో కర్ర ఉంటుంది. ఆ సమయానికి ఆ చేతికర్రే రైతుకు తోడు, రక్షణ. అటవీ ప్రాంతాల్లో సంచరించే గిరివాసులకు కర్రే బలమైన ఆయుధం. ఏనుగును మావటి నియంత్రించేది కర్రతోనే. మనిషి చేతిలో కర్రను చూస్తే ఏ జంతువైనా భయపడుతుంది. తిరుమల నడక దారిలో చిరుతలతో పాటు ఎలుగుబంట్ల బెడదా కూడా ఉంది. అలాంటప్పుడు భక్తుల చేతిలోని కర్ర కచ్చితంగా రక్షణగా నిలుస్తుంది. వందలాది భక్తుల చేతుల్లో కర్రలుంటే చిరుతైనా తోకముడుస్తుంది. ఉత్తి చేత్తో నడవడం కంటే.. చేతిలో కర్ర ఉండటం ఎన్నో రెట్లు ధైర్యాన్నిస్తుంది. చేతికర్ర ఊతంతో మెట్లు ఎక్కడమూ సులభమవుతుంది. భక్తులపై కూడా రాజకీయాలు.. ఇలాంటివేవీ పట్టించుకోకుండా, భక్తుల ప్రాణాలు సంకటంలో ఉన్న వేళలోనూ రాజకీయాల కోసం అవహేళన చేయడం, అసంబద్ధ విమర్శలు చేయడం సమర్ధనీయం కాదు. అయినా చేతికి కర్రలు ఇవ్వడంతోనే సరిపెట్టుకోలేదు. భక్తులను గుంపులుగా పంపడం, ప్రతీ పది మీటర్లకు ఇక సెక్యూరిటీ గార్డు ఏర్పాటు, అటవీ ప్రాంతం వైపు అధిక కాంతినిచ్చే విద్యుత్ దీపాలు, శబ్ధం చేస్తూ అడవి జంతువులను దూరంగా తరమటం, అడవి దారిలో చిన్నారుల నడక సమయంలో మార్పులు ఇలాంటి చర్యలూ టీటీడీ చేపట్టింది. భక్తుల రక్షణ కోసం ఏం చేయాలో అన్నీ టీటీడీ చేస్తున్నది. దీన్ని అభినందించాల్సింపోయి ఎగతాళి చేయడం సరికాదు. ఇది కూడా చదవంవడి: తిరుమల: బోనులో చిక్కిన మరో చిరుత.. -
తిరుమల: బోనులో చిక్కిన మరో చిరుత..
సాక్షి, తిరుమల: తిరుమల నడకదారిలో మరో చిరుత బోనులో చిక్కింది. గురువారం తెల్లవారుజామున చిరుత బోనులో చిక్కినట్టు తెలుస్తోంది. నడకదారిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద చిరుత బోనులో చిక్కింది. ఇక, 50 రోజుల వ్యవధిలో అధికారులు మూడు చిరుతలను బంధించడం విశేషం. వివరాల ప్రకారం.. ఇటీవల లక్షిత అనే చిన్నారిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాడి చేసిన ప్రాంతంలోనే అధికారులు బోన్లు పెట్టడంతో మూడు రోజుల క్రితమే ఓ చిరుత బోనులో చిక్కింది. ఇక, ఆ ప్రాంతానికి సమీపంలోనే అధికారులు చిరుతల కోసం మూడు చోట్ల బోన్ల ఏర్పాటు చేశారు. మోకాలిమెట్టు, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లను పెట్టారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున మరో చిరుత లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద బోనులో చిక్కింది. ఇదిలా ఉండగా.. 50 రోజుల వ్యవధిలో అధికారులు మూడు చిరుతలను బంధించారు. ఇది కూడా చదవండి: ఏపీలో పలు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ -
350 సార్లు తిరుమల మెట్లు ఎక్కిన శ్రీవారి భక్తుడు
