వేతనాల కోసం ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వేతనాల కోసం నల్లగొండ జిల్లాలో ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం నుంచి సమ్మెకు దిగారు. దీంతో జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు కృష్ణా నీరందడం లేదు. ఈ సమ్మె కారణంగా జంటనగరాల ప్రజలకు మంచినీటి ఎద్దడి ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌కు నేరుగా వెళ్లే పైప్‌లైన్ల ద్వారా నీరు సరఫరా అవుతోంది. కానీ, మెట్రో వాటర్‌వర్క్స్ ప్లాంట్లలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు నిత్యం 30 లక్షల గ్యాలన్ల నీరందించే పైపులైన్లలో సరఫరా నిలిచిపోయింది. 800 మంది కాంట్రాక్టు ఉద్యోగులైన లైన్‌మన్లు, ఫిట్టర్లు, ఆపరేటర్లతోపాటు కూలీ పనులు చేసేవారంతా సమ్మెబాట పట్టారు. దీంతో జిల్లావ్యాప్తంగా కృష్ణా తాగునీరందాల్సిన 650 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు నీరు సరఫరా కావడం లేదు.
హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్‌కు చెందిన గొండగండ్ల, నసర్లపల్లి ప్లాంట్లలో వాటర్‌మన్లు కూడా సమ్మెలోకి వెళ్లారు. దీంతో శుక్రవారం రంగారెడ్డి జిల్లాకూ నీరు సరఫరా కాలేదు. గడిచిన ఐదు నెలలుగా కార్మికులు వేతనాల కోసం పడిగాపులు గాస్తున్నారు. వేతనాల, పీఎఫ్ సొమ్ముతో పాటు పథకాల నిర్వహణ బడ్జెట్ బకాయిలు మొత్తంగా రూ.40 కోట్ల దాకా పేరుకుపోయాయి. దీంతో తమ బకాయిలు రాబట్టుకోవడానికి కార్మికులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేక చివరకు సమ్మెబాట పట్టారు. మరోవైపు శనివారంలోగా వేతనాలు చెల్లించకుంటే తామూ సమ్మెలోకి వెళతామని ఏఐటీయూసీకి అనుబంధంగా ఉన్న కాంట్రాక్టు కార్మిక సంఘం ప్రకటించింది.
జంటనగరాలకు నీటి ముప్పు!
Published Sat, Sep 21 2013 3:22 AM | Last Updated on Tue, Oct 2 2018 7:51 PM
Advertisement