నైజీరియా పక్షుల సందడి లేదు.. | kannasamudram Pond Dried In West Godavari | Sakshi
Sakshi News home page

నైజీరియా పక్షుల సందడి లేదు..

Published Fri, Aug 2 2019 8:13 AM | Last Updated on Fri, Aug 2 2019 8:19 AM

Water Dried In Kannasamudram Pond In West Godavari - Sakshi

 నేడు నీరు లేక ఒట్టిపోయిన కన్నసముద్రం  

పెదవేగి మండలం కన్నసముద్రం(పెద్దచెరువు) నీరులేక ఒట్టిపోయింది. ఆక్రమణల వల్ల ఈ దుస్థితి నెలకొంది. ఫలితంగా 1800 ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకమైంది. నీరులేక సాగుకు దూరమైన భూములను వైఎస్సార్‌ సీపీ నేత ఆలపాటి నరసింహమూర్తి, రైతులు చూపిస్తున్న దృశ్యమిది..

సాక్షి, పశ్చిమగోదావరి : పెదవేగి మండలంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కన్నసముద్రం(పెద్ద చెరువు) చుక్క నీరు లేకుండా ఒట్టిపోయింది. ఈ చెరువుకు శతాబ్దాల చరిత్ర ఉంది. 1625లో నూజివీడు జమిందారు మేదిన రాయుడు  తన తల్లి  కన్నమాంబ పేరిట ఈ సముద్రం తవ్వించారు. అప్పటి నుంచి పెదవేగి, దెందులూరు మండలాలకు తాగు, సాగునీరు అందించేది. కాలక్రమంలో చెరువుకు నీరొచ్చే మార్గాలను కొందరు ఆక్రమించుకోవడంతో చెరువు కుంచించుకుపోయింది. ఈ చెరువుకు 600 మీటర్ల దూరంలో పోలవరం కాలువ వెళ్తున్నా.. ఆ నీటిని చెరువుకు మళ్లించే ప్రయత్నం చేయలేదు. గత టీడీపీ హయాంలో ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ చెరువు పరిధిలో అప్పట్లో 18 వందల ఎకరాలకు సాగునీరు అందేది. సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ దొర దీనిని సందర్శించి మెచ్చుకున్నారని చెబుతారు. గతంలో కన్నసముద్రంలో ఏడాది పొడవునా నీరుండేది. నూజివీడు జమిందారు ఏనుగులకు స్నానాలు చేయించేందుకు ఇక్కడకు తీసుకొచ్చే వారంటే దీనికున్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు, అలాంటి చెరువులో ఆగస్టు నెల వచ్చినా చుక్క నీరు లేకుండా పోయింది. చెరువు ఎండిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో సాగు, తాగు నీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

టీడీపీ ప్రభుత్వం నిర్వాకం వల్లే..
టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈ చెరువు అభివృద్ధిని కనీసం పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం కాలువ నుంచి నీరు ఇచ్చే ఏర్పాటు చేసుంటే తమ పొలాలు సస్యశ్యామలం అయ్యేవని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆలపాటి నరసింహమూర్తి చెప్పారు. నేడు నీరు లేక, భూగర్భజలాలు అడుగంటిపోయి ఒక్క ఎకరా పండని దుస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

నైజీరియా పక్షుల సందడి లేదు
జూన్‌ నెల వస్తే గతంలో ఈ చెరువు ప్రాంతానికి నైజీరియా నుంచి వివిధ పక్షులు వచ్చి నవంబర్, డిసెంబర్‌ వరకూ ఉండేవి. చెరువు ఒట్టిపోవడంతో నేడు ఒక్క పక్షి జాడ కూడా లేదు. అటు రైతులకు మేలు చేయడమే కాకుండా వివిధ పక్షులకు ఆవాసంగా ఉన్న ఈ కన్నసముద్రం నేడు కన్నీరు పెడుతోంది. చెరువుకు కేవలం 600 మీటర్ల దూరంలో పోలవరం కుడికాలువ నుంచి నీటిని అందించే ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

గతంలో నీటిలో కళకళలాడుతున్న కన్నసముద్రం

2
2/2

నైజీరియా పక్షులకు ఆశ్రయమిచ్చే చెట్లు ఇవే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement