డబుల్ డెక్కర్ ట్రైన్ వచ్చేసింది..
- పంజాబ్ లోని కపుర్తా రైల్‌కోచ్ ఫ్యాక్టరీ నుంచి రాక
- అత్యాధునిక సౌకర్యాలతో రైలు రూపకల్పన
- ఒక బోగీలో 120 మంది కూర్చునే సౌకర్యం
- గంటకు 160కిలోమీటర్ల వేగం
- దక్షిణ మధ్య రైల్వేలోతొలి డబుల్ డెక్కర్
కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ : హైదరాబాద్ నగరంలో గతంలో నడిపిన డబుల్ డెక్కర్ బస్సుల తరహాలో పట్టాలపై డబుల్ డెక్కర్ రైళ్లు పరుగెత్తనున్నాయి. 2014-15 రైల్వేబడ్జెట్‌లో రైల్వేమంత్రి మల్లికార్జున ఖర్గే దక్షిణ మధ్య రైల్వేలో రెండు డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. వీటిలో ఒక రైలు కాచిగూడ నుంచి గుంటూరుకు, మరొకటి కాచిగూడ నుంచి వయా కాజీపేట మీదుగా తిరుపతికి నడిపించనున్నట్లు అధికారుల ద్వారా తెలిసిం ది. బడ్జెట్‌లో ప్రకటించిన కొద్ది రోజుల్లోనే కాజీపేట జంక్షన్‌కు రంగురంగుల డబుల్ డెక్కర్ ఏసీ రైలు రానే వచ్చింది.
శనివారం సాయంత్రం చేరుకున్న ఈ రైలును పంజాబ్‌లోని కపుర్తాలోని రైల్ కోచ్‌ఫ్యాక్టరీలో తయారు చేశారు. కాజీపేట అధికారులు మూడో నంబర్ ప్లాట్‌ఫాంపక్కనగల రైల్వే యార్డులో పార్కింగ్ చేశారు. కాజీపేట స్టేషన్‌మేనేజర్ ఎం.ఓదేలు, ఏరియా ఆఫీసర్ బీఆర్.కుమార్ ఇతర సూపర్‌వైజర్లు వెళ్లి తనిఖీచేశారు. కొద్దిరోజుల్లోనే ఈ రైలును కాచిగూడలో రైల్వేమంత్రిచే ప్రారంభించనున్నారు. కాజీపేట జంక్షన్‌కు చేరుకున్న డబుల్ డెక్కర్‌ను ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా తిలకించారు.
ప్రత్యేకతలు ఇవే..
ఈ రైలు ఇంజన్ ముందు, వెనక రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు ఉండగా 14 బోగీలు మొ త్తం ఏసీతో తయారు చేశారు. రైలు మొ త్తంలో 1680 మంది ప్రయాణికులు కూ ర్చునే సౌకర్యం ఉంది. ఒక డబుల్ డెక్కర్ కోచ్‌లో(కింద, పైన) కలిపి 120 మంది కూర్చుంటారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం నడిచే రైళ్లు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి. ఇందులో బయోమెటిక్ టాయ్‌లెట్స్ సౌకర్యం ఉంది.