జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేస్తున్న తోటపల్లి మహిళలు
గరుగుబిల్లి: నాగావళినది చెంతనే ఉన్నా గుక్కెడు నీటికోసం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే అధికారులే లేరంటూ తోటపల్లి గ్రామ మహిళలు ధ్వజమెత్తారు. వేంకటేశ్వరస్వామి ఆలయం పక్కనున్న జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో శుక్రవారం ధర్నా, రాస్తారోకో చేశారు. దీంతో వాహనాల రాకపోలకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టుకు పక్కనే గ్రామం ఉన్నప్పటికీ బోర్ల నుంచి చుక్కనీరు రావడంలేదన్నారు. తాగునీటికోసం నరకయాతన పడుతున్నామన్నారు. తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనుల నెపంతో గడచిన ఐదునెలల నుంచి కాలువల ద్వారా నీటిసరఫరాను ఇరిగేషన్ అధికారులు నిలుపుదల చేశారన్నారు. దీంతో బోర్లు, బావులు దాదాపుగా ఎండిపోయాయని వాపోయారు. నందివానివలస, గౌరీపురం, సంతోషపురం, ఖడ్గవలస తదితర గ్రామాల ప్రజలు, మూగజీవాలు గుక్కెడు నీటికోసం అల్లాడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారని మండిపడ్డారు. బోర్ల నుంచి నీరు రాకపోవడంతో బిందెడు నీటికోసం అష్టకష్టాలు పడుతున్నామన్నారు. బోర్లు పనిచేయడం లేదని అధికారులకు ఫిర్యాదు చేస్తే బాగుచేశామంటూ ఉత్తుత్తినే ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని మహిళలు హెచ్చరించారు.
ఆందోళన ఉద్ధృతం చేస్తాం...
తోటపల్లి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణం అధికారులు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఉరిటి రామారావు అన్నారు. సమస్యను తెలుసుకొన్న వెంటనే స్థానిక ఎంపీడీఓ చంద్రకుమారితో ఫోన్లో మాట్లాడారు. మహిళలు రోడ్డెక్కారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవాలని ఎంపీడీఓను కోరారు. దీంతో ఎంపీడీఓ పి.చంద్రకుమారి, ఈఓపీఆర్‌డీ ఎం.వి.గోపాలకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ కె.రాహుల్‌కుమార్‌లు హుటాహుటిన తోటపల్లికి చేరుకొని బోర్లు పరిస్థితిని పరిశీలించారు. తాగునీటి సమస్యలేకుండా అవసరమైన చర్యలు చేపడతామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment