
సాక్షి, రాయచోటి: వైఎస్సార్ జిల్లా చిన‍్నమండెం మండలంలోని శ్రీనివాసపురం రిజర్వాయర్‌కు శనివారం అర్ధరాత్రి గండిపడింది. పంట పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. విద్యుత్ స్థంభాలు నేల వాలాయి. ప్రాజెక్టులోని నీరు ఖాళీ అవుతోంది. ఆదివారం మధ్యాహ‍్నం వరకూ సహాయక చర్యలు చేపట్టేందుకు ఒక్క అధికారి కూడా సంఘటనా స్థలానికి రాకపోవడంతో రైతులు, స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రిజర్వాయర్ ఎగువ గేటు తెగిపోవడంతో భారీగా గండి ఏర్పడింది. పంట పొలాలను వరద నీరు ముంచెత్తడంతో అవి చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికే సుమారు 50 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. విద్యుత్ స్థంభాలు సైతం నేలవాలాయి.
రెండు నెలల క్రితం భారీ వర్షాలు రావడంతో ఓ మోస్తారు నీరు ప్రాజెక్టులో వచ్చి చేరింది. రిజర్వాయర్ కు గండి పడటంతో 10 చెరువులు, 15 కుంటలకు గండి పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చెరువుల సమీపాల్లో దాదాపు 1000 ఎకరాల పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం కూడా పొంచి ఉంది. రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్, వ్యవసాయ అధికారులు ఇంతవరకూ ఆ ప్రక్కకు తొంగిచూడలేదని స్థానికులు వాపోతున్నారు.
హత్యాయత్నంలో భాగంగానే...
తనపై హత్యా ప్రయత్నంలో భాగంగానే ప్రాజెక్టుకు అధికార పార్టీ నాయకులు గండి కొట్టారని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ రామ లక్షుమమ్మ, ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. తాము చేస్తున‍్న అభివృధ్ధిని చూసి ఓర్వలేక తమపై ఈవిధంగా హత్యాయత్నానికి ఒడిగట్టారని, ప్రాజెక్టుకు గండి పడటం వెనుకఅధికార పార్టీ నాయకుల కుట్ర ఉందని ఆరోపించారు. భారీ వర్షాలు పడినా ఎప్పుడు గండి పడలేదని, ప్రాజెక్టుకు వర్షాలులేని సమయంలో గండి పడటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోందని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment