సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం విజయవాడ సమీపంలో ప్రతిపాదించిన భూమిలో ఇక నుంచి సాగు ఉండదు కనుక ఆ ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుంచి అందుతున్న నీరు ఇక నుంచి అవసరం ఉండదు కదా! అని తెలంగాణ ప్రశ్నించింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో శుక్రవారం కూడా విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ తరఫున సాక్షి అయిన సాగునీటి రంగ నిపుణులు కేవీ సుబ్బారావును తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
రాజధాని ప్రాంతానికి సాగునీరు అవసరం లేదని ప్రశ్నించగా.. ఏపీ సీఆర్‌డీఏ రాజధానికి 217.23 చ.కి.మీ భూమిని ప్రతిపాదించిందని, ఇది ప్రస్తుతానికి ఒక డ్రాఫ్ట్ ప్లాన్ అని, ఇక్కడ రాజధాని నిర్మించడం వల్ల వైకుంటపురం పంపింగ్ స్కీం కిందకు వచ్చే ఆయకట్టు మాత్రమే దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఏపీ నూతన రాజధాని కోర్ క్యాపిటల్ ఏరియా 2,380 చ.కి.మీ పరిధిలో ఉందని వైద్యనాథన్ ప్రశ్నించగా.. తనకు ఉన్న సమాచారం మేరకు 217 చ.కి.మీటర్లేనని సుబ్బారావు చెప్పారు. కృష్ణా డెల్టా చాలా వరకు ప్రకాశం బ్యారేజీ దిగువకు వస్తుందని, ప్రతిపాదిత రాజధాని ఎగువన ఉందని, ఈ ప్రాంతంలో సాగుభూమిని తగ్గించబోరని సుబ్బారావు సమాధానం చెప్పారు.
విచారణ నవంబర్‌కి వాయిదా..
క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా వివిధ ప్రశ్నలకు సుబ్బారావు ముందుగానే సిద్ధం చేసిన నోట్‌ను చూసి చదవడంపై వైద్యనాథన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. సాక్షిగా తనకు ఉన్న సమాచారం మాత్రమే సుబ్బారావు వెల్లడించాలని, కానీ ఆయన ఎవరో రాసిచ్చిన సమాచారాన్ని చదువుతున్నారని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సుబ్బారావు స్పందిస్తూ.. వివిధ అంశాలకు సంబంధించి తాను ముందుగానే నోటు సిద్ధం చేసుకున్నానని, అదే చెబుతున్నానని బదులిచ్చారు.
ఇలా ముందు ముందు సాగితే అంగీకరించబోమని వైద్యనాథన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ట్రిబ్యునల్ కల్పించుకొని ‘మీ ప్రశ్నలను ముందుగానే ఊహించారేమో!’అని వ్యాఖ్యానించింది. ఇక పట్టిసీమ ప్రాజెక్టు నుంచి గత మూడేళ్లుగా 101.25 టీఎంసీల నీరు ఎత్తిపోశామని, కృష్ణా డెల్టాకు 152.2 టీఎంసీల నీరు అవసరమని, కేడబ్ల్యూడీటీ– 1 కేటాయించిన నీటిని వినియోగించుకోవడానికి పులిచింతల రిజర్వాయర్‌ను నాగార్జున సాగర్ కుడి కాలువకు కలిపి అక్కడి నుంచి ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అదనపు ఆయకట్టుకు నీరివ్వడంపై పరిశీలిస్తామని పలు ప్రశ్నలకు సుబ్బారావు సమాధానం చెప్పారు. తదుపరి విచారణను ట్రిబ్యునల్ వచ్చే నెల 15, 16, 17వ తేదీలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment