పాచికల పాడుకు నీటి గండం పట్టుకుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. నెల రోజులుగా గుక్కెడు నీరందక గ్రామస్తులు అల్లాడుతున్నారు. బోర్లలో నీరు అడుగంటడంతో పొలాల వద్దకు పరుగులు తీస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఎద్దుల బండ్లు, సైకిళ్లలో బిందెలు పెట్టుకుని నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పశువులున్న వారి పరిస్థితి అయితే చాలా కష్టంగా ఉంది.
పాచికలపాడు (కమలాపురం), న్యూస్‌లైన్: కమలాపురం మండలం పాచికలపాడు గ్రామానికి చెందిన ప్రజలు నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నారు. గ్రామానికి చెందిన బోరు ఎండిపోవడంతో దాదాపు నెల రోజు లుగా నీరందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమీప గ్రామాలైన గోపులాపురం, చదిపిరాళ్ల తదితర గ్రామాల్లోని వ్యవసాయ పొలాల వద్దకు పరుగులు తీస్తున్నారు. ద్విచక్ర వాహనాల్లో, ఎద్దుల బం డ్లల్లో, సైకిళ్లలో బిందెలు కట్టుకుని నీరు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు. పశువులున్న వారి పరి స్థితి చాలా ఇబ్బందిగా ఉంది. పశు యజమానులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీను తెచ్చుకోవడానికే సమయం వెచ్చించాల్సి వస్తోంది. రాజకీయ నాయకులు, అధికారులు కనీసం ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రోడ్డు వసతి సరిగా లేకపోవడంతో ఇతర గ్రామాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాలన్నా కష్టమవుతోందన్నారు. కుందూ నది నుంచి ఎర్రగుంట్లకు వెళ్లే పైప్‌లైన్ నుంచి వచ్చే నీరు రాకుండా వాల్వ్ బిగించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ హరీష్‌తో ప్రస్తావించగా తన దృష్టికి రాలేదని, తక్షణం గ్రామానికి వెళ్లి నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
9గంటల నుంచి నీరు తెస్తున్నా
ఉదయం 9గంటల నుంచి చదిపిరాళ్లకు వెళ్లి నీరు తెస్తున్నా. మధ్యాహ్నం అవుతున్నా ఇంకా సరిపోలేదు. నాకు మూడు ఎనుములున్నాయి. ప్రతి రోజు కనీసం 40బిందెల నీరు కావాలి. చదిపిరాళ్లకు వెళ్లి నీరు తెచ్చుకోవాలంటే దాదాపు రూ.100పెట్రోల్ అవుతోంది. నాకన్నా ఎక్కువ పశువులున్న వారు చాలా మంది ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటి?
- ఈశ్వర్‌రెడ్డి, పాచికలపాడు
నెల నుంచి ఇబ్బందే
నీటి కోసం నెల రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం. ప్రతి రోజు ఇతర గ్రామాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఆ గ్రామాలకే నీరు సరిపోవడం లేదు. మేము వెళ్తే కాదనలేక నీరు ఇస్తున్నారు. అధికారులు స్పందించి మరో బోర్ వేయడమో, ఎర్రగుంట్ల లైన్ నుంచి నీరు అందించడమో చేయాలి.
- సుబ్బారెడ్డి, పాచికలపాడు
పల్లె జనానికి ఎక్కిళ్లు..
Published Sat, Jun 7 2014 1:58 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement