సాక్షి, తిరుమల: తిరుమల నడకదారిలో గురువారం తెల్లవారుజామున మరో చిరుత బోనులో చిక్కింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దే చిరుత బోనులో చిక్కింది. ఇక, మూడు రోజుల క్రితమే ఇక్కడ మరో చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే. కాగా, 50 రోజులు వ్యవధిలో మూడు చిరుతలను అధికారులు బంధించారు. పట్టుబడిన చిరుతను తిరుపతి జూపార్క్‌కు తరలించారు.
ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తాం: భూమన
ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘అర్ధరాత్రి 1.30 గంటలకు చిరుత బోనులో చిక్కింది. బోనులో చిక్కిన చిరుతను మగ చిరుతగా అధికారులు నిర్ధారించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకు నడకదారిలో భద్రతను కల్పిస్తూనే చిరుతలను బంధించే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అటవీశాఖ అధికారుల సూచనలతోనే భక్తులకు కర్రలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. కర్రలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సమంజసం కాదు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తాం. మరిన్ని చిరుతలను బంధించేలా కార్యాచరణ రూపొందిస్తాం’ అని స్పష్టం చేశారు.
టీటీడీపై ట్రోల్ చేయడం సరికాదు: ధర్మారెడ్డి
టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ‘చిరుతలకు సంబంధించి సమాచారం సేకరిస్తున్నాం. శ్రీశైలం నుంచి నిపుణుల బృందాన్ని తిరుమలకు పిలిపించాం. భక్తులకు కర్రలు ఇవ్వడంతో వారికి సహాయంగా ఉంటుంది. వందలాది మంది భక్తులు కర్రలతో పాదయాత్ర చేయడంతో జంతువులు దరిచేరవు. సోషల్ మీడియాలో టీటీడీపై ట్రోల్ చేయడం సరికాదు’ అని అన్నారు.
చిరుతల కోసం మరో ఆరు బోన్లు..
ఈ సందర్బంగా సీసీఎఫ్ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘పట్టుబడ్డ చిరుతకు ఐదేళ్ల వయసు ఉంటుంది. చిరుతకు జూపార్క్‌లో ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తాం. చిక్కిన చిరుతల్లో చిన్నారిపై దాడి చేసిన చిరుతను గుర్తించాలి. చిన్నారిపై దాడి చేసిన చిరుతను జూపార్క్‌లో ఉంచుతాం. మరో చిరుతను ఎక్కడ ఉంచాలో అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. చిరుతలను ట్రాప్ చేయడానికి మరో ఆరు నూతన బోన్లు కొనుగోలు చేస్తున్నాం. నడక దారిలో ఏర్పాటు చేసిన కెమెరాలను ప్రతీరోజు పరిశీలిస్తున్నాం. క్రూర మృగాలు సంచారం ఉన్న ప్రదేశాల్లో ట్రాప్ కేజ్ ఏర్పాటు చేస్తాం. ఎలుగుబంటి కదలికలు కూడా గుర్తించాం. ఎలుగుబంటిని పట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం’ అని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: భక్తులకు కర్రలు కాకుండా.. తుపాకులివ్వాలా!.. తప్పుడు ప్రచారంపై చర్యలు తప్పవు!
Comments
Please login to add a commentAdd a comment