సాక్షి ప్రతినిధి, కడప: గోదావరి, కృష్ణా పరిధిలో ఆదా చేసిన 70 టిఎంసీల నీటిని రాయలసీమకు మళ్లిస్తా.. రాబోవు జూలైలో కాలువ గట్టుపై నిద్రించైనా గండికోటలో నీరు నిల్వ చేస్తా.. గండికోట, మైలవరం ప్రాజెక్టులకు 35 టీఎంసీల నీరు తీసుకవస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం ఆయన గండికోట ప్రాజెక్టు సందర్శించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పులివెందుల రైతుల అభ్యర్థన మేరకు చీనీ తోటలకు నీరు ఇచ్చాం.. గండికోట ముంపు బాధితులకు న్యాయం చేస్తాం.. ప్రభుత్వ పరంగా రావాల్సిన పరిహారం తప్పకుండా అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
గండికోట, మైలవరంలో 35 టీఎంసీల నీరు నిల్వ చేసి సర్వారాయసాగర్ వరకూ నీరు ఇస్తామని, కడప జిల్లాకు సాగు, తాగునీరు అందిస్తామని తెలిపారు. భూగర్భజలాలు అడుగంటి 1200 నుంచి 1600 అడుగుల లోతుకు బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. భూగర్భజలాలను పెంపొందించే ప్రక్రియను ఎవరికి వారు వేగవంతం చేయాలన్నారు. తమ్ముళ్లూ మీరు ఒక్కసీటే గెలిపించారు.
అయినా కూడ వెనుకుబాటు తనం రూపుమాపేందుకు కృషి చేస్తాను. ఇప్పటికే స్టీల్ ప్లాంట్, టెక్స్‌టైల్ ఫార్కు ప్రకటించాను.. అవన్నీ చేసి తీరుతానని సీఎం పునరుద్ఘాటించారు. ఒంటిమిట్ట కోదండ రామునికి పట్టువస్త్రలు సమర్పించనున్నాం, టూరిజం సర్క్యూట్‌లో చేర్చి మరింత అభివృద్ధి చేస్తామని ఆయన వివరించారు. ఎట్టిపరిస్థితుల్లో గండికోటకు నీరు ఇచ్చి తీరుతామని భారీ నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. నిర్వాసితులకు అన్యాయం చేయమని స్పష్టం చేశారు. దగా పడిన రైతులందరికీ ప్రమోజనం చేస్తున్న ముఖ్యమంత్రికి పాదాభివందనమని శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి అన్నారు.
షేమ్..షేమ్...
తెలుగు ఊపిరి, తెలుగే మాట్లాడాలి, తెలుగు రాష్ట్రంలోనైనా తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ తెలుగురచయితల సమావేశంలో ఇటీవల పెద్ద పెద్ద వక్తలు పేర్కొన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న సభలో తెలుగు తప్పులు దొర్లాయి. ఆంధ్రప్రదేశ్‌ను ‘ఆంద్రప్రదేశ్’ పతాక శీర్షికన అక్షరాలు ముద్రించారు. మేధావులు, అత్యున్నతాధికారులు, అమాత్యులు పాల్గొన్న సభలో అక్షర దోషం ఉండడంపై పలువురు విమర్శించారు. గండికోటకు రెండు మార్లు శంకుస్థాపన చేసి తొమ్మిది సంవత్సరాలల్లో రూ.19 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారా అని చర్చంచుకోసాగారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే గండికోట ప్రాజెక్టు సాధ్యమైందని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
జూలైలో గండికోటకు నీరు!
Published Sat, Feb 28 2015 1:36 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM
Advertisement
Advertisement