సాక్షి, విజయవాడ : అన్నదాత ఆగ్రహం పెల్లుబికింది. సమైక్యాంధ్ర కోసం రైతులు దీక్షలు చేపట్టారు. సమైక్యంలోనే హరితాంధ్రప్రదేశ్ సాధ్యమని నినదించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గురువారం జిల్లాలోని మండల కేంద్రాల్లో రైతులు నిరాహార దీక్ష చేశారు. ఈ కార్యక్రమాలకు రైతులు దండులా కదలివచ్చారు. ‘విభజన వద్దు... సమైక్యాంధ్రే ముద్దు’ అంటూ గళం విప్పారు. విభజన జరిగితే నీటి యుద్ధాలు తప్పవని హెచ్చరించారు.
ఇప్పటికే పక్క రాష్ట్రాలతో జల జగడం జరుగుతోందని.. విభజన జరిగితే అది మరింత తీవ్ర రూపం దాల్చనుందని వైఎస్సార్‌సీపీ నేతలు రైతులకు వివరించారు. జలయుద్ధాలకు తోడు విద్యుత్ సంక్షోభం ఏర్పడనుందని వివరించారు. అవనిగడ్డలో ఆ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఏర్పాటుచేసిన రైతు దీక్షా శిబిరంలో నిరాహార దీక్ష నిర్వహించారు.
కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రైతు దీక్షలు జరిగాయి. హనుమాన్‌జంక్షన్‌లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. గుడివాడ, గన్నవరంలలో పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్షలు జరిగాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని మూడు మండల కేంద్రాలలో రైతు దీక్షలు నిర్వహించారు. వత్సవాయిలో ట్రాక్టర్లతో మక్కపేట నుంచి వత్సవాయి వరకు ర్యాలీ జరిపారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు సామినేని విశ్వనాథం, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తన్నీరు నాగేశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట మండలాల్లో రైతు దీక్షలు నిర్వహించారు. కోడూరు, మోపిదేవి, నాగాయలంక మండలాల్లో రైతులు దీక్షలు చేశారు.
వాడవాడలా ఉద్యమాలు...
జిల్లాలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు రిలేదీక్షలు, రాస్తారోకోలు, మానవహారాలు ముమ్మరంగా జరిగాయి. తిరువూరులో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రాస్తారోకో నిర్వహించారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల పరిధిలో సమైక్యాంధ్ర కోసం రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని మున్సిపల్ కూడలి సమీపంలో ఏర్పాటుచేసిన దీక్షా శిబిరంలో జేఏసీ సభ్యులు కూర్చున్నారు. కైకలూరు తాలూకా సెంటర్‌లో ఎన్జీవో దీక్షలు 58వ రోజుకు చేరాయి. వారికి మద్దతుగా కైకలూరు వివేకానంద యూత్ సభ్యులు రిలే దీక్షలు చేశారు. కలిదిండి జేఏసీ నాయకులు రిలే దీక్షలు చే పట్టారు.
కేంద్ర హోంమంత్రి షిండే దిష్టిబొమ్మను దహనం చేశారు. చల్లపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 62వ రోజుకు చేరాయి. మండల పరిధిలోని వక్కలగడ్డకు చెందిన రైతులు గ్రామం నుంచి ఊరేగింపు నిర్వహించి దీక్ష చేశారు. చల్లపల్లి ప్రధాన సెంటర్‌లో రహదారిపై నాగలితో దున్ని రైతులు నిరసన తెలియజేశారు. నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 64వ రోజుకు చేరాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జంక్షన్‌రోడ్డులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు గురువారం నాటికి 45వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్ ప్రారంభించారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా తిరువూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు తొమ్మిదోరోజుకు చేరాయి. నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ ఆధ్వర్యంలో బోసు సెంటర్లో ఏర్పాటుచేసిన శిబిరంలో పలువురు నాయకులు రిలేదీక్షలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు పిడపర్తి లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో ప్రారంభించిన రిలేదీక్షలు ఆరో రోజుకు చేరాయి. వైఎస్సార్‌సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి.
మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో జేఏసీ నాయకులు రిలే దీక్షలు చేశారు. తిరువూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు తొమ్మిదో రోజుకు చేరాయి. నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ ఆధ్వర్యంలో బోసు సెంటర్లో ఏర్పాటుచేసిన శిబిరంలో పలువురు నాయకులు రిలేదీక్షలు చేపట్టారు.
దిరిశం, కంచి నివాసాల వద్ద ధర్నా...
తిరువూరు ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి, రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ కంచి రామారావు నివాసాల వద్ద జేఏసీ నేతలు ధర్నా చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో జరిపారు. అవనిగడ్డ న్యాయవాదులు సమైక్యాంధ్ర చైతన్యయాత్రను ఘంటసాల మండలంలో నిర్వహించారు. అవనిగడ్డలో చేపట్టిన దీక్షలు 50వ రోజుకు చేరాయి. పామర్రులో 300 మీటర్ల జాతీయ జెండాతో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రదర్శన చేసి, మానవహారం నిర్మించారు. గుడివాడలో ఎన్జీవోల జేఏసీ, మున్సిపల్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. నందివాడ మండలం టెలిఫోన్ నగర్‌లో ఉపాధ్యాయులు దీక్షలు కొనసాగిస్తున్నారు. గుడ్లవల్లేరులో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.
విభజన జరిగితే.. నీటియుద్ధాలే..
Published Fri, Oct 11 2013 1:55 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
Advertisement