శ్రీకాకుళం కల్చరల్: ఏడుకొండల వారిని ఒక్క క్షణం కళ్లారా చూడాలని కోట్లాది మంది మొక్కుతుంటారు. రెండు ఘడియల పాటు స్వామిని చూసే అవకాశం వస్తే జన్మ ధన్యమైనట్లు భావిస్తారు. అలాంటిది ఆయన 350 సార్లు తిరుమల మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. ప్రతి మెట్టు పరిచయమే అన్నట్లు ప్రతినెల కాలినడకన తిరుపతి కొండ ఎక్కడం అలవాటుగా మార్చుకున్నారు. తాను వెళ్లడమే కాదు 780 మందితో తిరుమలకు పాదయాత్ర కూడా చేసి గోవిందుడి ఆశీస్సులు పొందారు. పాదయాత్రలకు గాను ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చోటు సంపాదించుకున్నారు. ఆయన పేరు మహంతి శ్రీనివాస్. ఊరు శ్రీకాకుళం. గోవింద వరల్డ్‌వైడ్ వాట్సాప్ గ్రూపు.. శ్రీకాకుళానికి చెందిన మహంతి శ్రీనివాస్‌కు తిరుమలేశుడంటే ఎనలేని భక్తి. ఇప్పటివరకు 350 సార్లు తిరుపతి మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. సెప్టెంబరు 6వ తేదీ ఏకాదశి పర్వదినాన 780 మందితో గ్రూపుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఇందుకోసం ‘గోవింద వరల్డ్‌వైడ్’ వా ట్సాప్ గ్రూపును రూపొందించారు. అందులో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు సభ్యులుగా చేరారు. ఈ గ్రూపులో జూన్ 25లోగా సెప్టెంబరు 6న మెట్ల మార్గం ద్వారా పాదయాత్రకు ఆసక్తి ఉన్న వారు తమ సమ్మతిని తెలపాలని కోరారు. సమ్మతి తెలిపిన వారు తిరుమలకు 5వ తేదీ మధ్యాహ్నం 12గంటలకు హాజరు కావాలని సూచించారు. దీంతో కర్నాటక, ఆంధ్రా, తెలంగాణ, ఒడి శా రాష్ట్రాల నుంచి 780 మందితో పాదయాత్ర కన్నుల పండువగా సాగింది. ఆ రోజు సాయంత్రం గోవిందరాజస్వామి దర్శనాలు, శ్రీపద్మావతి అమ్మ వారి దర్శనాలు చేసుకున్నాక, రాత్రి తిరుపతిలో బస చేసి, 6వ తేదీ ఉదయం 6 గంటలకు మెట్ల మార్గం ద్వారా పాదయాత్ర ప్రారంభించారు. 2388 మెట్లను 150 నిమిషాలు నడచి తిరుమల చేరుకున్నారు. ఇది ఆయన 350వ పాదయాత్ర. ఆ దారిలోనే.. తిరుమల వెళ్లే భక్తులు సాధారణంగా ముందుగా తిరుమల వరకు నేరుగా వెళతారు. కానీ దానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయని శ్రీనివాస్ అంటారు. తిరుమల వెళ్లే భక్తులు ముందుగా పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాక.. కొండపైకి చేరుకొని తలనీలాలు సమర్పించి, పుష్కర స్నానం చేసి ఆ తర్వాత వరాహ నరసింహ స్వామి దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవాలి. అలాగే కొండపై ఉన్న 6 ముఖ్యమైన ప్రదేశాలను దర్శించుకున్న తర్వాత యాత్ర పూర్తి అవుతుందని ఆయన చెబుతుంటారు. 350 సార్లు ఇలా.. 1996లో మొదటిసారిగా పాదయాత్ర ప్రారంభించారు. 1996 నుంచి 2016 వరకు 85 సార్లు వెళ్లారు. 2017లో ఆయన వయసు 50 ఏళ్లు ఆ ఏడాదే 50 సార్లు పాదయాత్ర చేశారు. 2018లో 71 సార్లు, 2019లో 50 సార్లు, 2020లో రెండు సార్లు(ఆ సమయంలో కరోనాతో గుడి మూసివేశారు). 2021లో 52 సార్లు, 2022లో 8 సెప్టెంబరుæ వరకు 40 సార్లు పాదయాత్ర నిర్వహించారు. మొత్తంగా 350 దఫాలు మెట్ల మార్గం గుండా వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. ఇలా ఒకరోజులో ఒకసారిగా వెళ్లింది 193 సార్లు, ఒకరోజులో 2 సార్లు నడచింది 142సార్లు, ఒక రోజులో మూడుసార్లు నడిచింది 15 సార్లు కావడం విశేషం. ఆయనతో పాటు ఆయన భార్య కూడా 59 సార్లు, కుమారుడు కూడా 30 సార్లు పాదయాత్ర చేశారు. ఇప్పటికి 2వేల మంది భక్తులను తనతో పాటుగా తీసుకువెళ్లారు. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం తిరుమలలో పనిచేసిన జిల్లాకు చెందిన ఉన్నతాధికారి రుంకు అప్పారావు స్ఫూర్తితో శ్రీనివాస్ ఈ పాదయాత్రలు చేశారు. రుంకు అప్పారావు 108 సార్లు మెట్ల ద్వారా పాదయాత్ర చేసినందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డు పొందారు. అయితే శ్రీనివాస్ 2019 జనవరి 27 వరకు 205 పర్యాయాలు మెట్ల యాత్ర చేశాక ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించి యోగ్యతాపత్రాన్ని, గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ సర్టిఫికేటును అప్పటి ఈఓ అనిల్ సింఘాల్ చేతుల మీదుగా అందుకున్నారు. తిరిగి తన యాత్రను కొనసాగిస్తూ 258 పర్యాయాలు పూర్తి చేసినందుకు గాను 2020 మే8న ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు. అలాగే టీటీడీ నిర్వహిస్తున్న సప్తగిరి మాస పత్రికలో శ్రీనివాస్‌పై వ్యాసం కూడా ప్రచురించారు. ప్రతి నెలా వెళ్తా.. నేను ప్రతి నెల తిరుమల వెళ్లి మెట్ల దారి నుంచి స్వామి దర్శనం చేసుకుంటాను. ఇప్పటి వరకు 350సార్లు పాదయాత్ర చేశాను. తిరుమల అంటే సాక్షాత్తు వైకుంఠధామమే. తిరుమల యాత్ర ఏవిధంగా చేయాలో అందరికీ చెబుతాను. ఎప్పటికప్పుడు తిరుమలలో జరిగే తాజా మార్పులను వాట్సాప్ గ్రూపు ద్వారా అందరికీ చేరవేస్తుంటాను. స్వామిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. – మహంతి శ్రీనివాస్, శ్రీకాకుళం -
రెండు రోజులపాటు తిరుమల నడకదారులు బంద్: టీటీడీ
సాక్షి, తిరుమల: నవంబర్ 17, 18 తేదీల్లో రెండు నడక దారులు మూసి వేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. 'రెండు రోజులపాటు తిరుమలకు వెళ్లే రెండు నడకదారులు (అలిపిరి, శ్రీవారిమెట్టు) తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుంది. భక్తుల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలకు వెళ్లే భక్తులు ఈ విషయం గుర్తించి, ఘాట్ రోడ్ ప్రయాణమే సురక్షితమని' టీటీడీ అధికారులు సూచించారు. చదవండి: (ఇవి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగం: గౌతమ్‌రెడ్డి) -
శ్రీవారి మెట్టు మార్గంలో గాలివాన బీభత్సం
-
కాలిబాట భక్తులకు ఆధార్ తప్పనిసరి: టీటీడీ
సాక్షి, తిరుమల: టీటీడీ సేవల్లో పారదర్శకత పెంచేందుకు గదుల బుకింగ్, అంగప్రదక్షిణం టికెట్ల నమోదులో ఆధార్‌ను అధికారులు తప్పనిసరి చేశారు. అదే విధానాన్ని ఇకపై కాలిబాట భక్తులకు వర్తింపచేయాలని టీటీడీ నిర్ణయించింది. దీనిప్రకారం కాలిబాటల్లో వచ్చే భక్తులకు ప్రస్తుతం స్వీకరిస్తున్న ఫొటోమెట్రిక్ విధానాన్ని రద్దు చేశారు. దాని స్థానంలో ఆధార్ నంబరు నమోదు చేసుకుని దివ్యదర్శనం(కాలిబాట) టికెట్లు ఇవ్వనున్నారు. మరోవైపు శ్రీవారి దర్శనార్థం శ్రీలంక ప్రధాని రణీల్ విక్రమ సింగే, సతీమణి మైత్రి విక్రమ సింగేతో కలసి తిరుమలకు చేరుకున్నారు.